‘అంపన్’‌.. సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం!

Spread the love

*‘అంపన్’‌.. సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం!* *సాయంత్రం 4గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష* *అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు* దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్‌ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీల దూరంలో, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ సాయంత్రానికి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుపాను తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటలకు హోంమంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో సమావేశం కానున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావంపై సమీక్షించనున్నారు. ఈ సాయంత్రానికి అంపన్‌ తీవ్రరూపం దాల్చి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. *తీరం దాటే సమయంలో 185కి.మీల వేగంతో గాలులు* ఉత్తర ఈశాన్య ప్రాంతం దిశగా 8కి.మీల వేగంతో కదులుతోన్న అంపన్‌ మరింత బలపడి ఈ సాయంత్రానికి పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 20న సాయంత్రం తుపాను తీరం దాటే సూచన ఉన్నట్టు తెలిపింది. బెంగాల్‌ – బంగ్లాదేశ్‌ మధ్య హతియా దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 185.కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది .అలాగే, ఉత్తర కోస్తాంధ్రలోనూ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. *అప్రమత్తమైన ఒడిశా సర్కార్‌* ఏడాది క్రితం ఫణి తుపాను తర్వాత ముంచుకొచ్చిన ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 10లక్షల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 12 తీర ప్రాంత జిల్లాల్లో పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నట్టు వెల్లడించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధికారుల్ని ఆదేశించారు. అలాగే, తాగునీరు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పైనా దృష్టిపెట్టాలన్నారు. *రంగంలోకి 17 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు* మరోవైపు, తుపాను తీవ్రత నేపథ్యంలో 17 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే ఒడిశా, బెంగాల్‌లో పనిచేస్తున్నాయి. బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో 7బృందాలు, అలాగే, ఒడిశాలో 10 బృందాలను మోహరించి ఉన్నాయి. ఒక్కో బృందంలో 45మంది సిబ్బంది ఉంటారు. *తమిళనాడు, కర్ణాటకకూ భారీ వర్ష సూచన* ఈశాన్య ఒడిశా ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా అన్నారు. తమిళనాడు, కర్ణాటకలలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. *భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ సహాయక చర్యలు* తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొనే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు బెంగాల్‌ హోంశాఖ కార్యదర్శి అలాపన్‌ బందోపాధ్యాయ్‌ అన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను తీర ప్రాంతాలకు పంపినట్టు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading