పోరాడి ఓడిన బెంగళూరు

Spread the love

*హైదరాబాద్‌.. హమ్మయ్యా!*

*ఉత్కంఠ పోరులో జయకేతనం* *పోరాడి ఓడిన బెంగళూరు* *గట్టెక్కించిన విలియమ్సన్‌, హోల్డర్‌* *బౌలర్లు ఎప్పట్లాగే రాణించారు.

కానీ బ్యాటింగ్‌లో సాహా అందుబాటులో లేడు. వార్నర్‌ విఫలమయ్యాడు. మనీష్‌ పాండే కూడా మధ్యలో కాడి వదిలేశాడు. అయినా సరే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచింది. చిన్న లక్ష్యమే అయినా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేన్‌ విలియమ్సన్‌, జేసన్‌ హోల్డర్‌ల పోరాటంతో హైదరాబాద్‌ గట్టెక్కింది. ఐపీఎల్‌-13 లీగ్‌ దశ చివర్లో గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఎలిమినేటర్‌లోనూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. బౌలర్లు మరోసారి అదరగొట్టిన వేళ.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. చేసింది 131 పరుగులే అయినా.. బెంగళూరు చివరి వరకు పోరాడిన తీరు ప్రశంసనీయం.* _ఐపీఎల్‌-13 ప్లేఆఫ్‌ ఆశలు సన్నగిల్లిన సమయంలో వరుసగా మూడు ఘనవిజయాలతో ముందంజ వేసిన సన్‌రైజర్స్‌.. జైత్రయాత్రను కొనసాగించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి టోర్నీలో ఆ జట్టు కథను ముగించింది. 132 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్లిష్ట పరిస్థితుల్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (50 నాటౌట్‌; 44 బంతుల్లో 2×4, 2×6) గొప్ప ఇన్నింగ్స్‌ ఆడగా.. బౌలింగ్‌లో అదరగొట్టిన హోల్డర్‌   (24 నాటౌట్‌; 20 బంతుల్లో 3×4) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి సన్‌రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరంభంలో సన్‌రైజర్స్‌ను సిరాజ్‌ (2/28) గట్టి దెబ్బ తీశాడు. మొదట హోల్డర్‌ (3/25), నటరాజన్‌ (2/33)ల ధాటికి ఆర్‌సీబీ 7 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది._ *చిన్నదే అనుకుంటే..:* గత మ్యాచ్‌లో ముంబయి నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది సన్‌రైజర్స్‌. అలాంటిది 132 పరుగుల లక్ష్యం ఓ లెక్కా అనుకున్నారు అభిమానులు. కానీ జరిగింది వేరు. గాయంతో సాహా అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలోకి వచ్చిన గోస్వామి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరిపోయాడు. అతణ్ని ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే ఔట్‌ చేసిన సిరాజ్‌.. అయిదో ఓవర్లో సన్‌రైజర్స్‌ను గట్టి దెబ్బే కొట్టాడు. ఊపుమీదున్న వార్నర్‌ (17)ను ఔట్‌ చేశాడు. కొంచెం సందేహాస్పదంగా అనిపించిన ఆ క్యాచ్‌ను డివిలియర్స్‌ భలేగా అందుకున్నాడు. ఈ వికెట్‌ను సమీక్షలో సాధించిన ఆర్‌సీబీ.. ఆ ఉత్సాహంలో ఒక్కసారిగా ఒత్తిడి పెంచేసింది. ఆ జట్టును బెదరగొడదామని చూసిన పాండే (24).. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు తలొంచాడు. ఈ వికెట్‌ తీయడమే కాక.. 4 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చిన జంపా సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. మరో ఎండ్‌లో చాహల్‌ (1/24) సైతం ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించాడు. అతను గార్గ్‌ (7)ను ఔట్‌ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతుంటే.. మరోవైపు పరుగుల వేగం బాగా పడిపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. 7 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆశలన్నీ విలియమ్సన్‌ మీదే నిలిచాయి. అయితే లీగ్‌ దశలో అంతగా రాణించని కేన్‌.. నాకౌట్‌ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ ఆశలు నిలబెట్టాడు. ఒత్తిడిలో గొప్పగా షాట్లు ఆడిన అతను.. రన్‌రేట్‌ను అదుపులోకి తెచ్చాడు. మిడ్‌వికెట్‌లో కొట్టిన రెండు సిక్సర్లు.. కవర్స్‌, థర్డ్‌ మ్యాన్‌ దిశగా ప్రశాంతంగా అతను కొట్టిన ఫోర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. హోల్డర్‌ సైతం సమయోచితంగా షాట్లు ఆడాడు. చివరి ఓవర్లో (సైని) 9 పరుగులు చేయాల్సి రాగా.. 3, 4 బంతులకు హోల్డర్‌ ఫోర్లు కొట్టి పని పూర్తి చేశాడు. *బెంగళూరు విలవిల* : ఐపీఎల్‌లో జట్లన్నీ ఛేదనకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో మొదట వార్నర్‌ కూడా అదే పని చేశాడు. అతడి నిర్ణయం సరైందే అని రుజువు చేస్తూ సన్‌రైజర్స్‌ బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా హోల్డర్‌.. బెంగళూరు ఓపెనర్లను ఆరంభంలోనే పెవిలియన్‌కు చేర్చి గట్టి దెబ్బ తీశాడు. ఫించ్‌ను తన స్థానానికి పంపి ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (6) సాధించిందేమీ లేదు. హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో బంతిని ఫైన్‌ లెగ్‌ వైపు ఆడబోయి వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. తన తర్వాతి ఓవర్లో పడిక్కల్‌ (1)నూ హోల్డర్‌ ఔట్‌ చేశాడు. 15/2తో నిలిచిన బెంగళూరును ఫించ్‌ (32; 30 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి డివిలియర్స్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీళ్లిద్దరూ ఓ మోస్తరు వేగంతో పరుగులు చేస్తూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 10 ఓవర్లకు స్కోరు 54/2. పరుగుల వేగం పెంచే ప్రయత్నంలో ఫించ్‌ ఔటైపోగా.. అలీ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఓ ఎండ్‌లో ఏబీ ధాటిగా ఆడుతూ పరుగులు రాబడుతున్నా.. అతడికి సహకరించే వారే కరవయ్యారు. వికెట్ల పతనం కొనసాగడంతో ఏబీ సహజ శైలిలో స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయాడు. 17 ఓవర్లకు స్కోరు 111 పరుగులే. చివరి 3 ఓవర్లలో ఏబీ చెలరేగి స్కోరు 150కి చేరుస్తాడనుకుంటే.. అతణ్ని నటరాజన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆర్‌సీబీ అతి కష్టం మీద 130 దాటగలిగింది. *రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌* : కోహ్లి (సి) గోస్వామి (బి) హోల్డర్‌ 6; పడిక్కల్‌ (సి) గార్గ్‌ (బి) హోల్డర్‌ 1; ఫించ్‌ (సి) సమద్‌ (బి) నదీమ్‌ 32; డివిలియర్స్‌ (బి) నటరాజన్‌ 56; మొయిన్‌ అలీ రనౌట్‌ 0; దూబె (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 8; సుందర్‌ (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 5; సైని నాటౌట్‌ 9; సిరాజ్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131; *వికెట్ల పతనం:* 1-7, 2-15, 3-56, 4-62, 5-99, 6-111, 7-113; *బౌలింగ్‌* : సందీప్‌ శర్మ 4-0-21-0; హోల్డర్‌ 4-0-25-3; నటరాజన్‌ 4-0-33-2; నదీమ్‌ 4-0-30-1; రషీద్‌ ఖాన్‌ 4-0-22-0 *సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌* : వార్నర్‌ (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 17; శ్రీవత్స్‌ గోస్వామి (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 0; పాండే (సి) డివిలియర్స్‌ (బి) జంపా 24; విలియమ్సన్‌ నాటౌట్‌ 50; గార్గ్‌ (సి) జంపా (బి) చాహల్‌ 7; హోల్డర్‌ నాటౌట్‌ 24;  ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 132; *వికెట్ల పతనం:* 1-2, 2-43, 3-55, 4-67; *బౌలింగ్‌* : సిరాజ్‌ 4-0-28-2; సైని 3.4-0-31-0; సుందర్‌ 2-0-21-0; జంపా 4-0-12-1; చాహల్‌ 4-0-24-1; అలీ 1-0-4-0; దూబె 1-0-7-0 *ఒకేసారి నాలుగు మార్పులు* కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌కు కోహ్లి తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేశాడు. అందులో ముగ్గురు విదేశీయులు కావడం విశేషం. ఫిలిప్‌, ఉదాన, మోరిస్‌, షాబాజ్‌లను తప్పించి ఫించ్‌, మొయిన్‌ అలీ, జంపా, సైనిలను తుది జట్టులోకి తెచ్చాడు. *ఫ్రీహిట్‌కు రనౌట్‌* నోబాల్‌కు ఫ్రీహిట్‌ ఇస్తే.. బ్యాట్స్‌మన్‌ ఔటవడానికి ఉన్న ఏకైక అవకాశం రనౌట్‌ మాత్రమే. బెంగళూరు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ఆ మార్గాన్నే ఎంచుకుని ఔటయ్యాడు. 11వ ఓవర్లో నదీమ్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌ సింగిల్‌ తీయగా, అది నోబాల్‌ కావడంతో అలీకి ఫ్రీహిట్‌ ఆడే అవకాశం వచ్చింది. అతడికదే తొలి బంతి. అలీ షాట్‌ కోసం ప్రయత్నించగా.. బంతి నేరుగా ఎక్స్‌ట్రా కవర్లో ఉన్న రషీద్‌ ఖాన్‌ వద్దకు వెళ్లింది. అలీలీ సింగిల్‌ తీయబోగా.. అతను క్రీజుకు కొన్ని అడుగుల దూరంలో ఉండగానే రషీద్‌ డైరెక్ట్‌ త్రోతో అతడి కథ ముగించాడు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading