ఈ ఏడాది మట్టి బొమ్మలకే ప్రాధాన్యత అధికం

This year's clay toys are the top priority
Spread the love

Teluguwonders:

వినాయక చవితి ప్రతి ఇంటా జరిగే ముఖ్యమైన పండగలలో ఒకటి .. చవితినాడు వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి చిన్నాపెద్దా అందరు భక్తి శ్రద్ధలతో కొలిచి నిమజ్జనం చేస్తారు. ఏటా ఆగస్టు నాటికి వర్షాలు పడి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి.కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బొజ్జగణపయ్యను నిమజ్జనం చేయడం ఎలాగో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందడి కొంత తగ్గింది.

వినాయక ప్రతిమ తయారీలో కోల్‌కతా కళాకారులు:

● ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ప్రతిమలు పర్యావరణానికి హాని చేస్తున్నాయని జీవీఎంసీ అధికారులు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు అవగాహన కల్పిస్తుండటంతో ఈ ఏడాది అధికశాతం నిర్వాహకులు మట్టి బొమ్మలనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. తయారీదారులు కూడా మట్టిబొమ్మల తయారీపైనే అధికంగా దృష్టి పెట్టారు.

● ముగ్గురు కళాకారులు 15 రోజులు శ్రమిస్తే మట్టి బొమ్మకు రూపం వస్తుంది. ముడి సరకులు నగరంలో లభించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

● సుందర రూపం కోసం కోల్‌కతా మట్టిని ఉపయోగిస్తున్నారు. అక్కడ బ్యాగు మట్టి రూ. 50 ఉంటే ఇక్కడికి వచ్చేసరికి రూ.500 అవుతోందని తయారీదారులు చెబుతున్నారు.

ప్రతిబంధకంగా పోలీసులు నిబంధనలు :

కాలనీల్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించాలంటే పోలీసులు నిబంధనలను కఠిన తరం చేశారు. 3 అడుగులు దాటిన ప్రతిమలను ఏర్పాటు చేయాలంటే తప్పని సరిగా పోలీసుల అనుమతులను తీసుకోవలసి ఉంది. అనుమతుల కోసం తిరగలేక యువకులు వెనుకడుగు వేయడంతో బొమ్మల కొనుగోళ్లు తగ్గిపోయాయని తయారీదారులు అంటున్నారు. చిన్న బొమ్మల తయారీ ఎక్కువగా ఉంటేనే తమకు లాభం వస్తుందని పేర్కొంటున్నారు.

పెరిగిన బొమ్మల ధరలు:

ఈ ఏడాది మట్టి బొమ్మల ధరలు అమాంతం పెంచేశారు. నాలుగు అడుగుల ప్రతిమ రూ. 5 వేలు, 10 అడుగులు దాటితే ఆకృతి, అలంకరణలను బట్టి సుమారు రూ. 20 వేల నుంచి రూ.40 వేల వరకు ధర నిర్ణయించారు. అదీ నెల రోజుల ముందు ఆర్డరు ఇవ్వాల్సిందే .

సుమారు 40 కేంద్రాల్లో తయారీ..

● ఈ ఏడాది నగరంలో సుమారు 40 నుంచి 50 వరకు వినాయక ప్రతిమల తయారీ కేంద్రాలున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని చోట్ల స్థానికులే కోల్‌కతా నుంచి కళాకారులను తీసుకువచ్చి బొమ్మలను తయారు చేయిస్తున్నారు. ఎక్కువ మంది కోల్‌కతా కళాకారులే నేరుగా ఇక్కడ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని స్థానికులకు ధీటుగా వ్యాపారం చేస్తున్నారు.

● ఒక్కో కేంద్రంలో సుమారు 100 నుంచి 200 వరకు బొమ్మలు తయారవుతున్నాయి. నగరవ్యాప్తంగా అపార్ట్‌మెంట్లు, కాలనీవాసులు, యువజన సంఘాలు సుమారు 4 వేల నుంచి 6 వేల వరకు బొమ్మలను ప్రతిష్టించే అవకాశం ఉందని తయారీ దారులు పేర్కొంటున్నారు.

40 చెరువుల్లోనూ కానరాని నీరు..

పెందుర్తి మండలంలో చిన్నా, పెద్దవి సుమారు 40 వరకు చెరువులు ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతం నీరు లేదు. కనీసం నాలుగు అడుగుల ప్రతిమను నిమజ్జనం చేసే వీలులేకపోవడంతో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. మేహాద్రి రిజర్వాయరులో నిమజ్జనం చేయడానికి అనుమతులు లేకపోవడంతో నగరంలోని ఆర్కేబీచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతదూరం వెళ్లాలంటే కష్టం కావడంతో చాలా గ్రామాల్లో స్థానికులంతా కలిసి ఒక ప్రతిమను ప్రతిష్ఠించాలని నిర్ణయానికి రావడం కనిపిస్తోంది.

విగ్రహాల తయారీ యజ్ఞం లాంటిది..

వినాయక విగ్రహాల తయారీ పెద్ద యజ్ఞం లాంటిది. మట్టిబొమ్మలు తయారీ మరీ కష్టం. నాతోపాటు 12 మంది 10ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాం. పెద్ద మొత్తంలో లాభాలు లేకున్నా నష్టం మాత్రం ఉండదు. ప్రతి ఏడాది 100 నుంచి 150 వరకు బొమ్మలను తయారు చేస్తాం.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading