పట్టణాలకూ సైబర్‌ వల

Spread the love

*పట్టణాలకూ సైబర్‌ వల*

*మెట్రో నగరాల పరిధి దాటి విస్తరిస్తున్న మోసాలు*

*లాక్‌డౌన్‌లో పంథా మార్చిన అంతర్రాష్ట ముఠాలు*

* హన్మకొండలోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేసే రాజేశ్‌కు ఇటీవల ఓ అపరిచితుడు ఫోన్‌ చేశాడు. తనను తాను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకొని.. నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటికి టైల్స్‌ కొంటానని చెప్పాడు.

ఫోన్‌ నంబరుకు డబ్బు పంపడం సాధ్యం కావడం లేదని.. తాను పంపించే బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే డబ్బు బదిలీ అవుతుందని నమ్మబలికాడు.

సైబర్‌ నేరాల గురించి అవగాహన లేని రాజేశ్‌ అతను చెప్పినట్లే చేశాడు. ఇంకేముంది.. రాజేశ్‌ ఖాతా నుంచి రూ.25 వేలు గల్లంతైనట్లు బ్యాంకు నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది.

మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకప్పుడు సైబర్‌ నేరగాళ్లు హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడేవారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, ఝార్ఖండ్‌లోని జామ్‌తాడా తదితర ప్రాంతాలకు చెందిన సైబర్‌ నేరస్థుల ముఠాలు మెట్రో నగరాల వాసుల ఫోన్‌ నంబర్లు సేకరించి ఫోన్లు చేసేవారు. తమను తాము బ్యాంకు అధికారులుగా పరిచయం చేసుకొని ఓటీపీ మోసాలకు పాల్పడేవారు.

ఆర్మీ అధికారులుగా చెప్పుకొని ఓఎల్‌ఎక్స్‌ మోసాలతో బురిడీ కొట్టించేవారు. ఈ తరహా ముఠాలు కొంతకాలంగా పంథా మార్చాయి.

మెట్రో నగరాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకూ తమ మోసాలను విస్తరింపజేశాయి.

సైబర్‌ నేరాల గురించి పెద్దగా అవగాహన లేని గ్రామీణులపై వల విసురుతున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ తరహా మోసాలు పెరిగాయి. సైబర్‌ నేరస్థులు చరవాణుల డేటాను భద్రపరిచే ఏజెన్సీల నుంచి ఫోన్‌ నంబర్లు సేకరిస్తుంటారు. ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తూ గాలమేస్తుంటారు. పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తే రోజుకు ఒకరో ఇద్దరో వీరి వలకు చిక్కి మోసపోతున్నారు._ *ఇలా జరుగుతోంది..*

* వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో గత ఆరు నెలల కాలంలోనే 178 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 93, అంతకుముందు సంవత్సరం 66 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే గత రెండేళ్ల సంఖ్యను మించాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో 81 ఓటీపీ మోసాలకు సంబంధించినవే.

* ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలోనే సైబర్‌ నేరాలపై 30 ఫిర్యాదులు అందాయి. సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలోని ఠాణాల్లో 13 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 10, మెదక్‌ జిల్లాలో ఏడుగురు సైబర్‌ నేరస్థుల వలకు చిక్కారు.

* రామగుండం కమిషనరేట్‌ పరిధిలో కొందరి ఖాతాల్లో నుంచి ఓటీపీలు రాకుండానే డబ్బు మాయమైంది. విదేశాల్లో క్రెడిట్‌/డెబిట్‌కార్డు లావాదేవీల్ని నిర్వహిస్తే ఓటీపీ అవసరం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు డబ్బు కొల్లగొట్టి ఉంటారని సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

*teluguwonders*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *