నేడు తెలుగు భాషా దినోత్సవం

Today is Telugu Language Day
Spread the love

Teluguwonders:

తెలుగుకేదీ వెలుగు..? సర్కారీ వ్యవస్థల్లో మాతృభాష అంతంత మాత్రమే అమలులో ఉంది. అర్జీలు తెలుగులో ఉన్న అధికారుల సమాధానాలు మాత్రం ఆంగ్లంలోనే ..
న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వంతో సాగే ఉత్తర ప్రత్యుత్తరాలు మినహా మిగిలిన అంశాలకు సంబంధించి రాతకోతలన్నీ తెలుగు భాషలోనే ఉండాలి.

అర్జీలు, తెలుగులో పంపుతున్న దస్త్రాల సమాచారాన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా క్రమం తప్పకుండా నివేదించాలి. ఇవీ ప్రభుత్వ నిబంధనలు కానీ

  • ప్రభుత్వ శాఖల్లో రాతకోతలన్నీ ఆంగ్లంలోనే ఉంటున్నాయి…
  • జిల్లాస్థాయిలో తెలుగు అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కలెక్టరేట్‌కు సమాచారమే రావటం లేదు.
  • జిల్లాస్థాయిలో అధికార భాష అమలు కమిటీ గత అయిదేళ్లుగా ఏర్పాటు కాలేదు.
  • అసలు తెలుగు అమలుపై సమీక్షించిన సందర్భాలే లేవు.

తెలుగు వెలుగు సాధ్యమేనంటూ.. ప్రభుత్వ కార్యకలాపాలు, రాతకోతలన్నీ మాతృభాషలోనే సాగిస్తామంటూ ఏళ్ల కిందట చేసిన బాసలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అధికారులుగా పని చేస్తున్నవారు ప్రజలతో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే.. ఈ గడ్డపై పుట్టి.. ఇక్కడే కొలువు వెలగబెడుతున్నవారు మాత్రం ఆంగ్లాన్ని వదల్లేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు ఓ బ్రహ్మ పదార్థమే.

విశాఖ జిల్లాలో 86 ప్రభుత్వ శాఖల పరిధిలో 114 జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా మండల, డివిజన్‌ స్థాయిలో ఆయా శాఖల కార్యాలయ శాఖలు పనిచేస్తున్నాయి. దాదాపు 30 వేల మంది ఉద్యోగులు, మరో 4 వేల మంది అధికారులు సేవలందిస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి. జిల్లా అధికారుల కార్యాలయాల నుంచి కలెక్టరేట్‌కు, కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సాగే ఉత్తర ప్రత్యుత్తరాలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఆంగ్లంలోనే తప్ప ఎక్కడా తెలుగులో లేవు.

గొడ్డలిపెట్టుగా ‘ఈ-ఆఫీసు’

జిల్లాలో ఈ-ఆఫీసు విధానం అమల్లోకి వచ్చాక రాత కోతలన్నీ ఆంగ్లభాషలో జరుగుతున్నాయి. ఈ-ఆఫీసు విధానంలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ అంటూ ప్రత్యేకంగా లేదు. నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) తెలుగు సాఫ్ట్‌వేర్‌ ప్రవేశపెట్టేందుకు గతంలో ప్రయత్నాలు చేసినా ఇంకా అమలుకు నోచుకోలేదు. కొన్ని శాఖలకు చెందిన అధికారులు మాత్రం కొన్ని దస్త్రాలను తెలుగులో రాస్తున్నారు. ఇలాంటి వారు గూగుల్‌లోకి వెళ్లి తెలుగు ఫాంట్‌లో రాస్తూ ‘కట్‌ అండ్‌ పేస్ట్‌’ పద్ధతిలో ఈ ఆఫీసులో ఆయా దస్త్రాలకు జతచేస్తున్నారు.

అర్జీలు తెలుగులో.. సమాధానం ఆంగ్లంలో…

ప్రతీ సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో వందల సంఖ్యలో అర్జీలు వస్తున్నాయి. వాటిలో తెలుగు భాషలో వచ్చే దరఖాస్తులు 90 శాతానికి పైగా ఉన్నాయి. కానీ వాటికి ప్రత్యుత్తరం మాత్రం ఆంగ్లంలోనే సాగుతుండడం విశేషం. దీంతో ఆంగ్లభాష తెలియని అర్జీదారులు తికమక పడుతున్న సందర్భాలు కోకొల్లలు.

కలెక్టరేట్‌ నుంచే అమలు చేస్తా…

తెలుగులో అర్జీలు వస్తుంటే.. ఆంగ్లభాషలో సమాధానాలు ఇవ్వడం భావ్యం కాదు. కొద్దిరోజుల క్రితమే దీనికి సంబంధించిన అంశాలపై నేను, జేసీ చర్చించుకున్నాం. తెలుగు భాషను పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలను తీసుకోవాలని నిర్ణయించాం. కలెక్టరేట్‌ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీ చేస్తా. తదుపరి జిల్లాలోని మిగతా ప్రభుత్వ శాఖలకు విస్తరిస్తాం. గతంలో తిరుపతిలో ఇలాగే అమలు చేశాం. ఉన్నత న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వానికి పంపే దస్త్రాలు మినహా మిగిలినవన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకుంటా. ఈ-ఆఫీసు విధానం అమల్లో ఉన్నా పీడీఎఫ్‌ రూపంలో దస్త్రాలను సిద్ధం చేసి అనుసంధానం చేయవచ్ఛు.

  • వి.వినయ్‌చంద్‌, జిల్లా కలెక్టర్‌

Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading