Teluguwonders:
రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాహసోపేత నిర్ణయాలకు పరిచయ వాక్యంగా జియో ఒక్కటి సరిపోతుంది. జియోతో టెలికం మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఇప్పుడు జియోహో అనిపించేలా కొత్త సంచలనానికి తెరతీస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన సంస్థ వాటాదారుల 42వ వార్షిక సమావేశంలో జియోఫైబర్ అద్భుతాలను ఆవిష్కరించారు. ఈ ఫైబర్ సేవలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి వార్షిక చందాదారులకు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి.
హెచ్‌డీ టీవీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ ఉచితం. దానికి సెట్‌టాప్ బాక్సు కూడా ఉచితమే!
ల్యాండ్‌లైన్‌పై జీవితాంతం ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు! జియో ఫస్ట్‌డే ఫస్ట్ షో ఆఫర్‌లో థియేటర్‌లో సినిమా విడుదలైన రోజే.. టీవీలో చూసే అవకాశం! ఇవన్నీ త్వరలో మార్కెట్‌లో పెనుసంచలనాలకు దారితీయనున్న రిలయన్స్ జియోఫైబర్‌లోని అద్భుతాలు మరి. రిలయన్స్ జియో దెబ్బకు మార్కెట్‌లో కొమ్ములు తిరిగిన టెలికం ఆపరేటర్లు ఇప్పటికే దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోగా.. తాజాగా డిష్ టీవీలు, కేబుల్ ఇంటర్నెట్, టెలివిజన్ పరిశ్రమలకు ముకేష్ గట్టి షాకిచ్చారు.
రిలయన్స్‌ను ఇక మునుపెన్నడూ చూడని విధంగా చూడబోతున్నారన్న ముకేష్.. వచ్చే నెల 5 నుంచి జియో ఫైబర్ సేవలు మొదలవుతాయని, నెలకు కేవలం రూ.700లకే హై-స్పీడ్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కనీస ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండగా, గరిష్ఠ వేగం 1,000 ఎంబీపీఎస్ (1 జీబీపీఎస్). ధర కూడా రూ.10,000లుగా స్పష్టం చేశారు. అలాగే వార్షిక ప్లాన్లను కొనుగోలు చేసినవారికి సెట్ టాప్ బాక్స్‌లతో ఉచితంగా హెచ్‌డీ టీవీలను అందిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా తమ ల్యాండ్ లైన్ కస్టమర్లకు జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్ ఉంటాయన్న ముకేశ్.. అమెరికా, కెనడాలకు నెలకు రూ.500 చెల్లించి అపరిమిత అంతర్జాతీయ కాలింగ్ ప్యాక్‌ను పొందవచ్చని చెప్పారు. ఇక తొలి ఏడాదిలో 3.5 కోట్ల మంది కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన ఆయన 2 కోట్ల మంది గృహస్తులను, 1.5 కోట్ల మంది వ్యాపారస్తులను చేర్చుతామన్నారు.
గత సంవత్సరం 41వ ఏజీఎంలో డిజిటల్ షాపింగ్, వర్చువల్ రియాల్టీ గేమింగ్, స్మార్ట్ హోం సొల్యూషన్లు, వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెన్స్‌ను గృహస్తులకు అందిస్తామని ముకేష్ వాగ్ధానం చేసిన విషయం తెలిసిందే. గత ఏజీఎంలో ప్రకటించినట్లుగానే జియో గిగా ఫైబర్ సర్వీస్.. టీవీల్లో అల్ట్రా-హై డెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వీక్షకులకు అందించనుంది. తద్వారా తన హామీని ముకేష్ నిలబెట్టుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.