*వెనక్కి తగ్గుదాం!* *ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు భారత్, చైనా నిర్ణయం* *సైనికాధికారుల భేటీలో ఏకాభిప్రాయం* దిల్లీ: నెలన్నర పాటు ఆవేశకావేశాలు, దాడులు, రక్తపాతాల తర్వాత తూర్పు లద్దాఖ్‌లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఘర్షణలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి సైనిక బలగాలను ఉపసంహరించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. ఇరు పక్షాల అగ్రశ్రేణి కమాండర్ల మధ్య సోమవారం ఏకబిగిన 11 గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్ ప్రాంతంలో చైనా భూభాగంలో ఈ చర్చలు జరిగాయి. భారత పక్షాన 14వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ జిల్లా కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్‌లు నాయకత్వం వహించారు. ఈ అధికారులిద్దరి మధ్య ఈ నెల 6న తొలి భేటీ జరిగింది. మే నెల నుంచి సాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బలగాల ఉపసంహరణను చేపట్టాలని నాడు నిర్ణయించారు. ఆ తర్వాత గల్వాన్ లోయలో ఈ నెల 15న రెండు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగి భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించారు. దాదాపు 40 మంది చైనా సైనికులు కూడా హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు పక్షాలూ.. పోటీపోటీగా వేల మంది బలగాలు, యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లను రంగంలోకి దించాయి. ఈ వేడిని చల్లార్చేందుకు సోమవారం చర్చలు జరిగాయి. ఈ భేటీ ప్రతిపాదన చైనా సైన్యం వైపు నుంచే వచ్చినట్లు సమాచారం. తాజా చర్చలు సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మకంగా సాగాయని భారత సైనిక వర్గాలు తెలిపాయి. గల్వాన్ ప్రాంతంలో చైనా సైనికులు ఉద్దేశపూర్వకంగానే తమ బలగాలపై దాడి చేశారని హరీందర్ గట్టిగానే ఆక్షేపించారని వివరించాయి. సరిహద్దుల్లో ప్రతిష్టంభన ఏర్పడిన అన్ని ప్రాంతాల నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాయి. ‘‘సైనిక ఉపసంహరణపై రెండు పక్షాల్లోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకునేందుకు విధివిధానాలపై చర్చలు జరిగాయి. వీటిని రెండు పక్షాలూ మరింత ముందుకు తీసుకెళ్లి, ఆచరణలోకి తెస్తాయి’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సైనికులకు మద్దతుగా కొంచెం వెనుక ప్రాంతాల్లో మోహరించిన బలగాలనూ ఉపసంహరించాలని భారత్ ప్రతిపాదించినట్లు వివరించాయి. అపరిష్కృత సమస్యలపై సైనికాధికారుల భేటీలో లోతుగా చర్చలు జరిగాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ బీజింగ్‌లో తెలిపారు. ఉద్రిక్తతలను చల్లార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని రెండు పక్షాల్లోనూ ఆకాంక్ష వ్యక్తమైందన్నారు. చర్చలను కొనసాగిస్తూ సరిహద్దుల్లో శాంతికి ఉమ్మడిగాకృషి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గల్వాన్ ఘర్షణల్లో చైనా సైనికులు ఎంత మంది చనిపోయారన్నది వెల్లడించేందుకు లిజియాన్ మరోసారి నిరాకరించారు. ‘‘40 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అవి తప్పుడు వార్తలు’’ అని తెలిపారు. చైనా సైనికులు 40 మంది హతమై ఉండొచ్చని కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె.సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
*సైన్యాధిపతి పర్యటన* మరోవైపు సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు. తొలుత ఆయన లేహ్‌లోని సైనిక ఆసుపత్రికి వెళ్లి, గల్వాన్ ఘర్షణల్లో గాయపడిన 18 మంది సైనికులను పరామర్శించారు. వారి ధైర్యసాహసాలను కొనియాడారు. అనంతరం ఆయన క్షేత్రస్థాయి కమాండర్లతో సమావేశమై, భారత సైనిక పోరాట సన్నద్ధతను సమీక్షించారు. అప్రమత్తత స్థాయిని కొనసాగించాలని ఆదేశించారు. బుధవారం కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. సరిహద్దుల్లోని పలు శిబిరాలను నరవణె సందర్శిస్తారు. తూర్పు లద్దాఖ్‌లో జరిగిన పరిణామాల దృష్ట్యా ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలను ఆయన సైన్యానికి తెలియజేయనున్నారు. చైనాతో చర్చలు సాగించిన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌తోనూ ఆయన సమావేశమయ్యారు.
*11 గంటల చర్చ ఎందుకు?* భారత్, చైనా సైనిక ఉన్నతాధికారుల నడుమ సరిహద్దు చర్చలు 11 గంటల పాటు సాగడం ఆసక్తికరంగా మారింది. దీనిపై సైనిక వర్గాలను ప్రశ్నించినప్పుడు.. భారత్, చైనా సైనిక సమావేశాలు ఎప్పుడూ సుదీర్ఘంగానే సాగుతాయని తెలిపాయి. దీనికి కారణాలను వివరిస్తూ.. ‘‘ప్రతి అంశంపైనా కనీసం నాలుగుసార్లు చర్చించాల్సి ఉంటుంది. ఇరు పక్షాల వద్ద ఇద్దరు అనువాదకులు ఉంటారు. వీరు సదరు ప్రశ్నలు, సమాధానాలను తర్జుమా చేస్తారు. దీనికి సమయం పడుతుంది. దీనికితోడు సుదీర్ఘమైన సైనిక లాంఛనాలనూ పాటించాల్సి ఉంటుంది. తరచూ ఉద్రిక్తతలు నెలకొనడం, సరిహద్దు సమస్య సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండటం వంటి కారణాల వల్ల చర్చించాల్సిన అంశాల జాబితా ఎక్కువగా ఉంటోంది. అందువల్లే సమావేశాలు సుదీర్ఘంగా జరుగుతుంటాయి.
ఈ భేటీలు చుషుల్, దౌలత్ బేగ్ ఓల్డీ (లద్దాఖ్), నాథు లా (సిక్కిం), బర్మ్ లా, కిబితు (అరుణాచల్ ప్రదేశ్)లో నిర్వహిస్తుంటారు’’ అని వివరించాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.