BBC Indian Sportswoman of the Year
ఆ స్టేడియంలో చిన్న చిన్న గుంపులుగా అమ్మాయిలు సాధన చేస్తున్నారు. అక్కడ ఒక్క మాట కూడా వినిపించట్లేదు. 90ల నాటి బాలీవుడ్ పాటలు మాత్రం గట్టిగా వినిపిస్తాయి. కానీ, ఆ అమ్మాయిల దృష్టి మాత్రం సాధన మీదే ఉంది.
అది లఖ్‌నవూ నగరం. జనవరి చలికి నగరం గజగజా వణుకుతోంది. కానీ, సాధన చేస్తున్న ఆ అమ్మాయిల ఊపిరి నుంచి పుట్టే వేడికి స్టేడియం మొత్తం వెచ్చగా మారిపోయింది. ఆ యువతుల మధ్యలో దేశం గర్వించదగ్గ మరో యువ రెజ్లర్ కూడా ఉన్నారు. ఆమే వినేశ్ ఫోగట్. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి మేం వచ్చాం.
మమ్మల్ని చూడగానే ఆమె చిరునవ్వు నవ్వి, పలకరింపుగా చేయి ఊపారు. మళ్లీ సాధనలో మునిగిపోయి కోచ్ చెబుతున్న మాటల్ని శ్రద్ధగా వింటున్నారు.
వినేశ్ 1994 ఆగస్టు 25న పుట్టారు. తల్లి పెంపకంలోనే ఆమె పెరిగారు. గత ఐదేళ్లుగా ఆమె సాగిస్తున్న ప్రయాణాన్ని గమనిస్తే.. అందులో కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల, అనేక విజయాలతో పాటు బోలెడు కన్నీళ్లు కూడా కనిపిస్తాయి.
ఇంటర్వ్యూ ఇవ్వడానికి వినేశ్ రెజ్లింగ్ మ్యాట్‌పై కూర్చుంటూనే, హరియాణాలోను.. అదీ ఫోగట్ కుటుంబంలో పుట్టడం వల్ల తన జీవితంలో రెజ్లర్ కావాలని ఎప్పుడో రాసుందని చెప్పారు.
వినేశ్ పెదనాన్న మహావీర్ ఫోగట్ (ఆయన జీవితం ఆధారంగానే దంగల్ సినిమా తీశారు) స్వయంగా రెజ్లర్. ఆయన తన కుటుంబంలోని అమ్మాయిలకు రెజ్లింగ్ నేర్పించాలని వాళ్ల చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు.
వాళ్లలో ఆయన కూతుళ్లు గీతా, బబితా ఫోగట్‌లతో పాటు తమ్ముడి కూతురు వినేశ్ ఫోగట్ కూడా ఉన్నారు.
కఠోర శ్రమ, అంకిత భావం, అనేక విజయాలతో పాటు కన్నీళ్లు.. రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయగాథ
20 ఏళ్ల క్రితం, అదీ హరియాణాలో పురుషాధిక్యం ఉన్న ఓ గ్రామంలో అమ్మాయిలకు రెజ్లింగ్ నేర్పించాలన్న ఆలోచన రావడమే సాహసం.
“2000 సంవత్సరం తొలినాళ్లలో మాకు నరకంలో జీవిస్తున్నట్లే అనిపించేది. నాకు ఆరేళ్ల వయసులో పెదనాన్న మాకు రెజ్లింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. మేం అక్క చెల్లెళ్లం జుట్టు పొట్టిగా కత్తిరించుకొని, చిన్న నిక్కర్లు వేసుకొని గ్రామంలో సాధన చేసేవాళ్లం. దాంతో పెదనాన్నను గ్రామస్థులు నానా మాటలు అనేవారు. కొందరు ఆడవాళ్లు మా అమ్మ దగ్గరకు వచ్చి కనీసం పొడవాటి ప్యాంట్లు వేసుకొని అయినా నన్ను సాధన చేయమని చెప్పమనేవారు. నిజానికి మొదట్లో మా అమ్మ కూడా నన్ను అలా చూసి ఇబ్బందిపడేది” అంటారు వినేశ్.
“కానీ, చిన్నప్పట్నుంచే నేను ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశా. కావాలంటే వాళ్ల పిల్లలకు పొడవాటి ప్యాంట్లు వేసుకోమని చెప్పమని, నా గురించి కామెంట్ చేయద్దని చెప్పమని అమ్మకు చెప్పేదాన్ని. రెజ్లింగ్ సాధన చేస్తున్నప్పుడు నేను ఎవరికీ తక్కువ కాదనే భావన కలిగేది” అంటారామె.ఆ పోరాట పటిమే వినేశ్‌కు తన రెజ్లింగ్ కెరీర్‌లో బాగా ఉపయోగపడింది.
కానీ, ఆమె ఎదుగుదల ఏమంత సాఫీగా సాగలేదు.
“రెజ్లింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాక తొలి రెండు నెలలు సరదాగా అనిపించింది. హాయిగా మట్టిలో ఆడుకునేవాళ్లం. మమ్మల్నెవరూ చదవమని అడిగేవాళ్లు కాదు. కానీ, కొన్ని రోజుల తరువాత మాలో రెజ్లింగ్ నైపుణ్యం ఉందని పెదనాన్న గుర్తించాక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. చిన్నప్పుడే మాకు చాలా కఠినమైన ప్రాక్టీస్ షెడ్యూల్ ఉండేది.
తెల్లవారుజామున 3.30కే మమ్మల్ని నిద్రలేపేవారు. ఆ తరువాత సాధన ఎంతసేపు ఉంటుందనేది ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు 5 గంటలపాటు సాధన సాగేది. తరువాత స్కూలుకెళ్తే క్లాస్‌లో నిద్రొచ్చేది. జుట్టు పెంచితే ఏకాగ్రత దెబ్బతింటుదని దాన్ని కత్తిరించేసేవారు. తినడం, పడుకోవడం, రెజ్లింగ్ సాధన చేయడం తప్ప మరో జీవితమే ఉండేది కాదు.
సాధనలో తప్పు చేస్తే మాకు దెబ్బలు తప్పేవి కాదు. హరియాణాలో ఆడపిల్లపై చేయిజేసుకోవడం మంచిది కాదని భావిస్తారు. కానీ, మా పెదనాన్న అవన్నీ పట్టించుకోలేదు. మాతో ఒలింపిక్స్‌లో పతకం గెలిపించాలన్నదే ఆయన లక్ష్యంగా ఉండేది. చిన్నప్పుడు నాకు ఒలింపిక్స్ అంటే కూడా ఏంటో తెలీదు. ఒక దశలో కోపమొచ్చి.. ‘ఎవరీ ఒలింపిక్? ఎక్కడ్నుంచైనా ఓ పతకం తెచ్చి అతడికి ఇచ్చేయండి’ అన్నాను. కానీ, ఆయన ఏం చేసినా మాకోసమే అనే నమ్మకం పెదనాన్నపై ఉండేది” అని తన చిన్ననాటి పరిస్థితులను వినేశ్ గుర్తుచేసుకున్నారు.
కానీ, ఆ శిక్షణ వృథా పోలేదు. 2009 నాటికి వాటి ఫలితాలు అందసాగాయి. వినేశ్ క్రమంగా జూనియర్, సీనియర్ రెజ్లింగ్ టోర్నమెంట్లలో పతకాలు గెలవడం మొదలుపెట్టారు.
2014 కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. టీనేజీలో ఉండగానే తానో అంతర్జాతీయ స్టార్‌నని ఆమె ప్రపంచానికి నిరూపించారు.
ఆమె కజిన్స్.. గీతా ఫోగట్, బబితా ఫోగట్ కూడా కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకున్నారు.
క్రమంగా భారత రెజ్లింగ్‌కు వినేశ్ పోస్టర్ గాళ్‌గా మారిపోయారు. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ ఆమెపై చాలా ఆశలు పెట్టుకుంది.
కానీ, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర గాయం కావడంతో నొప్పితో విలవిల్లాడుతూ ఆమె ఎరీనా నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అలా ఆమె ఒలింపిక్స్ పతకం కలలు ఆవిరయ్యాయి. తరువాత ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.
తన కెరీర్‌లో అత్యంత చీకటి రోజులు అవేనని, తాను తిరిగి స్టేడియంలో అడుగుపెడతానో లేదోనన్న భయంతో ఉండేదాన్నని వినేశ్ చెప్పారు.
“గాయాల కారణంగా కెరీర్ ముగిసిపోయిన ఎంతో మంది మంచి క్రీడాకారుల గురించి నాకు తెలుసు. క్రీడాకారులకు తీవ్రమైన గాయమైతే కెరీర్ ముగిసినట్లేనని చాలామంది భయపెడతారు. నేను కూడా మళ్లీ ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం లేదని, 21ఏళ్లకే కెరీర్ ముగుస్తుందేమోనని భయపడ్డా. నిత్యం నరకం అనుభవించా. గాయమయ్యాక మూడేళ్ల పాటు ప్రతిరోజూ నాతో నేను పోరాటం చేశా” అని వినేశ్ గుర్తుచేసుకున్నారు.
కాసేపు స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆమె కళ్లు కూడా కాస్త చెమ్మగిల్లాయి. దాన్ని ఇతరులు గుర్తించేలోపే ఆమె మళ్లీ తేరుకున్నారు.
చిత్రం శీర్షిక
చిత్రం శీర్షిక
ఓటమి, గాయాలు, ఫామ్ కోల్పోవడం.. ఇలాంటి పరిస్థితులను క్రీడాకారులు ఎలా ఎదుర్కొంటారు?
ఈ ప్రశ్న వేసినప్పుడు వినేశ్‌లో ఆధ్యాత్మిక కోణం బయటపడుతుంది.
“నేను నమ్మే దేవుడితోనే నేను ఈ విషయాల గురించి మాట్లాడతాను. నాకు ఇబ్బంది కలిగించే అంశాల గురించి వేరే వాళ్లతో చర్చించడం నాకు ఇష్టం ఉండదు. నిజానికి, నా సమస్య ఏంటో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం కూడా నాకు రాదు. అందుకే నాతోనే నేను మాట్లాడుకుంటూ, నా ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తా. అంతిమ నిర్ణయం కూడా నేనే తీసుకుంటా” అంటారామె.
గత ఒలింపిక్స్‌లో గాయం నుంచి కోలుకున్నాక వినేశ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు. 2018 ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో భారత్ తరఫున మొట్టమొదటి బంగారు పతకాన్ని ఆమె గెలుచుకున్నారు.
మధ్యలో ఆమె కొన్ని ఓటములను కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోతున్నందుకు విమర్శలకూ గురయ్యారు.
కానీ, ఆమె అంకితభావం, కొత్త కొచ్, కొత్త శిక్షణ మెలకువలు.. ఇలా అన్ని అంశాలూ ఆమెకు అద్భుతంగా కలిసొచ్చాయి. దాంతో 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె తన మొట్టమొదటి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
‘నాకు ఓటమి అంటే ఇష్టం ఉండదు’ అంటారామె.
ఆ దృక్పథం తన తల్లి నుంచి వచ్చిందని, తాను సాధించిన విజయాలకు తల్లితో పాటు పెదనాన్న మహావీర్ ఫోగట్ కారణమని వినేశ్ చెబుతారు.
వినేశ్ చిన్నతనంలోనే ఆమె తండ్రి హత్యకు గురయ్యారు. ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య తల్లి ఆమెను పెంచి పెద్ద చేశారు.
“నాన్న బతికున్నప్పుడు అంతా బావుండేది. నేను సాధన చేయడం కూడా ఆయన చూసేవారు. కానీ, ఆయన చనిపోయాక, వీలైనంత త్వరగా నాకు పెళ్లి చేసేయమని గ్రామస్థులు అమ్మకు సలహాలిచ్చేవారు. వాళ్ల తండ్రి బతికున్నాడు కాబట్టి గీతా, బబితా రెజ్లింగ్ ఆడుతున్నారు, కానీ నా పరిస్థితి అలా కాదని గుర్తు చేసేవారు. నేను ఏదో ఒకటి సాధిస్తానని వాళ్లు నమ్మలేదు. కానీ, మా అమ్మ అన్నీ తట్టుకుంటూ దృఢంగా నిలబడింది. మా ఆర్థిక పరిస్థితి ఏమంత గొప్పగా ఉండేది కాదు. అయినా మాకు ఏ కష్టం తెలియనివ్వకుండా పెంచింది.
పెదనాన్న శిక్షణ చాలా కఠినంగా ఉండేది. కొన్నిసార్లు దెబ్బలు కూడా తినాల్సి వచ్చేది. రెజ్లింగ్ మానేద్దామని కూడా అనిపించేది. కానీ, మా అమ్మ కష్టాన్ని చూసినప్పుడు నా సమస్యలను పక్కనబెట్టి ఎలాగైనా రెజ్లర్ అవ్వాలని అనుకునేదాన్ని” అని వినేశ్ వివరించారు.
ఆమ్మ కష్టం, పెదనాన్న శిక్షణ, తన కఠోర శ్రమ కలిసి వినేశ్‌ను ఒక అంతర్జాతీయ ఛాంపియన్‌గా నిలబెట్టాయి.
వినేశ్‌కు ఈ కొత్త సంవత్సరం రోమ్ మాస్టర్స్ విజయంతో ప్రారంభమైంది.
ఇన్నేళ్ల పోరాటంలో ఆమెకు తోడున్న వ్యక్తి మరొకరు ఉన్నారు. అతడే సోమ్‌వీర్ రథీ. అతడు కూడా ప్రొఫెషనల్ రెజ్లరే. 8 ఏళ్ల వీళ్ల పరిచయంలో క్రమంగా ప్రేమ చిగురించింది.
తన కోసం సోమ్‌వీర్ అతడి కెరీర్‌ను కూడా త్యాగం చేశాడని, తనకు అత్యంత నమ్మకస్తుడు అతడనేని వినేశ్ చెబుతారు. ఆ మాట చెబుతున్నప్పడు ఆమె కళ్లలో కాస్త బాధ కనిపించింది.
2018లో ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచి వినేశ్ భారత్ తిరిగి వచ్చినప్పుడు, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే సోమ్‌వీర్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. కొన్ని నెలల తరువాత వాళ్లిద్దరి పెళ్లి జరిగింది.
ఆట మధ్యలో వినేశ్ సినిమాలు కూడా చూస్తుంటారు. ‘బాహుబలి’ సినిమాలోని భారీతనం చూసి తనకు మతిపోయిందని ఆమె చెబుతారు.
ఆమెకు తిండిపైనా ఆసక్తి ఎక్కువే. “భూమ్మీద ఉన్న అన్ని రకాల ఆహార పదార్థాల్ని రుచి చూశాకే, ప్రపంచమంతా పర్యటించాకే చనిపోవాలనుంది” అంటారామె.
“జీవితంలో కొంతమందికి మాత్రమే రెండో అవకాశం వస్తుంది. నాక్కూడా గాయంతో ఒకసారి ఒలింపిక్స్ నుంచి దూరమయ్యాక టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి రెండో అవకాశం వచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్న నా కలను నిజం చేసుకోవాలనుంది” అన్నారామె.
ఇక ఆ తరువాత వినేశ్ ఏమీ మాట్లాడలేదు. ఆమె ఆలోచనలన్నీ 2020 టోక్యో ఒలింపిక్స్ వైపు వెళ్లసాగాయి.
Source:https://www.bbc.com/telugu/india-51279296
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.