పీవీకి భారతరత్న ఇవ్వాలి

KCR
Spread the love

*పీవీకి భారతరత్న ఇవ్వాలి*

*ప్రధాని వద్దకు నేనే వెళ్లి విన్నవిస్తా* *ఏడాది పొడవునా శత జయంతి ఉత్సవాలు*

*హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగర, దిల్లీల్లో కాంస్య విగ్రహాలు* *రామేశ్వరం తరహాలో స్మారకం* *28న జ్ఞానభూమిలో ప్రారంభ వేడుక* *జాతీయస్థాయి సమావేశాలకు రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం:

సీఎం కేసీఆర్‌* దేశానికి విభిన్న రంగాల్లో పీవీ అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తాం. _విద్యారంగంలో పీవీ ఎంతో కృషి చేశారు. సర్వేల్‌లో మొదటి గురుకుల విద్యాలయం ప్రారంభించారు. అది దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇవన్నీ ప్రత్యేక సంచికలో రావాలి._ బిల్‌క్లింటన్‌, జాన్‌ మేజర్‌ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి. –

*సీఎం కేసీఆర్‌* ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ గర్వించదగ్గ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశ గతిని మార్చిన గొప్ప వ్యక్తి అయిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ఈ పురస్కారానికి ఆయన సంపూర్ణ అర్హులని, దీని కోసం డిమాండు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తానన్నారు. పార్లమెంటులో ఆయన చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు. రాష్ట్ర శాసనసభలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరలతో పాటు దిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామన్నారు. ఆయన పేరిట స్మారక పురస్కారాలను అందజేస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల ప్రకారం నిధులు ఇస్తామన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వీణాదేవి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

*రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి* స్వాతంత్య్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడుగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా నరసింహారావు సేవలందించారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్‌ తీయాలి. సావనీర్‌ మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో చేసిన కృషి, ఆయా రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలి. ఆర్థిక నిపుణులతో వ్యాసాలు రాయించాలి. పీవీకి ఘనమైన అక్షర నివాళి అర్పించే విధంగా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి.

*పుస్తకాల పునర్ముద్రణ* పీవీ రాసిన పుస్తకాలను ఈ సందర్భంగా పునర్ముద్రించాలి. అముద్రితంగా ఉన్న వాటి ముద్రణా జరగాలి. వాటిని గ్రంథాలయాలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలి. ఈ బాధ్యతను సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ తీసుకుంటుంది. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌, దిల్లీ, వరంగల్‌, కరీంనగర్‌, మంథని, బరంపురం, నాగపూర్‌ తదితర ప్రాంతాల్లో కాలం గడిపారు. ఆయా సందర్భాల్లో ఆయనతో గడిపిన వారు, ఆయనతో అనుబంధం గల వారున్నారు. వారినీ భాగస్వాములను చేయాలి. *జాతీయ స్థాయి కార్యక్రమాలు*

యావత్‌ దేశ ప్రజలకు ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను ఆహ్వానించాలి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి. ఆయన గొప్పతనం తెలిసేలా దేశ వ్యాప్తంగా… దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో హోర్డింగులు పెట్టాలి. హైదరాబాద్‌లో కనీసం 100 చోట్ల ఏర్పాటు చేయాలి.

*పీవీ పురస్కారాలు* విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పీవీ స్మారక పురస్కారాలను నెలకొల్పాలి. క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలి. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన తర్వాత విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రంలోని ప్రతి ఊరికీ పీవీ గొప్పతనం తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అన్నిస్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు అందు లో భాగస్వాములు కావాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.

*దేశమంతటా..* జూన్‌ 28న హైదరాబాద్‌లోని జ్ఞానభూమిలో పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యతో జరుగుతుంది. ఇదే ప్రధాన కార్యక్రమం. కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో ఆయన జయంతి వేడుకలు చేపడతారు. మంత్రి కేటీ రామారావు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

*రామేశ్వరం తరహాలో* రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మాదిరే హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

‘‘కేకే నేతృత్వంలోని కమిటీ సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి, స్మారకం ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలి. వివిధ సందర్భాలకు సంబంధించిన పీవీ ఫొటోలను సేకరించి ఎగ్జిబిషన్‌లు నిర్వహించాలి. నెలకొల్పబోయే కాంస్య విగ్రహాల కోసం వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading