*ఏపీ లోని 14 వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్‌లు* *డిజిటల్ పాఠాలకు ప్రత్యేక విభాగం* *ఆన్‌లైన్‌లో 20 శాతం పాఠాలు* *ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి*
ఈనాడు – అమరావతి: విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాల్లో ట్రూనాట్ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అవసరమైన విద్యార్థులకు ఈ ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. వర్సిటీల్లోని మైక్రోబయాలజీ విభాగాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలను తెరిచేందుకు, పరీక్షల నిర్వహణకు అకడమిక్ కేలండర్ రూపొందించామన్నారు. 20 శాతం పాఠాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని, డిజిటల్ అభ్యాసన కంటెంట్ రూపకల్పనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం, కరోనా నేపథ్యంలో విద్యా సంస్థల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. *రెండు విడతలుగా తరగతులు* ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రతి పాఠశాల, కళాశాలల్లో ప్రత్యేకంగా ఒక ఐసొలేషన్ గదిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు విడతలుగా తరగతుల నిర్వహణ కొనసాగుతుంది. పాఠశాల, కళాశాలల ఆవరణలను కరోనా వైరస్ రహితంగా శుద్ధి చేయాలి. చేతులు కడుక్కునేందుకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మాస్కులు ధరించాలి. 7-10 తరగతుల పుస్తకాలు ముద్రించి జిల్లాలకు పంపించాం. 1-6 తరగతుల ముద్రణకు సన్నాహాలు సాగుతున్నాయి. పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే ఒకొక్కటి రూ.1500 విలువైన జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందిస్తాం. డిగ్రీ, ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలను జులైలో నిర్వహిస్తాం. ఎంసెట్ జులై 27 నుంచి 31 వరకు కొనసాగుతుంది. డిగ్రీ కళాశాలలు ఆగస్టు 1న పునఃప్రారంభమవుతాయి. మొదటి ఏడాది డిగ్రీ విద్యార్థులకు సెప్టెంబరు 15, ఇంజినీరింగ్ వారికి సెప్టెంబరు 2, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు సెప్టెంబరు 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 10 నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. *జులై 15 నుంచి ఉపాధ్యాయ బదిలీలు* విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలను వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పూర్తి చేస్తాం. జులై 15 నుంచి చేపట్టి, ఆగస్టు 3లోపు పూర్తి చేస్తాం. * డీఎస్సీ-2018 పెండింగ్ ఎస్జీటీ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం. కోర్టు కేసులను త్వరలోనే పరిష్కరించి, నియామకాలు చేపడతాం. కొత్త డీఎస్సీకి సంబంధించి ఖాళీల వివరాలు తీసుకున్నాం. * వర్సిటీల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ విషయంలో కోర్టు కేసులు డిసెంబరు నాటికి పరిష్కారమవుతాయని భావిస్తున్నాం. ఆ తర్వాత నియామకాలు చేపడతాం.