ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు*

justice s.v.ramana release justice r.v.ravindran book

ustice s.v.ramana release justice r.v.ravindran book

*ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు* *కాలానుగుణంగా మార్చాలి*

*ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచన*

*సమస్యల పరిష్కారంపై నాలుగు సూచనలతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు లేఖ*

దిల్లీ: బ్రిటిష్‌ కాలంలో చేసిన చాలా చట్టాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యతను కోల్పోయాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. కాలానుగుణంగా వాటిని సవరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ రాసిన ‘అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎన్‌. వెంకటాచలయ్య, జస్టిస్‌ ఆర్‌.సి.లహోటీ, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణలతో కలిసి జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థలో పెండింగ్‌ కేసుల పరిష్కారం, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ కొనసాగింపుపై జరిగిన వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. ‘‘బ్రిటిష్‌ పాలనలో చేసిన శాసనాలు ప్రస్తుత సమకాలీన భారతదేశంలో ప్రాముఖ్యతను కోల్పోయాయి. అందుకు ప్రబలమైన ఉదాహరణ భారత శిక్షాస్మృతి కింద విధించే జరిమానాలే. 1860 నుంచి దాన్ని సవరించలేదు’’ అని పేర్కొన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్‌ రవీంద్రన్‌ న్యాయవ్యవస్థకు చేసిన సేవలను, సరళమైన భాషలో ఆయన ఇచ్చిన తీర్పుల వల్ల కలిగిన ప్రయోజనాలను కొనియాడారు. ‘‘లార్డ్‌ డెన్నింగ్‌ చెప్పినట్లు మీడియాలో కనిపించని న్యాయమూర్తే ఉత్తమ న్యాయమూర్తి. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి జస్టిస్‌ రవీంద్రన్‌ రాసిన పుస్తకం ద్వారా న్యాయవ్యవస్థ ఎదుగుతున్న తీరు గురించి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పారు. న్యాయవ్యవస్థలో అధిగమించాల్సిన విభిన్నమైన లోపాలను సరళమైన భాషలో వివరించారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఎన్నికల సంస్కరణలు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగం గురించి ప్రస్తావించారు. నేను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే సందర్భంలోనూ జస్టిస్‌ రవీంద్రన్‌ ఒక సందేశాన్ని పంపారు. ‘డియర్‌ జస్టిస్‌ రమణ, అభినందనలు, శుభాకాంక్షలు… దీవెనలు. ఇప్పుడున్నది కష్టకాలం. ఎన్నో సవాళ్లతో కూడిన పరీక్షా సమయం. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి, న్యాయబద్ధంగా నిలబడటానికి, సామాన్యుడి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి ధైర్యం కావాలి. న్యాయమూర్తిగా ఆశించిన విధంగా వ్యవహరించడానికి అదనంగా మీరు సోదర న్యాయమూర్తుల నుంచి సహకారం కూడా పొందాలి. మీ దగ్గర ఆ లక్షణాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆ దేవుడు మీ పదవీ కాలాన్ని ప్రయోజనాత్మకంగా, అర్థవంతంగా, విజయవంతంగా కొనసాగేలా దీవించాలని కోరుకుంటున్నా’ అని అందులో పేర్కొన్నారు. ఆ లేఖ ప్రధాన న్యాయమూర్తిగా నాకు మార్గదర్శిగా మారింది. ఆ సందేశ నిధిని నేను ఎప్పటికీ దాచుకుంటాను’’ అని జస్టిస్‌ రమణ తన ప్రసంగంలో పేర్కొన్నారు. *డిజిటల్‌ సౌకర్యాలు పెంచాలి* ప్రస్తుతం కోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నడుస్తున్నప్పటికీ చాలాచోట్ల ఎదురవుతున్న నెట్‌వర్క్‌ సమస్యల గురించి వెబినార్‌లో పలువురు వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను జస్టిస్‌ రమణ పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశానని పేర్కొన్నారు. ‘‘నేను అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైనప్పుడు వారు కొన్ని సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ కనెక్టివిటీ గురించి ప్రస్తావించారు. తొలుత దీనిపై టెలికాం నెట్‌వర్క్‌ ఆపరేటర్లతో మాట్లాడి గ్రామీణ, సుదూర మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని కోరుదామని ఆలోచించాను. నేను నేరుగా ఆ విషయం గురించి మాట్లాడటానికి బదులు కేంద్ర న్యాయ, టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాదే వారితో మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద టెలికాం కంపెనీలు జిల్లా, తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే న్యాయవాదులు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని భావిస్తున్నా. లేదంటే నేనే ఆ కంపెనీలకు విజ్ఞప్తి చేస్తాను. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని న్యాయవాదుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని ఓ తరం న్యాయవాదులు న్యాయవ్యవస్థ నుంచి కనుమరుగవుతారు. అది పెద్ద ప్రమాదకర సంకేతం’’ అని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు. ఈ వెబినార్‌లో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటాచలయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం మనిషి ఆయుఃప్రమాణాలు పెరిగినందున న్యాయమూర్తుల పదవీకాలాన్ని 68 ఏళ్లకు పెంచాలని సూచించారు. జస్టిస్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ.. ఈ వయోపరిమితి పెంపును కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే పరిమితం చేయకుండా కిందిస్థాయి న్యాయమూర్తులకూ వర్తింపజేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ అరవింద్‌ దతార్‌ సంధానకర్తగా వ్యవహరించారు. *ఈ సమస్యలు పరిష్కరించండి: నాలుగు సూచనలతో కేంద్ర మంత్రికి లేఖ* ప్రస్తుత కరోనా సమయంలో న్యాయవ్యవస్థ, దానిపై ఆధారపడ్డ వ్యక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం నాలుగు సూచనలు చేస్తూ కేంద్ర న్యాయ, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు జస్టిస్‌ రమణ లేఖ రాశారు. 1. ప్రస్తుతం కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాగుతున్న నేపథ్యంలో టెలికాం నెట్‌వర్క్‌, కనెక్టివిటీని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో బలోపేతం చేయాలి. డిజిటల్‌ విభజన కోర్టుల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున ఈ సమస్యను పరిష్కరించాలి. 2. న్యాయస్థానాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్లు అందించడం ద్వారా వైరస్‌ నుంచి రక్షణ కల్పించాలి. 3. న్యాయవాదులతో సహా కోర్టు విధుల్లో పాల్గొనే అందర్నీ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించాలి. 4. అడ్వొకేట్లకు, మరీ ముఖ్యంగా జూనియర్‌ అడ్వొకేట్లకు చేయూతనివ్వాలి. గత ఏడాది కాలంగా సరైన పని లేక ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్న అందర్నీ ఆదుకోవాలి. అత్యాధునిక ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ పరికరాలను అందుబాటులోకి తెచ్చి న్యాయవ్యవస్థ మౌలికవసతులను బలోపేతం చేయాలి. నేషనల్‌ జ్యుడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించిన నమూనా సిద్ధమవుతోంది. దాన్ని త్వరలో కేంద్రప్రభుత్వంతో పంచుకుంటాం. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీ కోసం కొలీజియం ద్వారా వేగంగా సిఫార్సులు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించాను. దీనిపై వేగంగా, సానుకూలంగా స్పందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సమస్యలన్నింటిపై మీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. _*


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights