Teluguwonders:
బాసెల్ (స్విట్జర్లాండ్):
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్స్ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె బీవెన్ ఝంగ్ (అమెరికా)తో తలపడనుంది. గతేడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో సింధును ఓడించిన అనుభవం ఝంగ్‌కు ఉంది.
మ్యాచ్‌లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. కోర్టులో చురుగ్గా కదిలింది. తొలిగేమ్‌లో స్కోరు 5-5తో ఉన్నప్పుడు చెలరేగిన సింధు విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలోకి వచ్చేసింది. అదే ఊపులో వరుసగా ఆరు పాయింట్లు సాధించింది.
మ్యాచ్ పాయింట్ వద్ద పై పొరపాటు చేయడంతో క్రాస్‌కోర్ట్ షాట్‌తో సింధు తొలి గేమ్ గెలిచింది. ఇక రెండో గేమ్‌లోనూ ఆమె 6-1తో దూసుకుపోయింది. ఈ క్రమంలో ర్యాలీ గేమ్ ఆడిన పై స్కోరును 5-7కు తగ్గించింది. సింధు అనవసర తప్పిదాలు చేయడంతో విరామ సమయానికి తైపీ అమ్మాయి 11-10తో ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత గేరు మార్చిన తెలుగమ్మాయి 20-14తో గేమ్ పాయింట్‌కు చేరువైంది. బ్యాక్‌లైన్ షాట్‌తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన, పూర్వీషా ఎస్ రామ్ జోడీ 8-21, 18-21 తేడాతో జపాన్ జంట షిహో తనక, కొహరు యోనెమోటొ చేతిలో ఓటమి పాలైంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.