అనుకోకుండా ఓ బంతి

IMG-20200908-WA0012.jpg

*అనుకోకుండా ఓ బంతి..*

*పొరపాటున లైన్‌ అంపైర్‌ను గాయపరిచిన జకోవిచ్‌*

*యుఎస్‌ ఓపెన్‌లో ప్రపంచ నం.1పై వేటు* *క్వార్టర్స్‌లో సెరెనా, ఒసాక*

*ఈసారి యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ జకోవిచ్‌దే అనని టెన్నిస్‌ అభిమాని ఉండడేమో..! ఫెదరర్‌, నాదల్‌ టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడికి ఎదురునిలిచే ఆటగాడే కనిపించలేదు. కానీ ఊహించని విధంగా ఓ బంతి జకోవిచ్‌ కథను ముగించింది. జకోదే అనుకున్న గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అతడికి దూరం చేసింది. 20వ సీడ్‌ ఆటగాడు పాబ్లోతో ప్రిక్వార్టర్స్‌లో ఓ గేమ్‌ కోల్పోయిన కోపంలో.. కోర్టు మూలకు బంతిని కొట్టే ప్రయత్నంలో.. జకోవిచ్‌ లైన్‌ అంపైర్‌ను గాయపరిచాడు. జకోవిచ్‌ ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయనప్పటికీ.. గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం అతడిపై వేటు తప్పలేదు._* _అనూహ్య పరిణామాల నేపథ్యంలో టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) యుఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు._ నిగ్రహం కోల్పోయిన అతను దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో పాబ్లో (స్పెయిన్‌)తో మ్యాచ్‌లో తొలి సెట్‌లో 5-6తో వెనకబడ్డ దశలో చేసిన పొరపాటు కారణంగా జకోను టోర్నీ నుంచి తప్పించారు. దీంతో పాబ్లో ముందంజ వేశాడు. ఈ సీజన్‌లో వరుసగా 26 మ్యాచ్‌లు గెలిచిన జకోవిచ్‌ అనూహ్య రీతిలో ఓటమి మూటగట్టుకున్నాడు. 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంతో జకోవిచ్‌ యుఎస్‌ ఓపెన్‌ బరిలో దిగాడు. అతడికంటే ఫెదరర్‌ (20), నాదల్‌ (19) మాత్రమే ముందున్నారు. మరోవైపు అయిదో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. అతను 6-2, 6-2, 6-1తో డేవిడోవిచ్‌ (స్పెయిన్‌)ను చిత్తుచేశాడు. మరోమ్యాచ్‌లో ఏడో సీడ్‌ గొఫిన్‌ (బెల్జియం)పై 12వ సీడ్‌ షపోలోవ్‌ (కెనడా) విజయం సాధించాడు. 3 గంటల 30 నిమిషాల పాటు సాగిన పోరులో అతను 6-7 (0/7), 6-3, 6-4, 6-3తో గొఫిన్‌ను ఓడించాడు. ఓపెన్‌ శకంలో యుఎస్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరిన తొలి కెనడా ఆటగాడిగా షపోలోవ్‌ రికార్డు సృష్టించాడు. కొరిచ్‌ (క్రొయేషియా) 7-5, 6-1, 6-3తో థామ్సన్‌పై నెగ్గాడు. *సెరెనా ముందుకు:* మహిళల సింగిల్స్‌లో రికార్డు టైటిల్‌పై కన్నేసిన సెరెనా.. ప్రిక్వార్టర్స్‌లో చెమటోడ్చి నెగ్గింది. 6-3, 6-7 (6-8), 6-3తో మరియా సక్కరి (గ్రీస్‌)పై విజయం సాధించింది. ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఎనిమిదో సీడ్‌ మార్టిచ్‌ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. ప్రపంచ 12వ ర్యాంకు క్రీడాకారిణి క్విటోవా 6-7 (5/7), 6-3, 6-7 (6/8)తో 93వ ర్యాంకర్‌ రోజర్స్‌ (యుఎస్‌ఏ) చేతిలో పరాజయం పాలైంది. మార్టిచ్‌ 3-6, 6-2, 4-6తో పుతింత్సెవా (కజకిస్థాన్‌) ముందు తలవంచింది. ఫేవరేట్‌గా బరిలో దిగిన మార్టిచ్‌కు ప్రత్యర్థి షాక్‌ ఇచ్చింది. మరోవైపు నాలుగో సీడ్‌ ఒసాక (జపాన్‌) టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-4తో 14వ సీడ్‌ కొంటావీట్‌ (ఈస్థోనియా)ను ఓడించింది. పూర్తిస్థాయి ఆటతో చెలరేగిన ఒసాక 4 ఏస్‌లు, 21 విన్నర్లు కొట్టింది.

*జకో.. చేజేతులా*

పాబ్లోతో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో జకో 5-4తో గెలుపు దిశగా సాగాడు. సెట్‌ పాయింట్‌కూ చేరుకున్నాడు. కానీ అనవసర తప్పిదాలతో మూడు సార్లు సెట్‌ పాయింట్‌ అవకాశాలను చేజార్చుకున్నాడు. ఆ తర్వాతి గేమ్‌నూ కోల్పోయి 5-6తో వెనకబడడంతో తీవ్ర అసహనానికి లోనై బంతిని తన ఎడమవైపునకు గట్టిగా కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి అక్కడ ఉన్న లైన్‌ అంపైర్‌ గొంతుకు బలంగా తాకింది. ఆమె నొప్పితో బాధపడుతూ కుప్పకూలింది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న అతను వెంటనే ఆమె దగ్గరికి వెళ్లాడు. క్షమాపణలు చెప్పడంతో పాటు తన పరిస్థితేంటో అడిగి తెలుసుకున్నాడు. వెంటనే టోర్నీ రిఫరీ సోరెన్‌ ఫ్రీమెల్‌, గ్రాండ్‌స్లామ్‌ సూపర్‌వైజర్‌ ఆండ్రియాస్‌ ఎగ్లీ, చెయిర్‌ అంపైర్‌ ఆరెలీ టార్టె ఆమె దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత రిఫరీ జకోవిచ్‌తో మాట్లాడాడు. తాను కావాలని అలా చేయలేదని, పొరపాటున తగిలిందని జకో సంజాయిషీ ఇచ్చాడు. పది నిమిషాల పాటు అతనితో చర్చించిన తర్వాత నిబంధనల ప్రకారం జకోవిచ్‌ను టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు రిఫరీ ప్రకటించాడు. దీంతో అతను తన బ్యాగు సర్దుకుని కోర్టు నుంచి వెళ్లిపోయాడు. మీడియా సమావేశానికి కూడా హాజరు కాలేదు. జకోవిచ్‌ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. అతని కారణంగా లైన్‌ అంపైర్‌ గాయపడిందని, నిబంధనల ప్రకారం అతణ్ని టోర్నీ నుంచి తప్పించామని రిఫరీ చెప్పాడు.

*తప్పు చేశా.. క్షమించండి:*

‘‘జరిగిన సంఘటన నన్ను విచారంలోకి నెట్టేసింది. ఆ లైన్‌ అంపైర్‌ బాగానే ఉందని టోర్నీ నిర్వహకులు చెప్పారు. ఆమెకు బాధ కలిగించినందుకు క్షమాపణలు చెపుతున్నా. అది అనాలోచితంగా జరిగిన తప్పు. నా ఎదుగుదలతో పాటు ఓ ఆటగాడిగా, మనిషిగా మరింత వికాసం పొందేందుకు ఇదో పాఠంగా భావిస్తా’’ – *ఇన్‌స్టాగ్రామ్‌లో జకోవిచ్‌*_

*ఇదీ నిబంధన:* గ్రాండ్‌స్లామ్‌ నిబంధనల ప్రకారం మాటలతో కానీ, బంతితో కానీ లేదా రాకెట్‌తో కానీ కోర్టులో ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, గాయపర్చినా ఆ ఆటగాడిని టోర్నీ నుంచి తప్పించే అధికారం రిఫరీకి ఉంటుంది. అతను తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన ప్రకారం అతను ఈ టోర్నీలో గెలిచిన ర్యాంకింగ్‌ పాయింట్లు, నగదు బహుమతి కోల్పోతాడు.

*వీళ్లూ అలాగే:*

1995 వింబుల్డన్‌లో టిమ్‌ హెన్మన్‌ను ఇలాగే టోర్నీ నుంచి తప్పించారు. పాయింట్‌ కోల్పోయిన కోపంతో అతను బంతిని బలంగా నెట్‌ వైపు కొట్టాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాల్‌గర్ల్‌కు అది తగిలింది. 2017 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో షపోవలోవ్‌ బంతిని స్టాండ్స్‌లోకి కొట్టబోయి పొరపాటున చెయిర్‌ అంపైర్‌ను గాయపరచడంతో అతణ్ని టోర్నీ నుంచి తప్పించారు. 2016 ఇస్తాంబుల్‌ ఓపెన్‌లో రాకెట్లను విరగ్గొట్టినందుకు గాను దిమిత్రోవ్‌కు ఇదే శిక్ష విధించారు. నిబంధనలు అతిక్రమించినందుకు గతంలో మెకన్రో, అగస్సీలపై కూడా వేటు పడింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights