‘గూగుల్ పే’తో రూ.94 వేలు గుటుక్కు

Teluguwonders:
సైబర్ నేరస్థులు పంథా మార్చారు. ఇప్పటివరకు తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చి బాధితుల నుంచి డబ్బు లాగేసేవారు. ఇప్పుడు కొత్త తరహాలో మోసానికి తెర లేపారు. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలను చూసి పాత వస్తువులను కొంటామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణా పరిధిలో గురువారం ఓ ఉదంతం వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే మానేసిన కొండాపూర్‌కు చెందిన ఓ మహిళ నేరస్థుల బారినపడి మోసపోయింది. ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పాత ఫ్రిజ్‌ను విక్రయించేందుకు ఆమె ప్రకటన ఇచ్చింది. రూ.18 వేలకు విక్రయిస్తానంటూ పేర్కొంది. ఆ ప్రకటన చూసి ఓ అపరిచితుడు ఆమెకు ఫోన్ చేశాడు.
ప్రకటనలోని ఫ్రిజ్ చిత్రాన్ని చూశానని.. తనకు నచ్చిందని చెప్పాడు. అడిగినంత సొమ్ము చెల్లిస్తానని అంగీకరించాడు. ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బు పంపించిన తర్వాతే వస్తువు తీసుకెళతాననీ చెప్పాడు.
నిజమేనని బాధితురాలు నమ్మడంతో ఆ అపరిచితుడు పాచిక విసిరాడు. గూగుల్‌పే యాప్‌కు అనుసంధానమై ఉన్న చరవాణి నంబరు చెబితే డబ్బు పంపిస్తానన్నాడు. బాధితురాలు ఆ నంబరు చెప్పడంతో అపరిచితుడు వెంటనే తన ప్రణాళికను అమలు చేశాడు. తొలుత రూ.7వేలు పంపిస్తున్నానని చెప్పాడు.
మరోవిడతగా మరింత సొమ్ము పంపిస్తున్నానన్నాడు. అలా ఆమెను నమ్మిస్తూ గూగుల్‌పే యాప్‌కు తాను పంపించే సందేశాలను యాక్సెప్ట్ చేయాలని సూచించాడు. అయిదు విడతలుగా ఆమె అలాగే చేయడంతో మొత్తం ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.94 వేలు మాయమయ్యాయి. మోసగాడు ఆమెకు డబ్బు పంపించే మిషతో ఆమె ఖాతా నుంచే డబ్బు లాగేసుకున్నాడని తేలింది.
గూగుల్‌పే యాప్‌లో ‘పే’ బదులుగా ‘యాక్సెప్ట్’ ఆప్షన్‌ను ఎంచుకొని మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఓఎల్‌ఎక్స్ మోసాల్లో ఆరితేరిన భరత్‌పూర్ నేరస్థులే ఇలా పంథా మార్చి డబ్బు కొల్లగొడుతున్నట్లు అనుమానిస్తున్నారు. అందుకే గూగుల్‌పే యాప్‌లో లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
