*ఇంటర్‌లో నయా రికార్డు* *తెలంగాణ ఏర్పాటు తర్వాత గరిష్ఠ ఉత్తీర్ణత ఇదే* *ద్వితీయ ఇంటర్‌లో 68.86 శాతం పాస్* *ప్రథమ ఇంటర్‌లో 60.01 శాతం* *అగ్రగామిగా మేడ్చల్ జిల్లా* *ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి* ఈనాడు – హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఈసారి భారీ ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ద్వితీయ ఇంటర్‌లో దాదాపు నాలుగు శాతం అధికం. కిందటి సంవత్సరం ద్వితీయ ఇంటర్‌లో ఉత్తీర్ణత 65.01 శాతం కాగా ఈసారి 68.86 శాతానికి పెరిగింది. ప్రథమ ఇంటర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు సంవత్సరాల ఫలితాల్లో బాలికలదే పైచేయి. బాలుర కంటే ఏకంగా 15 శాతం ఎక్కువగా వారు ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం నాంపల్లి విద్యాభవన్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది ఏప్రిల్ 18వ తేదీ విడుదల చేయగా.. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు నెలలు ఆలస్యంగా ఫలితాలు వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ ఈసారి రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత దక్కిందన్నారు. ఫలితాల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల కంట్రోలర్ ఖాలిక్, ఓఎస్‌డీ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. *ద్వితీయ ఫలితాల్లో ఆసిఫాబాద్ అగ్రస్థానం* * ప్రథమ, ద్వితీయ ఇంటర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే భారీగా నమోదైంది. * తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏటా ఉత్తీర్ణత పెరుగుతుండగా గత ఏడాది మాత్రమే తగ్గింది. ఈసారి మళ్లీ ఏకంగా 4 శాతం పెరిగింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్తీర్ణత. * మేడ్చల్ జిల్లా ఇంటర్ ప్రథమంలో 76 శాతం, ద్వితీయంలో 75 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. * ద్వితీయ ఇంటర్‌లో ఆసిఫాబాద్ జిల్లా 74 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. * ప్రథమ ఇంటర్‌లో 70 శాతంతో ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. * కేవలం ద్వితీయ ఇంటర్ జనరల్ విద్యార్థులను(ఒకేషనల్ కాకుండా) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 76 శాతం ఉత్తీర్ణతతో ఆసిఫాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉండటం విశేషం. * మెదక్ జిల్లా ప్రథమ ఇంటర్‌లో 36 శాతంతో, ద్వితీయంలో 42 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. * ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారిలో ఏ గ్రేడ్(75 శాతం, ఆపైన మార్కులు) సాధించిన వారే సగానికిపైగా ఉన్నారు. *ఉత్తీర్ణత శాతంలో తప్పులు..* ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరగరాదని డబుల్ చెకింగ్ చేస్తున్నామని.. గత అనుభవాలతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇంటర్‌బోర్డు ప్రకటించినా చివరకు ఈసారి కూడా గందరగోళం తప్పలేదు. విద్యార్థుల ఫలితాల్లో కాకుండా ఈసారి జిల్లాల వారీగా ప్రకటించిన ఉత్తీర్ణత శాతంలో తప్పులు దొర్లాయి. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం ఒకటే ఇచ్చారు. దానిని పాత్రికేయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిజమేనని అంగీకరిస్తూ అదితప్ప మిగతా వాటిల్లో మార్పు లేదని చెప్పారు. సరిచేసి మళ్లీ వివరాలు పంపిస్తామన్నారు. రెండోసారి పంపించిన గణాంకాలను… తొలుత ఇచ్చిన వివరాలతో పోల్చి చూస్తే జిల్లాల వారీగా ఇచ్చిన శాతాల్లోనూ తేడాలు కనిపించాయి. మొదటగా ఇచ్చిన వివరాల ప్రకారం ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్, ఆసిఫాబాద్ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. మళ్లీ పంపిన వివరాలను చూస్తే అప్పుడు రెండు జిల్లాలూ 80 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచాయి. అలాగే ఇతరత్రా గణాంకాల్లోనూ పలు చోట్ల తేడాలున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.