Teluguwonders:
మనం నిత్యం ఎక్కువగా వినియోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. షణ్ముగప్రియ అనే మహిళ వాట్సాప్ యాప్ ఉపయోగించి ప్రస్తుతం లక్షల రుపాయలు సంపాదిస్తున్నారు. ఒక ఐడియాతో షణ్ముగప్రియ తన జీవితం మారేలా చేసుకున్నారు. చెన్నైకు చెందిన షణ్ముగప్రియ ఉద్యోగం చేస్తూ ఉండగా అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ప్రియ అత్తగారు చనిపోయారు.
ప్రియ భర్త మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇంటిని, మూడు సంవత్సరాల బాబును చూసుకోవటం కొరకు ప్రియ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. కేవలం భర్త సంపాదనతో చెన్నైలాంటి ప్రాంతంలో ఇల్లు గడవటం కష్టం అని భావించిన ప్రియ అత్తను స్ఫూర్తిగా తీసుకొని చీరల వ్యాపారం ప్రారంభించింది. ప్రియ అత్త ఇంటింటికీ వెళ్లి చీరలు అమ్ముతూ ఉండేది.
ప్రియ కూడా అత్తగారిలా బంధుమిత్రుల ఇళ్లకు తిరుగుతూ బ్యాగుల్లో పెట్టుకొని చీరలు అమ్మటం ప్రారంభించింది.
ఆ తరువాత 20 మంది బంధుమిత్రులతో వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసింది. గ్రూప్ ద్వారా వచ్చిన చీరల ఆర్డర్లను తీసుకొని చీరలను డెలివరీ చేయటం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రియ 11 వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తోంది. ఫేస్ బుక్ గ్రూపుల ద్వారా కూడా చీరలను మార్కెట్ చేసేందుకు ఎనిమిది మందిని నియమించుకుంది. ఇద్దరు చేనేత కార్మికులను నియమించుకొని ప్రత్యేక డిజైన్లు కలిగిన చీరలను వారితో తయారు చేయిస్తోంది.
వచ్చిన ఆర్డర్లు వేగంగా డెలివరీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రియ ఇంటి మొదటి అంతస్తులో గోడౌన్ కమ్ షాపును నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రియ సంవత్సరానికి 3 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ప్రియ భర్త కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రియకు సహాయం చేస్తున్నాడు. వేరు వేరు కొరియర్ కంపెనీల ద్వారా ప్రియ కస్టమర్లకు చీరలను అందిస్తోంది. రోజుకు 100 నుండి 150 చీరలను ప్రియ అమ్ముతోంది.