ఒకే దేశం… ఒకే పర్మిట్‌

Spread the love

*ఒకే దేశం… ఒకే పర్మిట్‌*

*పర్యాటక వాహనాలకు ఇక జాతీయ అనుమతులు*

హైదరాబాద్‌: పర్యాటక వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నూతన పర్మిట్‌ విధానాన్ని ప్రకటించింది. అనుమతుల జారీ ఇక రాష్ట్రాల నుంచి కేంద్రం చేతిలోకి వెళ్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటక వాహన(టూరిస్టు వెహికల్‌)మైనా ఇక నుంచి ఆల్‌ ఇండియా టూరిస్టు పర్మిట్‌ కోసం https://parivahan.gov.in/parivahan వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల వ్యవధిలో పర్మిట్‌ జారీ చేస్తున్నది లేనిది స్పష్టం చేస్తామని కేంద్రం ఆదివారం ప్రకటించింది. కొత్త పద్ధతి ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది. కనీసం మూడు నెలలకు.. అత్యధికంగా మూడేళ్లకు అనుమతి జారీ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పర్యాటకులకు కొన్ని సమయాల్లోనే డిమాండ్‌ ఉంటుంది.

అలాంటి ప్రాంతాల టూరిస్టు ఆపరేటర్లు ఆ వ్యవధి మేరకే పర్మిట్‌ తీసుకోవటం ద్వారా ఆర్థిక భారం పడకుండా ఉంటుందన్నది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి వాహనం నడపాలని ఆపరేటర్‌ నిర్ణయించుకుంటారో ఆ రాష్ట్రంలో పన్నులు చెల్లించి అనుమతి తీసుకోవాలి. ఒకే దేశం…

ఒకే పర్మిట్‌ విధానంలో భాగంగా నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పర్మిట్‌ తీసుకున్న వాహనాలు ఏయే రాష్ట్రాల్లో పర్యటించాయో గుర్తించి ఆ దామాషాలో రాష్ట్రాలకు కేంద్రమే వసూలైన పన్ను ఆదాయాన్ని బదలాయిస్తుంది. వచ్చే నెల నుంచి నూతన విధానం అమలులోకి వచ్చినప్పటికీ ఇప్పటికే పర్మిట్లు తీసుకుంటే ఆ గడువు తీరేంత వరకు అవి చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం రానున్న రోజుల్లో మరింత ఊపందుకుంటుందన్న అంచనాలతో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading