ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదు
• గెలిచే వరకు పోరాటం చేస్తా
• భీమవరంలో ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారు
• నేను కుయుక్తులతో రాజకీయాలు చేయను
• పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటా
• సమస్య ఉన్న ప్రతిచోట జనసేన గుర్తు కనబడాలి
• మంగళగిరిలో కార్యకర్తలతో జనసేన అధినేత శ్రీ పవన్‌కళ్యాణ్ గారు
ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదని, తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదు అని, విజయం సాధించే వరకు పోరాడుతానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన్ని కలిసేందుకు వివిధ జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు వచ్చారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఎవరెవరు ఏ జిల్లా నుంచి వచ్చారు అన్న విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “నా జీవితం రాజకీయాలకు అంకితం. నేను మళ్లీ చెబుతున్నా నా శవాన్ని నలుగురు మోసుకువెళ్లే వరకు నేను జనసేనను మోస్తా. నాకు ఓటమి కొత్త కాదు. దెబ్బ తినే కొద్ది ఎదిగే వ్యక్తిని. 25 సంవత్సరాల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఓటమి ఎదురైతే తట్టుకోగలనా లేదా అని నన్ను నేను పరీక్షించుకున్న తర్వాతే పార్టీ స్థాపించా. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా.. బలంగా గెలుస్తా. తాజా ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్, డబ్బు ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు. భీమవరంలో నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. పవన్‌కళ్యాణ్‌ని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వరాదు.. ఎలాగయినా ఓడించాలి అనేది వారి లక్ష్యం. వీటన్నింటినీ నేను పట్టించుకోను. ప్రజా తీర్పును గౌరవిద్దాం. వైసీపీ పాలన ఎలా వుంటుందో చూద్దాం. రెండు రోజుల క్రితం నేను ఎయిర్‌పోర్టు నుంచి వస్తుంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్లకార్డులతో రోడ్ల మీదకి వచ్చారు. ప్రస్తుతం మన ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే. ఎక్కడ ఆకలి ఉంటుందో, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ జనసేన గుర్తు కనపడాలి. అక్కడి ప్రజలకు మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి.
కుయుక్తులతో కూడిన రాజకీయాలు నేను చేయను. సమీక్షకి వచ్చిన ప్రతి అభ్యర్ధిని అడుగుతున్నా మీరు ఉంటారా, వెళ్లిపోతారా అని. మేము మీ వెంటే ఉన్నాం అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం అంటున్నారు. ఇంతకు మించిన విజయం ఏం కావాలి. ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తిత్వం బయటపడుతుంది. ఓటమి ఎదురైనప్పుడే నువ్వు నావాడివా పరాయివాడివా అన్న విషయం అర్ధం అవుతుంది. మీరంతా నా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను మళ్లీ చెబుతున్నా ఏదో ఒక ఎన్నికల కోసం వచ్చి వెళ్లిపోవడానికి పార్టీ పెట్టలేదు. కష్టమైన ప్రయాణం అని తెలిసీ రాజకీయాల్లోకి వచ్చా. ఓటమికి కుంగిపోను దెబ్బతినే కొద్ది ముందుకు వెళ్తూనే ఉంటా. ఈ ఆఫీస్ మనది. ఎవరైనా ఎపుడైనా రావచ్చు. అందరికీ అందుబాటులో ఉంటా. అందర్నీ కలిసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తాను” అని తెలిపారు
• ప్రజల కోసం పని చేసి చూపిద్దాం
రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కోవాలి… అన్నీ తట్టుకొందాం… ప్రజల కోసం నిలబడదాం అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ఎన్నికల ఫలితాలపై స్వీయ పరిశీలన చేసుకొని… క్షేత్ర స్థాయిలో మన పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జనసేన పక్షాన పోటీ చేసిన అభ్యర్థులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలవారీగా అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల సరళి, ఫలితాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ఒక లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నాం. జనసేన పార్టీ నిలబడ్డ తొలి ఎన్నికలివి. ఇన్ని లక్షల మంది మన పార్టీని నమ్మారు. వాళ్ళంతా మన పట్ల బలమైన విశ్వాసం చూపించారు. ప్రజలకు ఎప్పుడూ అనుసంధానమై వారి సమస్యలపై గొంతు విప్పే పార్టీ మనది. ఒక ఇంటి పెద్దలా అండగా నిలిచి ప్రజలకు భరోసా ఇద్దాం. ఈ క్రమంలో మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటన్నింటికీ తట్టుకొనే బలంగా పనిచేద్దాం. ఇందుకు చాలా ఓపిక, సహనం కావాలి. జనం కోసం నిలిచేందుకు మనం వెచ్చించాల్సింది సమయమే. ఎంత ఎక్కువ సేపు మనం ప్రజలతో మమేకమై అయ్యామనేది ముఖ్యం. అందుకు నాయకులు సిద్ధం కావడంతోపాటు.. క్యాడర్ ను బలోపేతం చేయాలి. మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించి… క్షేత్ర స్థాయిలో జనం సమస్యలపై సమగ్ర అవగాహనకు రావాలి.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టే మనం జనం సమస్యలపై బలంగా మాట్లాడగలుగుతున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇద్దాం. పంచాయతీ, జెడ్పీ, మునిసిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో ధీటుగా పోరాడే అభ్యర్థులను నిలుపుదాం. స్థానిక ఎన్నికల్లో చాలా ఒత్తిళ్ళు తీసుకొస్తారు. వాటిని తట్టుకొనే విధంగా క్యాడర్ ను సన్నద్ధం చేయాలి” అన్నారు.
Just for Fun:
CBN : బాబు లోకేషు ఏమి చేస్తున్నావురా పార్టీ గురించి ఏమైనా ఆలోచించావా..?
లోకేశం: ఊరుకోండి నాన్నారు నేను ఓడిపోయి బాధపడుతుంటే మీకు పార్టీ ఇవ్వాలా..?
నేను ఇవ్వను..!!
😃😃😃
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.