ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. నాలుగు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి విడతలో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎస్‌ఈసీ ప్రకటించారు. సిబ్బంది అందుబాటు, ఇతర అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న పంచాయతీల్లో తొలి విడత వివరాలు రెవెన్యూ డివిజన్ల వారీగా ఇప్పుడు చూద్దాం..
నాలుగు విడతల్లో పంచాయతీ పోరు
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నాలుగు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
తొలి విడత ఎన్నికలకు ఇవాళ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 27న రెండో విడత, 31న మూడో విడత, ఫిబ్రవరి 4న నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 5 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 న రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17 న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
కోస్తా జిల్లాలో తొలి విడత ఎన్నికలు ఇక్కడే
తొలి విడతలో శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉన్న ఎచ్చెర్ల, జీ సిగడం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలకి, టెక్కలి పరిధిలోని జలుమూరు, పాలకొండ పరిధిలోని సారవకోట పంచాయతీలలకు ఎన్నికలు ఉంటాయి. విశాఖ జిల్లాలోని విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, పరవాడలో ఎన్నికలుంటాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం డివిజన్‌లో ఐనవిల్లి, అల్లవరం, అమలాపురం, ఆత్రేయపురం, ఎల్.పోలవరం, కాట్రేనికోన, కొత్తపేట, మల్కిపురం, మామిడికుదురు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు,సఖినేటిపల్లి, ఉప్పలగుప్తంలో ఎన్నికలు ఉంటాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డివిజన్లో భీమడోలు, చింతలపూడి, దెందులూరు, ద్వారకాతిరుమల, ఏలూరు, గణపవరం, కామవరపుకోటి, లింగపాలెం, నల్లజర్ల, నిడమర్రు, పెదపాడు, పేదవేగి, పెంటపాడు, టి.నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో ఎన్నికలు ఉంటాయి. కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో ఎ.కొండూరు, అగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయ్,గంపలగూడెం, గన్నవరం, ముసునూరు, నూజివీడు, పమిడిముక్కల, రెడ్డి గూడెం, తిరువూరు, ఉంగుటూరు, విసన్నపేట, ఉయ్యూరులో ఎన్నికలు ఉంచాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరు డివిజన్లో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, గుంటూరు, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, ముప్పాళ్ల, పేదకాకాని, పేదకూరపాడు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, రాజుపాలెం, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, వట్టిచెరుకూరులో ఎన్నికలు నిర్వహిసతారు. అలాగే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు డివిజన్లో బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, విడవలూరులో ఎన్నికలు ఉంటాయి.
రాయలసీమ జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు ఇక్కడే
అటు కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ఆలూరు, చిప్పగిరి, దేవనకొండ, హోలగుండ, అస్పరి, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, పెద్ద కడుబూరు, ఆదోని, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరులో ఎన్నికలు ఉంటాయి. అనంతపురం జిల్లాలోని పెనుకొండ డివిజన్లో అగలి, అమరపురం, చిలమత్తూరు, గోరంట్ల, గుడిబండ, హిందూపూర్, లేపాక్షి, మడకశిర, పరిగి, పెనుకొండ, రొద్దం, రోళ్ల, సోమందేపల్లి పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి. అలాగే కడప జిల్లాలోని జమ్మలమడుగు డివిజెన్లో పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లె, వేముల, లింగాల, జమ్మలమడుగు, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం పంచాయతీలకు ఎన్నికలుంటాయి. అటు కడప డివిజన్లోని చక్రాయపేట, ఎర్రగుంట్లలోనూ ఇదే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి డివిజన్లో బీఎన్ కండ్రిగ, చంద్రగిరి, కేవీబీ పురం, నాగలపురం, పాకాల, పిచ్చటూరు, పులిచెర్ల, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి, వరదాయపాళెం, ఏర్పేడులో తొలి విడత ఎన్నికలుంటాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాలను మాత్రం తొలి విడతలో మినహాయించారు.