నమ్మకు నమ్మకు ఈ మాటని!

Spread the love

*నమ్మకు నమ్మకు ఈ మాటని!* ‘పెళ్లి చేసుకుంటాను… నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. – *గొర్రెకుంటబావి సంఘటన* ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. – *ఓ బాధితురాలు* ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్‌లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్‌లైన్‌లో మరొకడు తగులుతాడు. ఈ మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక! అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.. అదెలాగంటే… కొన్ని మాటలు ఆకాశానికి ఎత్తేసినట్టు ఉంటాయి. ఇంకొన్ని అలసిన మనసుకు ఊరటనిస్తాయి. మరికొన్ని.. జీవితం ఊగిసలాటలో ఉన్న మనిషిని పక్కదారి పట్టిస్తాయి. వీటిని కనిపెట్టకపోతే.. అవి మాట్లాడేవారికి అడ్డుకట్ట వేయకపోతే జీవితాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఆ మాటల్లోని అసలు విషయం అర్థమయ్యేలోపు పరిస్థితి చేజారిపోతుంది. జీవితాంతం బాధపడాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పువాటిల్లే ప్రమాదముంది. ఇటీవల సంచలనం రేపిన ఘోరనేరాలన్నీ మాయమాటల మాటున సాగినవే! *మాటల తాంత్రికులు..* జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితుల్లో.. ఈ మాటల తాంత్రికుల ఉచ్చులో పడే ప్రమాదం ఉందంటారు మానసిక నిపుణులు. ముఖంలో కనిపించే భావాలను డీకోడింగ్‌ చేసి.. ఎవరికి ఎలా ఎరవేయాలో బాగా తెలిసిన వాళ్లుంటారు. ఇంట్లో ఆప్యాయత అడుగంటిన వారిని ఒకలా పలకరిస్తారు. ఒంటరి మహిళలను మరోలా టార్గెట్‌ చేస్తారు. చెప్పలేనంత ప్రేమ కురిపించేస్తుంటారు. అయోమయస్థితిలో మాయోపాయంతో దగ్గరవుతారు. ‘అతను నా పక్కనుంటే ఎంత బాగుంటుంది’ అనే స్థితికి తీసుకొస్తారు. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే.. నలుగురిలో తలదించుకోకూడదంటే.. స్వార్థాన్ని ముందే పసిగట్టాలి. మోసాన్ని మొగ్గలోనే తుంచేయాలి. *ధైర్యంగా అడుగెయ్‌..* * ఇరుగు పొరుగుతో, పనిచేస్తున్న చోట వ్యక్తిగత విషయాలు అతిగా చెప్పొద్ధు ఎంత వరకు అవసరమో.. అంతే చెప్పాలి. వ్యక్తిగత విషయాల్లో మూడో వంతు మనదగ్గరే దాచుకోవాలి. దగ్గరి స్నేహితులతోనూ కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలి. * సహోద్యోగులతో ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. తరచూ సందేశాలు పంపుతుండటం, తరచూ కలుస్తుండటం వంటి వాటిని ప్రోత్సహించొద్ధు * అనవసర సాయాలు ఆశించొద్ధు అవతలి వ్యక్తి అయాచితంగా సాయం చేశాడంటే.. ఏదో ఆశిస్తున్నాడని శంకించాల్సిందే! * ఒకవేళ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నా.. అంతా లీగల్‌గా ఉండాలి. * చిన్న చిన్న సాయాలు చేయడానికి అత్యుత్సాహం కనబరుస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సున్నితంగా తిరస్కరించాలి. అయినా వైఖరి మార్చుకోకపోతే మొహమాటం లేకుండా ఇంట్లోవాళ్ల సాయంతో హెచ్చరించాలి. వినకపోతే పోలీసులను, విమెన్‌ లీగల్‌ సెల్‌ని ఆశ్రయించాలి. * సమాజంలో జరుగుతున్న ఘోరాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితులు మనకు ఎదురుకావు అనే గుడ్డి నమ్మకం వద్ధు అలాగని అనుమానించాల్సిన అవసరమూ లేదు. పాత్ర ఎరిగి ప్రవర్తించడం విజ్ఞత అనిపించుకుంటుంది. – *గౌరీదేవి, సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్‌* *లక్ష్యం వీళ్లే..* ఒంటరి స్త్రీలు, పెళ్లికాని మహిళలు, కుటుంబ భారం మోస్తున్న ఇంతులు.. వీరినే లక్ష్యంగా ఎంచుకుంటారు మోసగాళ్లు. బాధలో ఉన్నవారిపై జాలి చూపుతారు. చిన్న చిన్న సాయాలు చేస్తుంటారు. సానుభూతి చూపుతున్నారని కొందరు తమ కష్టాలన్నీ చెప్పుకొంటారు. వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటారు. వీటినే ఎదుటివారు బలహీనతగా మార్చుకుంటారు. కృతజ్ఞత చూపేలా తెలివిగా వ్యవహరిస్తారు. బలహీన క్షణంలో లోబరుచుకొని.. సాగినంత కాలం గడిపేస్తారు. మాయలు పసిగట్టి, మృగాన్ని కనిపెట్టి మహిళ ఎదురుతిరిగినప్పుడు తప్పించుకునే దారులు వెతుక్కుంటారు. ఆ ఆడమనిషి వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తారు. జీవితాన్ని రభస చేస్తారు. మానసికంగా వేదిస్తారు. బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. తమ దారికి అడ్డుగా ఉన్నారని భావిస్తే.. ఎంతకైనా తెగిస్తారు. *కొందరితో కాస్త చనువుగా ఉన్నా.. అతిగా వ్యవహరిస్తారు. ‘నువ్వు లేకపోతే చచ్చిపోతా!’ అన్నట్టు బెదిరిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మనోధైర్యంతో నిలబడాలి. లోలోపల భయాలున్నా.. బయటపడకుండా జాగ్రత్తపడాలి. స్నేహితులు, ఇంట్లోవాళ్ల సాయంతో ఇబ్బందిని అధిగమించాలి.*


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading