వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం

sindhu at olympic
Spread the love

*అద్వితీయం*

*వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సింధు సంచలనం*

*టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం*

*ఎల్లెడలా ప్రశంసలు*

చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని.. తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని.. ఆమె విజయం చాటింది. కలలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని.. అందరూ గర్వించే స్థాయికి చేరాలని.. ఆమె ప్రయాణం తెలిపింది. పట్టుదలతో కూడిన ప్రయత్నం.. సంకల్పంతో సాగే అంకితభావం.. అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం.. ఇలా సింధు జీవితం ఓ స్ఫూర్తి పాఠం. రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా సింధు నిలిచింది. నిలకడ, అంకితభావం, అద్భుత ప్రదర్శనకు ఆమె కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. భారత్‌కు ఖ్యాతి తెచ్చిన ఆమెకు హృదయపూర్వక అభినందనలు.

_- రాష్ట్రపతి కోవింద్‌_ పీవీ సింధు అద్భుత ప్రదర్శన మా అందరికీ అమితానందాన్ని కలిగించింది. టోక్యోలో కాంస్యం గెలిచిన ఆమెకు అభినందనలు.

ఆమె భారత్‌కు గర్వకారణం. మన గొప్ప ఒలింపియన్లలో ఆమె ఒకరు. _

– ప్రధాని మోదీ_

ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన స్టార్‌ షట్లర్‌ సింధుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలి. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకాలు సాధించడం గర్వంగా ఉంది. _

– ముఖ్యమంత్రి జగన్‌_

వందేళ్లకు పైగా ఒలింపిక్స్‌ చరిత్రలో మరే భారత మహిళకు సాధ్యం కాని రికార్డు మన సింధు సొంతమైంది. దేశంలో ఒలింపిక్స్‌ ప్రస్తావన వస్తే.. ముందుగా ఆమె పేరే తలుచుకునేలా ఈ భారతావని ముద్దు బిడ్డ మళ్లీ మెరిసింది. ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఆశగా ఎదురుచూసే ప్రజలకు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకాలు అందించి ఆ ఘనత అందుకున్న తొలి భారత మహిళగా ఘన కీర్తిని సాధించింది. అయిదేళ్ల క్రితం రియోలో రజతంతో సంచలనం సృష్టించిన ఈ షట్లర్‌.. ఇప్పుడు టోక్యోలో కాంస్యంతో చిరస్థాయిగా నిలిచిపోయింది. పతకమే కాంస్యం.. కానీ మన సింధు ఆట బంగారం. అందుకే ఈ తెలుగు తేజం సాధించిన కంచే.. మనకు పసిడితో సమానం. సెమీస్‌లో ఓటమితో సింధు కుంగిపోలేదు. తన తదుపరి లక్ష్యాన్ని మరిచిపోలేదు. పసిడి గెలవకపోయినా.. ఒలింపిక్స్‌లో కాంస్యమైనా తనకు, తన దేశానికి ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. అందుకే దెబ్బ తిన్న పులిలా కసిగా మైదానంలో అడుగు పెట్టింది. లోపాలు సవరించుకుంది. దూకుడు పెంచింది. కొత్త సింధును పరిచయం చేస్తూ.. కాంస్య పోరులో ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ చైనా ప్రత్యర్థిని చిత్తు చేసింది. ముందు రోజు ఎలా అయితే వరుస సెట్లలో ఓటమి పాలైందో.. అదే తరహాలో విజయం సాధించి కంచు పతకాన్ని ముద్దాడింది. మొన్నటి గాయాలకు మందు రాస్తూ 24 గంటల్లోనే మళ్లీ భారత అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది.

*అందుకే ఇప్పుడు దేశమంతా అంటోంది.. సాహో సింధు!!* రెండు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన భారత రెండో అథ్లెట్‌ సింధు. రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ (2008 బీజింగ్‌, 2012 లండన్‌) భారత్‌ తరఫున తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది హ్యాట్రిక్‌ పతకం. 2012 లండన్‌లో సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించగా..

2016 రియోలో సింధు రజతంతో మెరిసింది. తాజాగా టోక్యోలో కాంస్యంతో పతకానందంలో ముంచెత్తింది. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన మూడో క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. 2004, 2008లలో జాంగ్‌ నింగ్‌ (చైనా) స్వర్ణాలు గెలిచింది. సుసి సుశాంతి (ఇండోనేసియా) 1992లో స్వర్ణం, 1996లో కాంస్యం సాధించింది. *సింధు విజయం అమోఘం* ఈనాడు, అమరావతి; ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘‘టోక్యోలో అమోఘమైన ప్రదర్శనతో సింధు సాధించిన ఘనత పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’

_- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు_ ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన విజయం దేశానికే గర్వకారణం. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు’’ _-

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ _ * ‘టోక్యో ఒలింపిక్స్‌లో పి.వి.సింధు కాంస్య పతకం సాధించటం దేశానికే గర్వకారణం. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆమె కఠోర శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్షతోనే ఈ విజయం సాధ్యపడింది’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. సింధుకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. * ‘వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశ కీర్తిని చాటిన పీవీ సింధు తెలుగు బిడ్డ కావడం సంతోషించాల్సిన విషయం. భారతీయ బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు’ అని ఒక ప్రటకనలో రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. * ‘ఒలింపిక్స్‌లో దేశ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించిన పీవీ సింధుని చూసి భారత్‌ గర్విస్తోంది. ఆమె సాధించిన రికార్డుతో క్రీడాభిమానులు మురిసిపోతున్నారు. విజయం కోసం సింధు పోరాడిన తీరు, బ్యాడ్మింటన్‌లో ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ఒక ప్రకటనలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అభినందించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading