అయ్యో భగవంతుడా.. దశదిన కర్మలో భోజనం చేశారు అంతే.. ఒకేసారి ఐదుగురు..

ఓ వ్యక్తి అంత్యక్రియలకు బంధువులతో పాటు గ్రామస్థులు హాజరయ్యారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన విందులో భోజనం చేశారు. అంతే.. వారం తిరిగేసరికి అందులో ఐదుగురు మరణించారు. అందులో 2 నెలల శిశివు ఉండడం గమనార్హం. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది..? వైద్యులు చెబుతున్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఓర్చా డెవలప్‌మెంట్ బ్లాక్ పరిధిలోని దుంగా గ్రామంలో అంత్యక్రియల తర్వాత ఏర్పాటు చేసిన విందు ఐదుగురి మరణాలకు కారణమైంది. కలుషిత ఆహారం తినడం వల్ల ఒకే వారంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరికొంతమంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో బుధారి (25), బుధరామ్ (24), లక్ఖే (45), ఊర్మిళ (25) తో పాటు రెండు నెలల శిశువు కూడా ఉన్నారు. కలుషిత ఆహారం కారణంగానే శిశువు మరణించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 21న కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల మరణాలు సంభవించినట్లు తమకు నివేదికలు అందాయని నారాయణ్‌పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కున్వర్ తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత అక్టోబర్ 14, అక్టోబర్ 20 మధ్య ఐదుగురు మరణించినట్లు తమకు తెలిసిందని చెప్పారు. అక్టోబర్ 14న జరిగిన అంత్యక్రియల విందుకు హాజరైన గ్రామస్తులు ఆ తర్వాత వారం రోజుల్లోనే వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మరణించారు.
కలెక్టర్ ప్రతిష్ఠ మాంగై ఆదేశాల మేరకు.. నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల CMHOలు, ఓర్చా బ్లాక్ మెడికల్ ఆఫీసర్తో కూడిన వైద్య బృందం వెంటనే గ్రామాన్ని సందర్శించింది. ఈ క్రమంలో గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 25 మంది గ్రామస్తులను పరీక్షించగా వారిలో 20 మందికి వాంతులు, విరేచనాలు, ఇద్దరికి మలేరియా ఉన్నట్లు, మరో ముగ్గురికి ఇతర అనారోగ్యాలు ఉన్నట్లు గుర్తించారు. 60 ఏళ్ల వయస్సు గల ఒక మహిళను మరింత మెరుగైన చికిత్స కోసం భైరామ్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య బృందం గ్రామంలోనే ఉండి ప్రజలకు చికిత్స అందిస్తోంది. గ్రామస్తులు తప్పనిసరిగా తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలని, మరిగించిన నీరు తాగాలని అధికారులు సూచించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
