ఈసారి మా అధ్యక్ష పీఠం కోసం నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయగా, వీరి మధ్య పోటీ కూడా చివరి వరకు రసవత్తరంగా సాగింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ ఎన్నికలు చూసిన వారు ఎవరైనా ఇవి మా ఎన్నికల సాధారణ ఎన్నికలా? అనేలా పరిస్థితులను క్రియేట్ చేశారు. లోకల్ నాన్ లోకల్ నినాదంతో ఓ వైపు హీట్ పుట్టించగా.. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్ మా ఎన్నికలు జరుగుతున్న తీరును ఎండగట్టారు.
గతంలో ఎన్నడూ మా ఎన్నికలు ఇలా జరగలేదని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, చాలా మంది సినీ ప్రముఖులు మా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు మాత్రం ఓటు వేసేందుకు నిరాసక్తి కనబరిచారు. వారిలో వెంకటేశ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రవితేజ, నాగచైతన్య, నితిన్, రకుల, సమంత, అనుష్క, హన్సికలు ఉన్నారు. ఇదిలాఉండగా మా ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. మరో రెండు గంటల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో ఫిలిం ఛాంబర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.