ఇరాన్ నుంచి పారిపోయిన ఆ కార్టూనిస్ట్ ని ఇంటర్నెట్ కాపాడింది..

Spread the love

21 ఏళ్ల వయసులో ఇరాన్ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలోని వివాదాస్పదమైన మానుస్ దీవిలో 4 ఏళ్లపాటు నిర్బంధానికి గురయిన ఒక కార్టూనిస్ట్ వ్యధ ఇది. అతని బాధలే బొమ్మలు గా మారిన కథ ఇది . ఆయన పేరు “అలీ. దొరానీ ..” అతని కథ, అతని మాటల్లో…

“2013లో నేను ఇరాన్ వదిలి వచ్చేసాను. నా ప్రాణం ప్రమాదంలో ఉందని చెప్పగలను కానీ దాని వెనుక కారణం మీతో పంచుకుంటే నా కుటుంబ భద్రత విషయంలో రాజీ పడినట్టే.

ఇరాన్ నుంచి ఇండోనేషియా చేరుకున్నాను, అక్కడ 40 రోజులు ఉండి నా భద్రత కోసం ఆస్ట్రేలియా పారిపోదాం అనుకున్నా.

ఒక మనుషుల్ని స్మగ్లింగ్ చేసే ఒకతను నన్ను ఒక ఓడపై ఆస్ట్రేలియా చేరుస్తా అన్నాడు.

ఓడ చూడగానే నాకు భయం వేసింది, అది ఒక జాలరి నావ. మేము 150 మంది ఉన్నాం, నాకు ఈత కూడా రాదు. ఓడకు ఏదైనా జరిగి చచ్చిపోతే అని భయం వేసింది.

ఆ ప్రయాణం 52 గంటలపటు సాగింది. సముద్రం ఉద్రిక్తంగా ఉండి వర్షాలు కూడా పడ్డాయి. నాకు చాలా భయం వేసింది.
📌ఆస్ట్రేలియ లోని క్రిస్మస్ దీవికి :
మధ్యలో ఆస్ట్రేలియన్ నేవీ మమ్మల్ని అడ్డుకుని వారి నిర్బంధ కేంద్రం అయిన క్రిస్మస్ దీవికి తరలించారు. ఆస్ట్రేలియాలో ఆశ్రయం కోరే శరణార్థులను ఆ ప్రభత్వం ఈ దీవిలో ఉంచుతుంది.

నాకు ఎప్పటినుంచో అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్(ఓసిడి) ఉంది. కానీ, అది క్రిస్మస్ దీవికి వెళ్ళాక మరీ అధ్వానంగా తయారయ్యింది. నాకు సహజంగా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు. కానీ, చాలామందితో కలిసి ఉండే ఆ గదిలో శుభ్రత గురించి నేను ఏమి చెయ్యలేకపోయాను. ఒకానొక సమయంలో నా నిఘంటువు శుభ్రంగా లేదని దాన్ని నీళ్లతో కడిగా. నెమ్మదిగా నేను పిచ్చోడ్ని అయిపోతున్నా ఏమో అని అనిపించింది. నాకు చాలా భయం వేసి వణుకు వచ్చేసేది.

ఆ దీవిలోని వైద్య కేంద్రంలోని డాక్టర్లు నన్ను మందులు వేసుకోవడం కానీ నా ఓసిడి తగ్గడానికి సొంత వ్యూహాలు వేసుకోవాలని చెప్పారు. నాకు మందులు తీసుకోవాలని అస్సలు లేదు. మందులు తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం నాకు మతిస్థిమితం లేదని నన్ను దేశంలోకి అడుగుపెట్టడానికి అనుమతి ఇవ్వదేమో అని చాలా భయపడ్డాను.

ఇలాంటి పరిస్థితిలో నాకు బొమ్మలు వెయ్యడంలో నైపుణ్యం ఉందని నెమ్మదిగా గుర్తొచ్చింది. నా ఓసిడిని తగ్గించుకోడానికి నేను బొమ్మలు గియ్యడం మొదలుపెట్టా. నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటినుంచి నేను బొమ్మలు వేసేవాడ్ని. ఇరాన్ నుంచి పారిపోయే కొన్ని సంవత్సరాల ముందు నుంచి నేను నా ఉద్యోగరీత్యా బిజీగా ఉండడం వల్ల బొమ్మలు గియ్యడం మానేశా. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా బొమ్మలే నాకు తోడుగా ఉంటాయి అని మళ్ళీ గియ్యడం మొదలుపెట్టా.

నేను ఉన్న దీవిలో బొమ్మలు గియ్యడానికి నా దగ్గర కాగితాలు, పెన్సిళ్లు కానీ ఉండేవి కాదు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులను విన్నవించుకుంటే అప్పుడప్పుడు ఈ సామగ్రి ఇచ్చేవారు. కానీ, మిగతా సమయంలో నేను వెళ్లే భాషా తరగతుల్లో మా టీచర్ చూడని సమయంలో కాగితాలు దొంగలించేవాడ్ని.

కాగితాలు కూడా తక్కువగా అందుబాటులో ఉండడం వల్ల నేను పొదుపుగా వాడుకునే వాడ్ని. అలా నెమ్మదిగా నా బొమ్మలు వేసే నైపుణ్యం మెరుగయ్యింది. కానీ, నా ఓసిడి మాత్రం మెరుగుపడలేదు. నాతోపాటు ఉన్న ఇతర ఖైదీలకు నా కార్టూన్లు చూపించేవాడ్ని. కొంతమంది ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా నా బొమ్మలు చూడడానికి చాలా ఆసక్తి చూపించేవారు.

అక్కడ నా జీవితం ఎలా ఉందో నా బొమ్మల్లో చూపించేవాడ్ని. తిండి కోసం అందరం క్యూ లో నుంచోడం దగ్గర నుంచి శుభ్రo చెయ్యని పబ్లిక్ టాయిలెట్ వాడడం దాకా నా బొమ్మలు చాలా విషయాలని చూపించేవి.

👉ఒకసారి ఒక తెల్లని టీ షర్ట్ పై ఆస్ట్రేలియా పటం వేసి అందులో రెండు కళ్ళు ఏడుస్తునట్టు బొమ్మ వేసా. జనాలు నా బొమ్మలను సీరియస్ గా చూడడం అదే మొదటిసారి, నాకు బాగా గుర్తుంది. ఇద్దరు ఇమ్మిగ్రేషన్ అధికారులు నేను ఆ బొమ్మ నిరసనగా వేసాను అనుకుని నన్ను అడగడానికి కూడా వచ్చారు. ఆ కార్టూన్ నిరసన కాదు కానీ ఆ రోజున నా కార్టూన్ల వల్ల జనాలు ఆలోచిస్తున్నారు అని అర్ధం అయ్యింది.

అప్పటినుంచి తరచుగా ఆ దీవిలో జీవితాన్ని చూపిస్తూ బొమ్మలు వేసేవాడ్ని. నా కార్టూన్లు నా ఆస్ట్రేలియా ఆశ్రయ దరఖాస్తుని ప్రభావితం చేస్తాయేమో అని భయం కూడా వేసింది. కానీ, ఆ దీవిలో ఆ పరిస్థితులలో ఉండడం కన్నా కష్టం మరొకటి ఉండదు అని నేను బొమ్మలు వెయ్యడం కొనసాగించాను.

ఒక విధంగా, క్రిస్మస్ దీవి నేను వెళ్లబోయే మానుస్ దీవికన్నా చాలా మంచి ప్రదేశం.

📌జనవరి 2014లో : క్రిస్మస్ దీవికి వచ్చిన ఆరు నెలల తరువాత నన్ను మానుస్ దీవికి తరలించారు. నా చుట్టూ అయిదుగురు రక్షణ దళాలు నన్ను బంధించి ఆ దీవికి తీసుకెళ్లారు. అలాంటి వాతావరణంలో ఉండడం నాకు మొదటిసారి, ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టం అయ్యేది.
🔴మానుస్ దీవి :
క్రిస్మస్ దీవికన్నా మానుస్ దీవి చాలా ఘోరంగా ఉండేది. మానవులకన్నా కోళ్ళని, పందులను ఉంచే ప్రదేశంలా ఉంటుంది మానుస్. అక్కడ ఉన్న టాయిలెట్లు, గదులు అన్నీ మురికితో నిండిపోయి ఉండేవి. వందల మంది జనాలను చిన్న చిన్న గదులలో ఉండమనేవాళ్ళు. నాకు ఏం చెయ్యాలో అర్ధం అయ్యేది కాదు. ఇరాన్ వెళ్ళలేను, ఆస్ట్రేలియాలో ఉండలేను, అలా అని ఆత్మహత్య చేసుకోలేను. నడుస్తున్న మృతదేహంలా ఉండేది నా స్థితి అక్కడ.

🔴ఆస్ట్రేలియా శరణార్థ విధానం:
ఓడలపై వచ్చే శరణార్థులను ఆస్ట్రేలియా.. పపువా న్యూ గినియా లోని క్రిస్మస్, మనుస్ దీవులలో; దక్షిణ పసిఫిక్ లోని నౌరు లో నిర్బంధిస్తుంది. దీనినే ఆస్ట్రేలియా శరణార్థ విధానం అంటారు.

తన పాలసీ వల్ల జనాలు ప్రమాదకరమైన సముద్ర దారిని తీసుకోరు అని ఆస్ట్రేలియా వాదిస్తుంటే డాక్టర్లు, ఐక్యరాజ్య సమితి మాత్రం ఈ దీవులలో పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయని విమర్శిస్తారు.

మానుస్ దీవిలో ఇప్పటిదాకా 12 మంది మరణించారు. 2017లో వచ్చిన కోర్టు ఆదేశాలతో ఆ కేంద్రాన్ని ప్రస్తుతానికి మూసేశారు.

నేను మానుస్ దీవికి వచ్చే సమయానికి నా దగ్గర పెన్సిళ్లు కానీ కాగితాలు కానీ లేవు. క్రిస్మస్ దీవిలో నా దగ్గర ఉన్న పెన్సిళ్లు, కాగితాలు ఇక్కడికి వచ్చేముందు తీసేసుకున్నారు, నా బొమ్మలు మాత్రం నన్ను ఉంచుకోనిచ్చారు.

ఆ దీవిలో మొదట్లో నాకు బొమ్మలు వెయ్యాలి అనిపించలేదు. అక్కడ ఎందుకు ఉన్నానో తెలీదు, ఎప్పుడు బయటకి వెళ్తానో తెలీదు. అలంటి సమయంలో ఆశ అన్నది చచ్చిపోతుంది, ఏదైనా చెయ్యాలనే దృక్పధం ఉండదు. దానికి తోడు అక్కడి వాతావరణం, వేడి, దోమలు అన్ని కలిపి నాలోని కళాకారుడిని చంపేశాయి.

📌ఫిబ్రవరి 17, 2004 : కొంతమంది స్థానికులు మా క్యాంపుపై దాడి చేసారు. వస్తువులను విరకొట్టి, జనాలను కొట్టి, ఒక మనిషిని చంపేసి పారిపోయారు. ఈ సంఘటన జరిగిన ఒక నెల తర్వాత మాకు సరిగ్గా తినడానికి కానీ ఉండడానికి కానీ సౌకర్యాలు ఏమి లేకుండా పోయాయి.

కొన్ని రోజులకి ఇంకొక కాంట్రాక్టర్ వచ్చాడు మా క్యాంపును చూసుకోడానికి. వాళ్ళు మా భోజనశాలను బాగుచేసి శిబిరంలో ఇంగ్లీష్ క్లాసులు, డ్రాయింగ్ క్లాసులు ఏర్పాటుచేశారు.
📌మరలా డ్రాయింగ్ :
నేను బొమ్మలు గియ్యడం మళ్ళీ మొదలుపెట్టాను. ఈసారి మానుస్ దీవిలో మా పరిస్థితులను చూపిస్తూ కార్టూన్లు గీసేవాడ్ని. దోమలు, సూర్యుడు, వర్షాన్ని చూపిస్తూ బొమ్మలు వేసేవాడ్ని.
📌Eaten fish :
‘ఈటెన్ ఫిష్’ అని నా కలం పేరుగా పెట్టుకున్నాను. సముద్రంలో నన్ను ‘చేపలా’ పట్టుకుని ఆస్ట్రేలియన్ క్యాంపులో నన్ను ‘తినేసి’ మానుస్ దీవిలో పడేసారు అని నేను ఆ పేరు పెట్టుకున్నా. కొన్ని బొమ్మలలో నాతో ఉండి చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్ధం సమాధులు కూడా గీసాను.

లైంగిక వేధింపులు, దాడులు మానుస్ దీవిలో పెద్ద సమస్యలు. నేను ఒక్కడినే దీనివల్ల బాధపడలేదు, ఎంతోమంది యువకులు కుడా బాధితులు అయ్యారు.

ఆ సమయానికి మాకు ఇంటర్నెట్ లేదు మానుస్ దీవిలో. అప్పటికి నా బొమ్మలు బయట ప్రపంచానికి చూపించే ఆశ కూడా లేదు నాకు. కొంతకాలానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం వారానికి 45 నిమిషాలు మాకు ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఇచ్చింది. చాలా తక్కువ స్పీడ్ అయినా కూడా నేను ఫేస్‌బుక్‌లో చేరి ఆస్ట్రేలియాలోని మానవ హక్కుల సంఘాలలో జనాలతో స్నేహం చేసుకోడానికి ప్రయత్నించాను. సంవత్సరంన్నర పాటు అదే చేసినా కూడా ఎవరి దగ్గర నుంచి తిరిగి సమాధానం రాలేదు.

మా క్యాంపులో పనిచేసే ఎంతోమంది కార్మికులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు నా బొమ్మల గురించి బయట ప్రపంచంతో మాట్లాడడం మొదలుపెట్టారు.
📌జేనెట్ గెల్బ్రెత్ :
జేనెట్ అనే ఒక ఆవిడ నా బొమ్మల గురించి విని ఫేస్‌బుక్‌లో నన్ను పరిచయం చేసుకున్నారు. ఆవిడ మెల్‌బోర్న్‌లో ఒక ఆర్ట్ గ్యాలరీ పెడుతూ నేను గీసిన బొమ్మ ఒకటి అక్కడ ప్రదర్శనకు పెడతాను అన్నారు. కానీ, ఆవిడకి నేను గీసిన బొమ్మ పంపించడం చాలా కష్టమైన పని అయ్యింది. నా దగ్గర కెమెరా కానీ స్కానర్ కానీ లేదు. కొంతమంది రహస్యంగా ఫోన్లని దాచుకున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్ వాడుకుని ఎలాగోలా ఆవిడకి ఒక బొమ్మ ఫోటో పంపాను.

ఆవిడ ప్రదర్శనను మా మానుస్ దీవిలో పనిచేసే ఒక మనిషి చూసి ఆవిడతో మాట్లాడి నేను గీసిన బొమ్మలను తాను బయటికి తీసుకుని రాగాలను అని చెప్పాడు. ఆయన నా బొమ్మలని ఆయన ఐపాడ్‌లో ఫోటోలు తీసుకుని ఆవిడకి అందించాడు. ఆ తరువాత చాలా మీడియా సంస్థలు నా బొమ్మలను ప్రచురించడం మొదలుపెట్టాయి.
📌మానుస్ దీవిలో 2015:
మానుస్ దీవిలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుపై నిరాహారదీక్ష చేశాం. నా ఆరోగ్యం ఘోరంగా క్షీణించడం మొదలుపెట్టింది. అక్కడి డాక్టర్లు నన్ను ఒక నెల పాటు ఒంటరిగా ఉంచి మందులు ఇచ్చి చూసుకున్నారు. నా ఆరోగ్యం కొంచెం కుదుట పడ్డాక నేను జేనెట్‌తో మాట్లాడి నా పరిస్థితి అర్ధమయ్యేలా చెప్పాను. కార్టూనిస్ట్స్ హక్కుల నెట్‌వర్క్, గార్డియన్ కార్టూనిస్ట్ ‘ఫస్ట్ డాగ్ ఆన్ ది మూన్’ తో కూడా నా గురించి మాట్లాడాను.
📌 మద్దతు :
2016లో గార్డియన్ నా కార్టూన్లను ప్రచురించడం మొదలుపెట్టింది. కార్టూనిస్టుల హక్కుల నెట్‌వర్క్ నాకు ఒక అవార్డు కూడా ఇచ్చింది.

వీటివల్ల నాకు, నా బొమ్మలకి మంచి ప్రచారం జరిగింది. కానీ, ఆ సమయంలో నాకు ఇంటర్నెట్ కూడా లేకపోవడంతో ఈ విషయాలేమి నాకు తెలీలేదు. 2016లో ప్రపంచంలో ఎంతోమంది ఆర్టిస్టులు నాకు మద్దతుగా ఎన్నో కార్టూన్లు వేశారు. న్యూ యార్కర్, న్యూ యార్క్ టైమ్స్ లాంటి ప్రతిష్టాత్మక మీడియా సంస్థలు నాకు మద్దతుగా కార్టూన్లు ప్రచురించాయి.

ఐకార్న్ అనే ఒక నార్వేకు చెందిన సంస్థ నా కేసుపై పనిచేయటం మొదలుపెట్టింది. అప్పటివరకు ఐకార్న్ పేరు కూడా ఎప్పుడు వినలేదు నేను.
📌మానుస్ దీవిలో :
మానుస్ దీవిలోని తోటి జనాలు, కార్మికులు నన్ను వేధించడం మొదలుపెట్టాక 2016 చివరిలో నేను మళ్ళీ నిరాహారదీక్షకు కూర్చున్నా. 22 రోజుల నా నిరాహారదీక్ష అనంతరం నన్ను పపువా న్యూ గునియాలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నేను సుమారు 3 నెలలు గడిపాను.

📌నార్వేకు ఆహ్వానం :
అక్కడ ఉండగానే నాకు నార్వే ఇమ్మిగ్రేషన్ శాఖ నుంచి ఆహ్వానం వచ్చింది. నేను ఆ విషయం అస్సలు నమ్మలేకపోయా!

నేను నార్వేలో దిగిన వెంటనే భయంతో పాటు ఆనందం వచ్చేసింది. నన్ను విమానాశ్రయం నుంచి తీసుకెళ్లడానికి కొంతమంది వచ్చారు. . నార్వే ప్రభుత్వం నాకు అండగా ఉంది. ఐకార్న్ నేను బొమ్మలు వెయ్యడం కోసం నాకు ప్రభుత్వ లైబ్రరీలో ఒక ఆఫీస్ ఇచ్చింది. అక్కడ నేను పిల్లలకి క్లాసులు కూడా తీసుకునేవాడిని.

నా బొమ్మలే నన్ను కాపాడాయి. నేను ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తరువాతే బొమ్మలు గియ్యడం మళ్ళీ మొదలుపెట్టా. ఆ బొమ్మలే నన్ను కాపాడి నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చాయి.”అని ఆ కార్టూనిస్ట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading