*చందమామకు చేరనున్న భారతీయ ప్రభ* *జాబిల్లి పైకి వెళ్లే నాసా వ్యోమగాముల బృందంలో రాజాచారి*
వాషింగ్టన్: ఓ భారతీయ అమెరికన్ జాబిల్లిపై అడుగుపెట్టే అరుదైన అవకాశం పొందారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు దక్కింది.
చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘అర్టెమిస్’ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. ఈ బృందంలో సగం మంది మహిళలే. వారిలో గతేడాది తొలిసారిగా స్పేస్‌వాక్ చేసిన మహిళా బృందంలోని క్రిస్టియానా కొచ్, జెస్సికా మెయిర్ కూడా ఉన్నారు.
ఈ మిషన్ ద్వారా తొలిసారిగా మహిళ చంద్రుడిపై కాలు మోపనుండటం విశేషం. ఈ బృందంలో వివిధ రంగాలకు చెందినవారు, విభిన్న వయస్కులు ఉన్నారు. అత్యధిక వయస్కుడికి 55 ఏళ్లు కాగా, పిన్న వయసు వ్యక్తికి 32 ఏళ్లు. అన్నీ సవ్యంగా జరిగితే వీరు 2024లో జాబిల్లిని చేరుకుంటారు. ఈ దశాబ్దం చివరికల్లా చంద్రుడిపైకి మరిన్ని మానవ సహిత యాత్రలు చేపట్టే దిశగా ఈ మిషన్‌ను చేపట్టినట్లు నాసా వెల్లడించింది. ‘‘మనల్ని భవిష్యత్తులో చంద్ర మండలంలోకి తీసుకెళ్లే హీరోలను అమెరికాకు అందిస్తున్నాం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్కొన్నారు.
*రాజాచారికి తెలుగుగడ్డతో అనుబంధం* భారతీయ అమెరికన్ అయిన రాజాచారి అమెరికా వైమానిక దళంలో కర్నల్ హోదాలో ఉన్నారు.
ఆయన తండ్రి శ్రీనివాస్ వి.చారి హైదరాబాద్ నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వలస వెళ్లారు. అక్కడ అమెరికాకు చెందిన పెగ్గీ ఎగ్బర్ట్‌ను వివాహం చేసుకున్నారు.
వారికి రాజాచారి 1977లో జన్మించారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లోనూ విద్యనభ్యసించారు. 2017లో నాసా అస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్‌కు ఎంపికయ్యారు. అక్కడ రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుత మిషన్‌కు ఎంపికయ్యారు.
హోల్లీ అనే మహిళను వివాహమాడిన చారికి ముగ్గురు సంతానం. తండ్రి స్ఫూర్తితోనే చిన్నప్పటి నుంచి చదువు విలువ తెలుసుకుని శ్రద్ధ పెట్టానని, దానివల్లే జీవితంలో ఎదిగానని రాజాచారి చెప్పారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.