ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

Spread the love

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు. దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఓట్లు పడలేదు.

శాసనమండలి రద్దు బిల్లుకు అనుకూలంగా ఓటేసేవారంతా తమతమ స్థానాల్లో నిలబడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరగా.. వైసీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే లేచి నిలబడి మద్దతు తెలిపారు.

వ్యతిరేకంగా ఓటేసేవారు, తటస్థంగా ఉన్నవాళ్లు లేచి నిలబడాలని స్పీకర్ కోరినప్పుడు ఎమ్మెల్యేలు ఎవ్వరూ నిలబడలేదు.

133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని, వ్యతిరేకంగా ఎవ్వరూ ఓటు వేయలేదని స్పీకర్ ప్రకటించారు. కాబట్టి, శానస మండలి రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిందని వివరించారు.

సభను నిరవధికంగా వాయిదా వేశారు.

శాసన మండలి రద్దు సరికాదు – చంద్రబాబు

మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకున్న పార్టీ తమదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.

శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.

శాసనసభలో ప్రాతినిధ్యం లేని వారికి శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించామని చంద్రబాబు చెప్పారు.

తమతమ రాష్ట్రాల్లో శాసన మండలిని పునరుద్ధరించాలని 10 రాష్ట్రాలు కోరాయని తెలిపారు.

ఎమ్మెల్యేగా అవకాశం రాని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ కూడా హామీలు ఇచ్చారన్నారు.

శాసన మండలిలో గత 8 నెలల్లో 42 బిల్లులు పెడితే.. 38 బిల్లులు ఆమోదం పొందాయని, 4 బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్, ఇంగ్లీష్ మీడియం బిల్లులకు సవరణల్ని మాత్రమే ప్రతిపాదించామని, వాటిని తిరస్కరించలేదని వివరించారు.

ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేసింది ఒక వ్యక్తిని కాపాడేందుకు కాదని, వ్యవస్థను కాపాడేందుకని చెప్పారు.

పరువు కాపాడుకోవడానికి జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టారని, ఇది ఆపరేషన్ ఆకర్షేనని అన్నారు.

ఒక్కో ఎమ్మెల్సీకి రూ.5 కోట్లు ఇస్తామని, బ్లాంక్ చెక్ ఇస్తామని ఆఫర్ చేశారని, అయినప్పటికీ తమ పార్టీ ఎమ్మెల్యేలు నీతికి కట్టుబడి, విశ్వసనీయతతో, విలువలతో ఉన్నారని.. రాజీపడకుండా నిలబడ్డారని చంద్రబాబు చెప్పారు.

”ఈ రాష్ట్రం మీతోనే ఉండదు. మీరే చివరి ముఖ్యమంత్రి కాదు. మీకు చేతనైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లండి. సమాజం శాశ్వతం. ఆ సమాజ హితం కోసం మా ఎమ్మెల్సీలు త్యాగం చేశారు” అని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

అసెంబ్లీని రద్దు చేయాలని, తిరిగి వైసీపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చంద్రబాబు తెలిపారు.

మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినంత మాత్రాన అయిపోదని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాల్సి ఉంటుందని, కాబట్టి ఏం జరుగుతుందో తాము చూస్తామని అన్నారు.

తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు.

శాసన మండలి ఎప్పుడు రద్దవుతుంది?

శాసనసభ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఈ బిల్లు రాష్ట్ర గవర్నర్ వద్దకు వెళుతుంది.

గవర్నర్ ఆమోదం తెలిపితే ఈ బిల్లు రాష్ట్ర చట్టంగా మారుతుంది. తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళుతుంది.

కేంద్ర ప్రభుత్వం కూడా శాసనమండలి రద్దుకు అంగీకరిస్తే.. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది.

రాష్ట్రపతి సంతకం చేసి ఆమోదముద్ర వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా చట్టంగా మారుతుంది.

ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దవుతుంది.

ఉద్యమాన్ని, పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.

‘‘ఈ రాష్ట్రం మీతోనే ఉండదు. మీరే చివరి ముఖ్యమంత్రి కాదు. మీకు చేతనైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లండి. సమాజం శాశ్వతం. ఆ సమాజ హితం కోసం మా ఎమ్మెల్సీలు త్యాగం చేశారు’’ అని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

కౌన్సిల్‌ను రద్దు చేసినట్లే అసెంబ్లీని రద్దు చేయాలని, ఎన్నికలకు వెళ్లాలని, మళ్లీ వైసీపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చంద్రబాబు చెప్పారు.

లేదంటే అమరావతిపై రిఫరెండం పెట్టాలని, ప్రజలు కొనసాగించాలంటే రాజధానిగానే కొనసాగించాలన్నారు.

లేదంటే సెలక్ట్ కమిటీకి బిల్లును పంపించడంపై రిఫెరెండానికి వెళ్లాలన్నారు.

మండలిని రద్దు చేయడం సులభం కాదని, ఏం జరుగుతుందో చూస్తామని చంద్రబాబు అన్నారు.

ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతున్న వైఎస్ జగన్

‘శాసనమండలి వల్ల ప్రజా ప్రయోజనం లేదు.. దానికి ఒక్క రూపాయి ఖర్చు చేసినా దండగే’ – వైఎస్ జగన్

రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉందని, దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరగని అవకాశం కనిపించడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ప్రజా ప్రయోజనం లేనిది మండలి అని, దీనికోసం ఒక్క రూపాయి ఖర్చు చేయడమైనా దండగ అని, ఆ అర్హత కూడా మండలికి లేదన్నారు.

అలాంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇంతింత సొమ్ము ఇలాంటి దండగ పనులకోసం ఖర్చు చేయడం అవసరమా? అని ఆయన అన్నారు.

ప్రజా ప్రయోజనార్థం తమ ప్రభుత్వం తీసుకొస్తున్న ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీ బిల్లు, వికేంద్రీకరణ వంటి బిల్లుల్ని మండలి అడ్డుకుంటోందని జగన్ అన్నారు.

ఎన్టీఆర్ హయాంలో ఒక్క వ్యక్తి కోసం మండలిని రద్దు చేశారని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ

గీత

మండలిని ఇలాగే కొనసాగిస్తే.. వచ్చే ఏడాదికల్లా తమ పార్టీకి అందులో మెజార్టీ వస్తుందని, తమకు కావల్సిన వారిని పెట్టుకోవచ్చునని అన్నారు. పార్టీ కంటే కూడా ప్రజా అవసరాలే ముఖ్యమని అందుకే మండలిని రద్దు చేస్తున్నామని చెప్పారు.

గురువారం మండలిని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం సోమవారం శాసనసభను ఏర్పాటు చేస్తున్నామని కూడా ముందే చెప్పామన్నారు.

ఈ అంశంపై చర్చ జరగాలి, ప్రజల్లో నానాలి అని మూడు రోజులు సమయం ఇస్తే.. ఎమ్మెల్సీలను తాము కొనుగోలు చేస్తున్నామని, ఆపరేషన్ ఆకర్ష్ అని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

‘‘సరైనది చేయడానికి (ఈ) సమయమే సరైనది’’ అని మార్టిన్ లూథర్ కింగ్ అన్నారని జగన్ చెబుతూ.. శాసనమండలిని రద్దు చేసే బిల్లును ఆమోదించాలని సభను కోరారు.

బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ఉదయం నిర్ణయించింది. శాస‌న‌మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.

శాసనమండలిని రద్దు చేయాలంటే తీర్మానాన్ని అసెంబ్లీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. శాసనసభలో పాలక వైసీపీకి 175 స్థానాలకుగాను 151 మంది సభ్యులు ఉన్నారు.

అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే శాసనమండలి రద్దుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతుంది. ఉభ‌య స‌భ‌ల్లోనూ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా నిర్ణ‌యం వెలువ‌డితే శాస‌న‌మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా, అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 26 మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురు, నామినేటెడ్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

శాసనసమండలి రద్దు నిర్ణయాన్ని విప‌క్ష టీడీపీ, పీడీఎఫ్, ఇత‌ర స‌భ్యులు వ్య‌తిరేకిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీలో తీర్మానం

వ్య‌క్తులపై ఆగ్ర‌హం వ్య‌వ‌స్థ‌ల‌పై చూపుతారా?: రెడ్డి సుబ్రహ్మణ్యం

శాస‌న‌మండ‌లి ర‌ద్దు విష‌యంలో ప్ర‌భుత్వం ఆలోచ‌నార‌హితంగా సాగుతోంద‌ని శాసనమండ‌లి డిప్యూటీ చైర్మ‌న్, టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం వ్యాఖ్యానించారు. శాస‌న‌మండ‌లి ర‌ద్దు వ్యక్తుల‌ను దృష్టిలో పెట్టుకుని వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసిన‌ట్టుగా ఉందని ఆయన బీబీసీతో అన్నారు.

“అసెంబ్లీలో ప్ర‌భుత్వానికి బ‌లం ఉంది కాబ‌ట్టి ఆమోదిస్తారు. దాంతో ర‌ద్దు జ‌రిగిన‌ట్టు కాదు. కేంద్ర ప్రభుత్వ ఆలోచ‌న‌ను బ‌ట్టి ఆ ప్ర‌క్రియ ఉంటుంది. అది వెంట‌నే జ‌రుగుతుందా, లేదా జాప్యమవుతుందా అన్న‌ది కేంద్రం చేతుల్లో ఉంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలక్ట్ క‌మిటీకి పంప‌డాన్ని స‌హించ‌లేని ప్ర‌భుత్వం మండ‌లిని ర‌ద్దు చేయ‌డం స‌రికాదు” అని ఆయన విమర్శించారు.

తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ‌తాన‌ని చెబుతూ తండ్రి పున‌రుద్ధరించిన మండ‌లిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ర‌ద్దు చేయ‌డం ఏ విధంగా స‌రైనదో జగన్ ఆలోచించుకోవాలని రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు. దీనిని ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటార‌నేది సీఎం గ్ర‌హించాలన్నారు.

ఉద్యోగులు, సామాన్యుల సమస్యలపై పనిచేశాం: పీడీఎఫ్

శాస‌న‌మండ‌లి ర‌ద్దు చేయ‌డాన్ని పీడీఎఫ్ వ్య‌తిరేకిస్తోంద‌ని ఏడుగురు ఎమ్మెల్సీల బృందానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు బీబీసీతో చెప్పారు.

కేఎస్ లక్ష్మణరావు
చిత్రం శీర్షికకేఎస్ లక్ష్మణరావు

“2007లో శాస‌న‌మండ‌లి పున‌రుద్ద‌రించిన‌ప్ప‌టి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో పాటు ఇత‌ర సామాన్యుల స‌మ‌స్య‌ల‌పై పనిచేశాం. వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేశాం. మా సూచ‌న‌ల‌ను ప్ర‌భుత్వం కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంది. ప‌లు ప్ర‌భుత్వాలు మండ‌లి చ‌ర్చ‌ల తీరును అభినందించారు. పెద్ద‌ల స‌భ‌గా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా అనేక మంది ప్ర‌శంస‌లు అందుకున్నాం. కానీ ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిణామాలు బాధాక‌రం. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం వ్య‌తిరేకిస్తున్నాం. మండ‌లిని కొన‌సాగించాల‌ని కోరుతున్నాం” అని ఆయన తెలిపారు.

 

 

 

 

 

 

 

 

బిల్లులకు మోకాలడ్డటం సరికాదు: వైసీపీ ఎమ్మెల్సీ వెన్న‌పూస గోపాలరెడ్డి

మండ‌లి ర‌ద్దు చేయాల‌ని తాను కూడా ప్ర‌తిపాద‌న చేశాన‌ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్న‌పూస గోపాలరెడ్డి బీబీసీతో చెప్పారు.

“శాసనమండలిని పూర్తిగా రౌడీయిజంతో నింపేశారు. 151 మంది ఎమ్మెల్యేలు పంపించిన బిల్లులకు మోకాల‌డ్డ‌టం స‌హించ‌లేనిది. స‌ల‌హాలు ఇవ్వ‌కుండా రూల్స్ పేరుతో ప్ర‌తి బిల్లుకు అడ్డుప‌డ‌టం ప్ర‌భుత్వ ప‌నితీరుకు అడ్డంకులు క‌ల్పించ‌డానికే. ఇలాంటి స‌భ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు భార‌మే త‌ప్ప ఉప‌యోగం లేదు. ఆంగ్ల మాధ్యమం బిల్లుకు అడ్డుప‌డిన‌ప్పుడే మండ‌లి ర‌ద్దు చేయాల‌ని ముఖ్యమంత్రికి ప్ర‌తిపాదించాను. ఇప్ప‌టికైనా నిర్ణ‌యం తీసుకున్నారు, సంతోషం. శాస‌న‌మండ‌లిలో టీడీపీ స‌భ్యులు రౌడీయిజం చేస్తే, దానిని టీడీపీ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు స‌మ‌ర్థించ‌డం, అలాంటి వారిని అభినందించ‌డం సిగ్గుచేటు” అని ఆయన విమర్శించారు.

రాజశేఖరరెడ్డి
చిత్రం శీర్షికశాసనమండలి పునరుద్ధరణకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2004 జులై 8న ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది

రద్దు చేసిన ఎన్టీఆర్... పునరుద్ధరించిన వైఎస్‌

భారత రాజ్యాంగ అధికరణ 168 ప్ర‌కారం అవిభాజ్య ఏపీలో శాస‌న‌మండలి ఏర్పాటు చేయాల‌ని 1956 డిసెంబ‌ర్ 5న అసెంబ్లీలో తీర్మానం చేశారు. 1958 జులై 1న‌ మండలి ఏర్పడింది. జులై 7న నాటి రాష్ట్ర‌ప‌తి బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ మండ‌లికి వచ్చారు.

ఎన్టీఆర్ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ మండ‌లి కొన‌సాగింది. 1983లో ఎన్టీఆర్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన రెండు నెల‌లకే మార్చి 24న మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసింది.

శాసనమండ‌లిలో విపక్ష కాంగ్రెస్ స‌భ్యులు ఎక్కువ‌గా ఉన్న నేపథ్యంలో ఆయన నాడు ఈ నిర్ణయం తీసుకొన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ స‌భ‌ను బ‌హిష్క‌రించింది. కాంగ్రెస్ తరపున నీలం సిద్ధారెడ్డి స‌భ‌కు హాజ‌రై ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని వ్య‌తిరేకించారు.

211 మంది ఎమ్మెల్యేలు హాజ‌రుకాగా టీడీపీతో పాటు క‌మ్యూనిస్టులు, స్వ‌తంత్ర ఫ్రంట్, మ‌జ్లిస్, సంజ‌య్ విచార్ మంచ్ స‌భ్యులు మండ‌లి ర‌ద్దు తీర్మానానికి ఆమోదం తెలిపారు. 210 మంది స‌భ్యులు తీర్మానానికి ఆమోదం తెలపగా, స‌హ‌చ‌రులంతా వాకౌట్ చేసిన‌ప్ప‌టికీ స‌భ‌కు హాజ‌రైన ఒకే ఒక్క కాంగ్రెస్ స‌భ్యుడు సిద్ధారెడ్డి దీనిని వ్యతిరేకించారు.

మండలి రద్దు ప్రతిపాదనకు కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రాలేదు. ఇందిర హత్యానంతరం బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం మండలి రద్దుకు సమ్మతించింది. పార్లమెంటు ఆమోదం తర్వాత 1985 మే 31న మండ‌లి ర‌ద్దు అమ‌ల్లోకి వ‌చ్చింది. అసెంబ్లీ తీర్మానం చేశాక రెండేళ్ల తర్వాత రద్దు అమల్లోకి వచ్చింది.

తర్వాత మ‌ర్రి చెన్నారెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం దీనిని పున‌రుద్ద‌రించేందుకు ప్ర‌య‌త్నించింది. 1990 జ‌న‌వ‌రి 22న నాటి అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు పార్ల‌మెంట్ ఆమోదం లభించలేదు.

2004లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక శాసనమండలి పునరుద్ధరణకు 2004 జులై 8న ఏపీ అసెంబ్లీ తీర్మానం పొంది, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

మండలి పునరుద్ధరణ బిల్లుకు 2006 డిసెంబ‌ర్ 16న లోక్‌సభలో, 20న రాజ్యసభలో ఆమోదం లభించింది. 2007 జ‌న‌వ‌రి 10న రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. 2007 మార్చి 30న మండ‌లి తిరిగి మనుగడలోకి వచ్చింది. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు మండలి ఏర్పాటైంది.

2014లో ఏపీ విభ‌జ‌న‌ తర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనమండళ్లు ఏర్పడ్డాయి.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading