*ప్రతిపాదిత ఆరు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయొచ్చు*
*పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలోని కొండలతో చిక్కులు*
*ఈ ప్రాంతాల్లో ఒకే దిశలో రాకపోకలకు అవకాశం* *ప్రభుత్వానికి ఏఏఐ నివేదిక* ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సానుకూలత వ్యక్తం చేసింది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని దిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తరవాత తెలంగాణలో ఒక్క హైదరాబాద్‌లోనే విమానాశ్రయం ఉంది.
ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడిపేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, మామ్నూరు(వరంగల్), బసంత్‌నగర్(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్), కొత్తగూడెం(కొత్తగూడెం-భద్రాద్రి), గుడిబండ(మహబూబ్‌నగర్)లలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సిందిగా ఏఏఐను 2018లో కోరింది. 2019 జులై, ఆగస్టు నెలల్లో రెండు దశల్లో ఆరు ప్రాంతాల్లోనూ అధికారుల బృందం పర్యటించి అధ్యయనం చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటనలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరికి ప్రాంతీయ విమానాశ్రయాల ప్రతిపాదనలను వేగవంతం చేయాల్సిందిగా వినతి పత్రం ఇవ్వటంతో ఆ ప్రతిపాదనలకు కదలిక వచ్చింది.
అధికారుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. *ఏఏఐ గుర్తించిన అంశాలు* _ఆరు ప్రాంతాలకుగాను మూడు ప్రాంతాల్లో కొండలు ఉన్నాయని ఏఏఐ బృందం గుర్తించింది. పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రతిపాదించిన ప్రాంతాల్లో ఒక వైపు ఎత్తెన కొండలు ఉన్నాయని ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. అవి పెద్ద ప్రతిబంధకాలు కాకపోయినప్పటికీ రాకపోకల్లో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి విమానాశ్రయంలో వేరువేరు దిశలు(డైరెక్షన్స్) విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మూడు ప్రాంతాల్లో కొండలు ఉన్న దృష్ట్యా ఆ సమస్యను అధిగమించేందుకు ఒకే దిశలో రాకపోకలను అనుమతించే అంశాన్ని పరిశీలించవచ్చు అని సూచించింది. ఈ అంశంపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక బృందం అధ్యయనం చేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఏఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు._
*పెట్టుబడి రాబట్టుకోవటం సాధ్యమేనా?* ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవటంలో సాధ్యాసాధ్యాలపై ఏఏఐ అధికారులు అనుమానాలు వ్యక్తంచేసినట్లు తెలిసింది. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కాస్తంత ముందూ వెనుకగా పెట్టుబడి రాబట్టుకోవటం పెద్ద సమస్య కాదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది.
విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఆ పరిసర ప్రాంతాలు భారీగా అభివృద్ధి చెందుతాయని వాటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా ఏఏఐ అధికారుల బృందం మరో దఫా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.