Teluguwonders:
తెలుగు రాష్ట్రాల్లో….
వినాయక చవితి అంటే ఖైరతాబాద్ మహాగణపతి పేరు ఠక్కున గుర్తుకువస్తుంది. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ విగ్రహాం ఈ ఏడాది మరో అరుదైన ఘనతను సొంతంచేసుకుంది.
🕉‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’గా :
ఈ ఏడాది దేశంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహంగా గుర్తింపు దక్కించుకున్న ఖైరతాబాద్ మహాగణపతి ‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’ పేరుతో పూజలందుకోనున్నాడు. 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో రూపుదిద్దుకున్న గణపతికి కుడివైపున ఏకాదశదేవితోపాటు మహావిష్ణువు, ఎడమవైపున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు శక్తిమాత దుర్గను ప్రతిష్ఠించారు. విగ్రహ నిర్మాణం, అలంకరణ, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేశారు.
🕉పూజా కార్యక్రమాలు :
ఖైరతాబాద్‌లోని మహాగణపతి వద్ద సోమవారం వేకువజాము నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం 5 గంటలకు గణపతి హోమం నిర్వహించగా, 6 గంటలకు 75 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టు వస్త్రాలు తదితరాలు లక్డీకాపూల్ నుంచి ర్యాలీగా బయల్దేరి గణేశ్ మండపానికి చేరుకున్నాయి. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జంధ్యం, కుండువా తదితరాల అలంకరణ, పూజలు నిర్వహించారు. 9 గంటలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ 75 అడుగుల వెండి జంధ్యం సమర్పించారు. అనంతరం లంగర్ హౌజ్ భక్తులు స్వామికి సమర్పిస్తోన్న 750 కిలోల లడ్డూ గణపతి చెంత ఉంచి పూజలు చేశారు.
మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. వీరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. తొలి పూజల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఇక్కడకు వచ్చి పూజలు చేసారు.
💥నరసింహన్ చేసే చిట్టిచివరి పూజ :
తెలంగాణ గవర్నర్ హోదాలో నరసింహన్ చేసే చిట్టిచివరి పూజ ఇదే కావడం విశేషం. ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను కేంద్రం ఆదివారం నియమించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. నరసింహన్ నాలుగు సీఎంల వద్ద గవర్నర్‌గా పనిచేసిన అరుదైన ఘనత సాధించారు.
💥అలంకరణల కోసం 2 లక్షలు:
300 కిలోల బంతిపూలు, 100 కిలోల చామంతులు, 200 కిలోల తమలపాకులు, వంద అశోక చెట్లు, 30 అరటి చెట్లతో స్వామికి అలంకరణ చేశారు. మహాగణపతికి పూలమాల, ఇతర పుష్పాల అలంకరణల కోసం దాదాపు రూ. 2 లక్షలు వెచ్చించారు. బంతి, చేమంతి, ఆరటి చెట్లు, అశోక చెట్లు తదితరాలు ఈ అలంకరణలో వినియోగించారు.