Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో రికార్డ్ స్థాయిలో అభ్యరుల పోటీ.. చరిత్రలో తొలిసారి..

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలవడంతో ఈ నియోజకవర్గ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఖరారైంది. నవంబర్ 11న జరిగే ఈ బైపోల్‌లో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మొత్తం 23 మంది నామినేషన్లను విత్‌డ్రా చేసుకోగా.. 58 మంది పోటీలో నిలిచారు.
ఈసారి ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఆయన మరణంతో ఉపఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలనతోపాటు ఉపసంహరణ వరకు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఉపఎన్నికలో చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక నవంబర్ 11న పోలింగ్..14న కౌంటింగ్ జరగనుంది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ ఉపఎన్నికలో పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. గెలుపు తమదేనని ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రికార్డుస్థాయి పోటీలో విజయం ఎవరిని వరిస్తుందోనని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా నెలకొంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
