బంగ్లాదేశ్‌కు తొలి ప్రాధాన్యం

Spread the love

*బంగ్లాదేశ్‌కు తొలి ప్రాధాన్యం*

*ద్వైపాక్షిక సదస్సులో ప్రధాని మోదీ* *భారత్‌ నిజమైన మిత్రదేశమన్న హసీనా* *ఉభయ దేశాల మధ్య 7 ఒప్పందాలు*

దిల్లీ: ‘ఇరుగుపొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’ విషయమై భారత్‌ అనుసరిస్తున్న విధానంలో బంగ్లాదేశ్‌ మూలస్తంభంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

భారత్‌ తమకు నిజమైన మిత్రదేశమని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. ఉభయ దేశాల నేతలు గురువారం ఆన్‌లైన్‌ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్‌-బంగ్లాదేశ్‌లు 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చిల్హాటీ-హల్దీబాడీ రైలు మార్గం పునరుద్ధరణకు నిర్ణయించాయి. హైడ్రోకార్బన్లు, వ్యవసాయం, జౌళి తదితర అంశాల్లో సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఉగ్రవాద ముప్పు, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లు, ఇండో-బంగ్లా సరిహద్దు నిర్వహణ, ప్రాంతీయ అనుసంధానం, వాణిజ్య విద్యుత్తు రంగాల అభివృద్ధి తదితర అంశాలపై మోదీ, హసీనా చర్చించారు.

బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు ముజీబుర్‌ రెహ్మాన్‌, భారత జాతిపిత మహాత్మా గాంధీల జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఎగ్జిబిషన్‌ను ఉభయ దేశాల ప్రధానులు ప్రారంభించారు.

*బంగ్లాతో సంబంధాలు బలోపేతం: మోదీ*

తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం బంగ్లాదేశ్‌తో భారత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు మోదీ తెలిపారు.

వ్యాక్సిన్‌ విషయంలోనూ సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలకు తనను ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. *ప్రజలకు అండగా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’: హసీనా*

మోదీ నాయకత్వంలో కరోనా సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటున్న తీరును హసీనా ప్రశంసించారు.

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ అమలు చేయడాన్ని అభినందించారు. భారత్‌ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ ప్యాకేజీ దోహదపడిందన్నారు. బాపూజీకి నివాళిగా తాము ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల చేసినట్లు చెప్పారు.

* ‘విజయ్‌ దివస్‌’ ఉత్సవాలు జరిపిన తర్వాతి రోజునే ఈ సదస్సు నిర్వహించడం ప్రత్యేకమని మోదీ ఈ సందర్భంగా అన్నారు.

* బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడంలో భారత్‌ పాత్రను వివరించిన హసీనా.. నాడు తన తల్లి, సోదరి సహా తన కుటుంబ సభ్యులను పాక్‌ సైన్యం నుంచి కాపాడిన భారత ఆర్మీ మేజర్‌ అశోక్‌ తారను ఆమె కీర్తించారు.

ఆరోజు (డిసెంబరు 17) తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. అలాగే రోహింగ్యాలను తిరిగి మయన్మార్‌ పంపించడానికి భారత సహకారాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు.

* సదస్సులో ప్రాంతీయ అనుసంధానతపై కీలకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా బీబీఐఎన్‌ (బంగ్లాదేశ్‌, భూటన్‌, ఇండియా, నేపాల్‌) మోటారు వాహనాల ఒప్పందాన్ని త్వరితగతిన అమలు చేయడానికి నేతలిద్దరూ అంగీకరించారు.

4 దేశాల మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజా, వస్తు రవాణాకు ఉద్దేశించిన ఒప్పందం ఇది. * 6 నదుల జలాల పంపిణీ మధ్యంతర ఒప్పందంపై త్వరితగతిన ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలూ ప్రస్తావించారు.

ద్వైపాక్షికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంయుక్త అధ్యయనాన్ని ఆలస్యం లేకుండా పూర్తి చేసేందుకు ఆదేశాలిచ్చారు. పెండింగులో ఉన్న అన్ని సరిహద్దు కంచె పనులను పూర్తి చేయడానికి అంగీకరించారు.

సరిహద్దుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను పూర్తిగా నివారించడానికి చర్యలు చేపట్టాల్సిందిగా సరిహద్దు భద్రత దళాలను ఆదేశించారు.

* చిల్హాటీ-హల్దీబాడీ రైలు మార్గాన్ని పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్‌ నుంచి సిక్కిం, అసోం, పశ్చిమబెంగాల్‌లకు అనుసంధానత పెరుగుతుంది. ప్రారంభంలో వస్తు రవాణాకు ఈ మార్గాన్ని వినియోగిస్తారు.

ఇరువైపులా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చిన తర్వాత ప్రయాణికుల రైళ్లను కూడా నడుపుతారు. అనంతరం చిల్హాటీ స్టేషన్‌లో గూడ్సు రైలును బంగ్లాదేశ్‌ రైల్వే మంత్రి ప్రారంభించారు.

1965 వరకు ఇది కోల్‌కతా-సిలిగురి ప్రధాన మార్గం (బ్రాడ్‌గేజి)లో భాగంగా ఉండేది. కాగా ఉభయ దేశాల మధ్య ప్రస్తుతం 4 రైలు మార్గాలున్నాయి.

* వచ్చే ఏడాది మార్చి 26న బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానానికి ప్రధాని మోదీ అంగీకారం తెలిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి స్మితా పంత్‌ తెలిపారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading