*కొత్త విధానం వల్ల గోప్యతకు భంగం రాదు*
*వినియోగదార్ల మెసేజ్‌లను చదవం* *ఇతర యాప్‌లతో సమాచారాన్ని పంచుకోం*
*బ్లాగ్‌పోస్ట్‌లో వాట్సప్ వివరణ*
ముంబయి: తాజా విధాన మార్పుల వల్ల వినియోగదార్ల సమాచారానికి ఎటువంటి ముప్పు ఉండదని వాట్సప్ స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగదార్ల ఫోన్లలోని కాంటాక్ట్ జాబితాలు లేదా గ్రూప్‌ల సమాచారాన్ని వ్యాపార ప్రకటనల నిమిత్తం ఫేస్‌బుక్ వంటి ఇతర యాప్‌లతో పంచుకోబోమని;
వాట్సప్ కానీ మాతృ సంస్థ ఫేస్‌బుక్ కానీ వాట్సప్‌లోని వినియోగదార్ల మెసేజ్‌లు చదవడం కానీ, కాల్స్ వినడం కానీ చేయవని వివరించింది.
*ఇదీ జరిగింది..*
గత వారం వాట్సప్ తన వినియోగదార్లకు సేవల షరతులు, గోప్యత విధానం విషయంలో ఒక అప్‌డేట్ తెచ్చింది. వినియోగదార్ల డేటాను ఎలా ప్రాసెస్ చేస్తారు; ఫేస్‌బుక్ భాగస్వామ్యంతో గ్రూప్‌నకు చెందిన ఉత్పత్తులను ఎలా ఆఫర్ చేస్తామన్నది వివరించింది.
వాట్సప్ సేవలను కొనసాగించాలంటే 2021 ఫిబ్రవరి 8 లోపు కొత్త నిబంధనలు, విధానాన్ని అంగీకరించాలని అందులో స్పష్టం చేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చలతో పాటు మీమ్స్ విపరీతంగా వచ్చాయి.
కనీసం 1700 ప్రైవేటు వాట్సప్ గ్రూప్ లింక్‌లు గూగుల్‌లో సెర్చ్ చేసినపుడు కనిపించాయని ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు ఒకరు చెప్పడం ఆందోళనను పెంచింది. వాట్సప్ తన వినియోగదార్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటోందని ఆందోళనలు రేకెత్తాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్, పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ సహా పలువురు వినియోగదార్లు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన టెలిగ్రామ్, సిగ్నల్‌లకు మారారు కూడా.
*వాట్సప్ వివరణ*
‘ఈ పాలసీ అప్‌డేట్ వల్ల మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునే సంక్షిప్త సందేశాల భద్రతకు ముప్పేమీ ఉండదు. తాజా అప్‌డేట్ వల్ల వాట్సప్‌లో వ్యాపారాన్ని ఎలా చేయాలన్నదానికి సంబంధించిన మార్పులు జరుగుతాయి.
అది కూడా వినియోగదారుల ఇష్టం ఉంటేనే (ఆప్షనల్). వినియోగదారు సమాచారాన్ని ఎలా వినియోగిస్తాం, ఎలా తీసుకుంటామన్నదానిపై ఇది మరింత పారదర్శకతను ఇస్తుంద’ని వాట్సప్ తన వినియోగదార్లకు రాసిన బ్లాగ్‌పోస్ట్‌లో రాసుకొచ్చింది. కేవలం వినియోగదార్ల అడ్రెస్ బుక్‌లోని ఫోన్ నెంబర్లనే వాట్సప్ యాక్సెస్ చేస్తుందని..
అది కూడా మెసేజ్‌లు వేగవంతంగా, విశ్వసనీయంగా చేయడానికి మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్ వంటి ఇతర యాప్‌లతో ఈ జాబితాను పంచుకోమని కూడా స్పష్టం చేసింది. చాటింగ్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుంది కాబట్టి ఆ సంభాషణలను మేం చదవలేమ’ని తెలిపింది.
*వ్యాపార ప్రకటనల సంగతేంటి?*
‘కొన్ని పెద్ద కంపెనీలకు ఫేస్‌బుక్ నుంచి భద్రమైన హోస్టింగ్ సేవలు వినియోగించుకోవడానికి ఆప్షన్ లభిస్తుంది. తద్వారా తమ వినియోగదార్లతో వాట్సప్ చాట్‌లు నిర్వహించుకోవచ్చు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు.
కొనుగోలు రశీదులను పంపుకోవచ్చు. సొంత మార్కెటింగ్ అవసరాలకు మాత్రమే ఆయా వ్యాపారులు వాటిని ఉపయోగించుకుంటారు.
అందులో ఫేస్‌బుక్‌పై వ్యాపార ప్రకటనలు ఇవ్వడం కూడా కలిసి ఉండొచ్చు. మొత్తం మీద ఫేస్‌బుక్ నుంచి హోస్టింగ్ సేవలు ఇవ్వాలని అనుకున్న వ్యాపారులకు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంద’ని వాట్సప్ స్పష్టం చేసింది. వినియోగదార్ల విషయానికొస్తే..
ఫేస్‌బుక్‌కు చెందిన ‘షాప్స్’తో ఇంటరాక్ట్ అయినపుడు ఆ షాపింగ్ కార్యకలాపాలను బట్టి వినియోగదార్లకు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాపార ప్రకటనలు వస్తాయని తెలిపింది.
*ఇలా చేయొచ్చు*
తమ డేటా అంత విలువైనదేమీ కాదనే భావనతో పాటు, అవగాహన లేనందున వాట్సప్‌కున్న 40 కోట్ల మంది వినియోగదార్లలో చాలా తక్కువ మందే ప్రత్యామ్నాయాలను ఆలోచించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సమాచార భద్రత, గోప్యతపై ఆందోళన చెందే వారు ఉచిత యాప్‌ల నుంచి దూరంగా జరిగి..
త్రీమా వంటి పెయిడ్ యాప్‌లు వినియోగించాలనే సూచన వస్తోంది. మరో వైపు ‘బలవంతపు అంగీకారాని’కి దారితీసే విధానాలను నియంత్రణ సంస్థలు అంగీకరించరాదని ఇంకో సంస్థ పేర్కొంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.