చిటికెలో వెయ్యి హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్

*చిటికెలో వెయ్యి హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్!* *ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటా* *ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ప్రయోగం* మెల్‌బోర్న్: మనకు నచ్చిన సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి నిమిషాల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం భవిష్యత్‌లో ఉండదు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సాధించారు. దీంతో వెయ్యి హై డెఫినిషన్ (హెచ్‌డీ) సినిమాలను సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. *ఒకే ఆప్టికల్ చిప్‌ను ఉపయోగించి ఈ ఘనతను సాధించారు.* ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్ కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఆవిష్కారం తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధనలో భాగంగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఒకే కాంతి వనరు నుంచి సెకనుకు 44.2 టెరాబిట్ల (టీబీపీఎస్) డేటా వేగాన్ని సాధించారు. వీరు మెల్‌బోర్న్‌లోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయం నుంచి క్లేటన్‌లోని మోనాష్ వర్సిటీ మధ్య 76.6 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్లపై దీన్ని ప్రయోగించి చూశారు. ఈ పరిశోధనలో ‘మైక్రో కోంబ్’ అనే కొత్త పరికరాన్ని ఉపయోగించారు. 80 లేజర్లకు సమానమైన సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతమున్న టెలికం హార్డ్‌వేర్ కన్నా మైక్రో కోంబ్ చాలా చిన్నగా ఉంది. ఈ సాధనం ఇంద్ర ధనస్సులా వందలాది, అత్యంత నాణ్యమైన అదృశ్య, పరారుణ లేజర్లను వెదజల్లుతుంది. ఒక్కో లేజర్‌ను ప్రత్యేక కమ్యూనికేషన్ మార్గం (ఛానల్)గా ఉపయోగించుకోవచ్చు. ఈ మైక్రో కోంబ్‌ను రెండు వర్సిటీల మధ్య ఉన్న ఆప్టికల్ ఫైబర్లకు శాస్త్రవేత్తలు అనుసంధానించారు. ఒక్కో ఛానల్ గుండా గరిష్ఠ డేటాను బట్వాడా చేశారు. ఈ క్రమంలో 44.2 టీబీపీఎస్ డేటా వేగాన్ని సాధించారు. *భవిష్యత్ అవసరాలు తీరేలా..* కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది.. ఇంటి నుంచి పనిచేయడానికి, సామాజిక సంబంధాల కోసం, వీడియోల స్ట్రీమింగ్ కోసం భారీగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లలో ఇంటర్నెట్ మౌలిక వసతులకు రాబోయే సాధారణ డిమాండ్‌కు ఇది దర్పణం పడుతోంది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి తాజా ఆవిష్కారం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. విస్తృత స్థాయిలో కమ్యూనికేషన్ సేవలతో పాటు స్వయం చోదిత కార్లు, భవిష్యత్ రవాణా వ్యవస్థలు, వైద్యం, విద్య, ఆర్థిక రంగం, ఈ-కామర్స్ పరిశ్రమలకూ లబ్ధి చేకూరుస్తుందని వివరించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
