Israel-Gaza War: నిలువెల్లా గాయాలతో గాజా విధ్వంస గీతిక.. మారణహోమంలో 67వేల మంది మృతి

gaza-2

హమాస్‌ ఏరివేత సంగతేమో గానీ, గాజా మాత్రం ఖల్లాస్‌ అయిపోయింది. రెండేళ్ల పాటు ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో… గాజాలో 67వేలమంది దాకా మరణించారు. లక్షలమంది గాయపడ్డారు. గాజాకు కలిగిన గాయాలు, నష్టాల విధ్వంస గీతిక.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన మారణహోమం గురించి వింటే మతి పోతోంది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన నెత్తుటి సంతకం తాలుకూ విధ్వంస చిత్రం ఇది.

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు చేసింది. 1200మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరుల ప్రాణాలను బలిగొంది. మరో 250మంది ఇజ్రాయెలీలను బందీలుగా గాజాకు పట్టుకుపోయింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు చేసింది. రెండేళ్ల పాటు జరిగిన ఈ దాడులు.. గాజాకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాదిమంది పౌరుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈ దాడుల్లో.. 67 వేలమందికిపైగా పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. గంటకు ఇక చిన్నారి చొప్పున, ఈ మారణహోమంలో సమిధలైపోయారు. 1.70 లక్షలమంది గాయపడ్డారు. లెక్క పెట్టలేనన్ని గాయాలతో గాజా నెత్తురోడుతోంది. రోదిస్తూ బతుకీడుస్తోంది.

నిరాశ్రయులుగా మారిన 90 శాతం.. ఆకలిచావు బారినపడ్డ 459మంది

ఇక గాజా జనాభాలో 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. మరణ మృదంగంతో పాటు కరువు, సంక్షోభం, ఆకలి కేకలు కూడా గాజాను చుట్టుముట్టాయి. యుద్ధానికి ముందు 365 చదరపు కిలోమీటర్లమేర విస్తరించిన గాజా భూభాగంలో 21 లక్షలమంది పాలస్తీనీయన్లు నివసించేవారు. ఈ రెండేళ్లలో ప్రతి 10 మందిలో ఒకరు మృతి చెందారు లేదా గాయపడ్డారు. స్థానిక జనాభాలో ఇది దాదాపు 11 శాతంతో సమానం. గాయాల తీవ్రత కారణంగా దాదాపు 40 వేలమందికిపైగా పౌరులు శాశ్వతంగా దివ్యాంగులుగా మారిపోయారు. ప్రతి పదిమందిలో, ముగ్గురు ఆకలితో అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ చేసిన భీకరదాడులతో.. నాలుగు శాతం చిన్నారులు, వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. ఆహార అన్వేషణలో రెండువేల మందికిపైగా పౌరులు మరణించారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. సరిపడా ఆహారం లేక చిన్నారుల పరిస్థితి దుర్భరంగా మారింది. కొందరి బరువు.. పుట్టినప్పటి కంటే తక్కువగా నమోదైంది. ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. 154మంది చిన్నారులతో సహా మొత్తం 459మంది ఆకలిచావుల బారినపడడం కలచివేసే విషాదం.

లక్షకు పైగా భవనాలు ధ్వంసం

ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలచిత్రంగా మారిపోయింది. ప్రతి 10 భవనాల్లో ఎనిమిది దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి. అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలను ఆధారంగా చేసుకుని.. లక్షకుపైగా భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస ఉపగ్రహ కేంద్రం తెలిపింది. ప్రతి 10 ఇళ్లలో తొమ్మిది శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రతి 10 ఎకరాల పంట భూమిలో.. ఎనిమిది ఎకరాలు నాశనమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులను తప్పించుకునే ప్రయత్నంలో లెక్కలేనన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అనేకమంది ఆచూకీ గల్లంతయ్యింది. ఇక ఇజ్రాయెల్ విమానాలు, మిస్సైళ్ల దాడులతో కుప్పకూలిన భవనాల శిథిలాల కింద వేలాదిమంది బతుకులు ఛిద్రమైపోయాయి. వాళ్లు సజీవ సమాధి అయిపోయారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు 90శాతం కుదేలైపోయాయి. 2,300 స్కూళ్లు, కాలేజీలు, 63 యూనివర్సిటీ భవనాలు దెబ్బతిన్నాయి. ఇక జర్నలిస్టులు, ఆరోగ్య కార్యకర్తలు, ఐరాస సిబ్బంది విషయంలో.. ఈ యుద్ధం చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకంగా నిలిచిందని నివేదికలు తెలుపుతున్నాయి. వార్‌ కవరేజీ కోసం వెళ్లి.. 300మంది జర్నలిస్టులు మృతి చెందారు. 125 హాస్పిటళ్లు నేలమట్టమైపోయాయి. 1722మంది వైద్య, సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శాంతి ఒప్పందం ప్రతిపాదనతో ఎట్టకేలకు యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడ్డాయి. ఈజిప్టు వేదికగా శాంతి గీతం వినిపిస్తోంది. . అయితే గాజాకు అయిన గాయాలు ఎప్పటికీ మానేవి కావు. అవి మానవత్వంపై పడ్డ శాశ్వత మచ్చగా మిగులుతాయి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights