పాత, కొత్తల కలయికతోనే ప్రగతి

Spread the love

*పాత, కొత్తల కలయికతోనే ప్రగతి* *నాటి అలవాట్లలో కొన్నయినా మళ్లీ రావాలి* *ఉపరాష్ట్రపతి మనోగతం* *చద్దన్నం, తాటిముంజలను గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు* ఈనాడు, దిల్లీ: ఊరగాయను నంజుకొని తినే చద్దన్నం.. గుడిలో పంచిపెట్టే ప్రసాదం.. పురుగుమందులను వాడకుండా ఇంట్లోనే పండించే కూరగాయలు.. జాబిల్లి వెలుతురులో ఆరుబయట నిద్ర.. ఇలాంటి గత స్మృతుల్లోకి తాజాగా తొంగిచూశారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. దశాబ్దాల క్రితం నాటి ఆ అలవాట్లలో కొన్నింటినైనా తిరిగి అనుసరించడం ప్రారంభిస్తే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటున్న ఉపరాష్ట్రపతి తాజాగా మరోసారి తన మనసులోని భావాలను బయటపెట్టారు. పాత, కొత్తల కలయిక లేనిదే ప్రగతి లేదన్న సంగతిని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దశాబ్దాల క్రితం నాటి పల్లెటూరి అలవాట్లను వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. చద్దన్నం, వస్తుమార్పిడి విధానం, దేవాలయాల్లో ప్రసాదాలు, ఆదివారం నాడు వండుకునే కోడికోర లేదా వేటకూర, తాటి ముంజలు, ఆరుబటయ నిద్ర వంటి విషయాలను స్మరించుకున్నారు. ‘‘సజ్జలు, జొన్నలు, రాగులను ఎక్కువగా తింటూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకునేవారు. బాధ్యతల విషయంలోనూ అంతే. ఎవరింట్లో పెళ్లి జరిగినా ఊరంతా సంబరముండేది. నలతగా ఉంటే ‘కస్తూరి మాత్రలు’ వాడేవారు. అంటురోగం వస్తే భౌతిక దూరం పాటించేవారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా తాటాకులతో దడుల ఏర్పాటు ఉండేది. చద్దన్నంలో ఊరగాయను నంజుకొని తింటే మధ్యాహ్నం వరకు రైతులు అలసట లేకుండా పనులు చేసుకోగలిగేవారు. చద్దన్నంతో రోగనిరోధక శక్తి పెరిగేది. జీర్ణవ్యవస్థకు మేలు చేసేలా వేడివేడి అన్నంలో రసం, పచ్చడి తినేవారు. తాంబూలసేవనం తప్పనిసరి’’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. *జాబిలి లోగిలిలో నిద్ర* ‘‘ఒకప్పుడు నులక మంచంపై పడుకోవడం వల్ల నడుం నొప్పుల వంటి సమస్యలేవీ వచ్చేవి కావు. రాత్రివేళ వెన్నెలలో ఆరుబయట నిద్రించడం, పగటి వేళ సూర్యరశ్మి తాకేలా పనులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండేది. చిన్నారులకు పెద్దలు పంచతంత్ర కథలు చెప్పేవారు. పెద్దబాలశిక్ష వంటి పుస్తకాలను వివరించేవారు. జీవన సత్యాలను బోధించేవారు. సంక్రాంతిని పశువుల పండుగగా కూడా భావించేవారు. అప్పట్లో రాగి, కంచు పాత్రల వినియోగం ఎక్కువ. అవి వైరస్‌ను నిరోధిస్తాయని నిపుణులు తేల్చడంతో మళ్లీ ఇప్పుడు అందరూ ఆ పాత్రల వాడకానికి మొగ్గుచూపుతున్నారు. ఆముదం, కొబ్బరినూనె వినియోగం కారణంగా ఒకప్పడు ప్రజలు జుట్టుకు రంగు వేసుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఇంటింటా తులసి మొక్క ఉండేది. పెద్దల కనుసన్నల్లో అందరికీ మంచి చెడులు తెలిసేవి. నాటి జీవనం భారతీయ సంప్రదాయాలకు నిలువుటద్దం’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading