ఇక భూముల ధర లు పెరగబోతున్నాయ్…

0

🔴 2013 తరువాత ఇప్పటిదాకా విలువలు పెంచని సర్కారు :2013 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతో భూముల మార్కెట్‌ విలువలను సవరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్‌ విలువలను అసెస్‌ చేయలేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి మార్కెట్‌ విలువలను అసెస్‌ చేసి, నిర్ధారించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, ఇందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదు. దాంతో ఆరేళ్లుగా విలువలు పెరగకుండానే ఉండిపోయాయి. ప్రతి నాలుగేళ్లకోసారి పెరగాలన్న నిబంధనల ప్రకారమైనా.. 2017లో విలువలను పెంచాలి. అప్పుడూ ప్రభుత్వం సాహసించలేదు. దాంతో తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు పంపించింది.

🔴బహిరంగ మార్కెట్లో రెండు మూడింతలు పెరిగిన ధరలు : బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.కానీ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువలు మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రాబడి పెరగడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను పెంచాల్సిందిగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 👉ఉదాహరణకు.. రాష్ట్ర రాజధాని నగరంలో బంజారాహిల్స్‌ తర్వాత అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఎదుగుతున్న గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో ఆరేళ్ల క్రితం గజం విలువ రూ.8-10 వేలు ఉండేది. కానీ, ప్రస్తుతం గజం రూ.50 వేలకు పైమాటే. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువలు మాత్రం గజానికి రూ.4 వేలు, రూ.5 వేలు మాత్రమే ఉన్నాయి.
👉ఓవైపు రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోతోందని, ఇతర మెట్రోపాలిటన్‌ నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో భూముల మార్కెట్‌ విలువలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించింది. జిల్లాల్లో రెండు మూడు రెట్లు పెరిగితే.. హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఏకంగా పది రెట్ల వరకు ధరలు పెరిగాయని పేర్కొంది. అయినా.. తాము 2013లో నిర్ధారించిన మార్కెట్‌ విలువల ప్రకారమే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నామని తెలిపింది.
ఇలాంటి మార్కెట్‌ విలువలను మార్చాలని, ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ విలువలకు అనుగుణంగా అసెస్‌మెంట్‌ చేసి, కొత్త విలువలను నిర్ధారించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2014, 2015లో కూడా ఇలాంటి ప్రతిపాదనలు చేశామని, కానీ.. అప్పుడు ఆమోదం లభించలేదని, ఇప్పుడైనా విలువలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరింది. తద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి పెరుగుతుందని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చిరంజీవులు శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారిని సచివాలయంలో కలిసి ప్రతిపాదనలు అందజేశారు. వాస్తవానికి వ్యవసాయ పట్టా భూములు, వాణిజ్య భూములు, నివాస ప్రాంతాల భూముల మార్కెట్‌ విలువలను ప్రతి నాలుగేళ్లకోసారి అసెస్‌మెంట్‌ చేయాలి. జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలోని అసెస్‌మెంట్‌కమిటీలు, పట్టణాలు, నగరాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని అసెస్‌మెంట్‌ కమిటీలు భూముల విలువలను నిర్ధారిస్తాయి. అప్పటి బహిరంగ విపణిలో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్కెట్‌ విలువలను నిర్ధారిస్తారు.

🔴పాత విలువలతో ప్రభుత్వానికి పెరగని రిజిస్ట్రేషన్ల రాబడి :

వాస్తవానికి ఏదైనా భూమి, స్థలానికి సంబంధించి క్రయ విక్రయాలు జరిగితే… దాని ప్రభుత్వ మార్కెట్‌ విలువపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 4ు స్టాంపు డ్యూటీ, 1.5% ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5% మేర రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలో మొత్తం 6 శాతాన్ని వసూలు చేస్తుంది. అయితే ప్రభుత్వ మార్కెట్‌ విలువ చాలా తక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్ల రాబడి పెరగడం లేదు. మరోవైపు మార్కెట్‌లో భూములు, స్థలాల ధరలు మాత్రం మండిపోతున్నాయి. అందుకే మార్కెట్‌ విలువలను సవరించాలని కోరింది. 👉కాగా కొత్త విలువల నిర్ధారణకు రాష్ట్ర సర్కారు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply