ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.
ప్రియమైన బ్రదర్ పవన్ కల్యాణ్:
మనిషి నాశనం అతనిపై ఉన్నప్పుడు, మొదట అతని వివేకం నశిస్తుంది.
మీ వివేకం చచ్చిపోయింది. ఇక నాశనం ఒక్కటే మిగిలి ఉంది.
జీవితంలో జ్ఞానం, పాండిత్యం, హృదయంలోని మంచితనం, దయ, కరుణ.. మీలో ఉన్నప్పుడు కలిగి ఉన్న ఈ లక్షణాలన్నింటినీ వదిలివేసి, ఇప్పుడు ఒక కుట్ర, మోసపు, అబద్ధపు, ద్వేషపూరిత బంగ్లర్ గా మారారు.
ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజాజీవితంలోకి ప్రవేశించామో, మీరే ఆ వ్యాధిగా మారారు.
నాకిష్టం లేనప్పటికీ మీరు అత్యున్నత నిర్ణయాలు తీసుకునే పార్టీ పొలిట్ బ్యూరోలో సభ్యునిగా.. ఇంకా మనం 2014లో ప్రారంభించినప్పుడు, పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఉండమని కోరారు. నేను స్నేహితుడిగా, సోదరుడిగా, 12 సంవత్సరాలు మీకు అండగా నిలిచాను. మరియు చాలా సంవత్సరాలు మనం పరస్పరం సంభాషించుకున్నాం. మీ ఆలోచనను క్రమబద్ధీకరించి, పార్టీ గురించి మీ కల సాకారం కావడానికి ఒక సమన్వయ క్రమాన్ని తీసుకొని వచ్చాను. మీపై ఈ కఠినమైన నేరారోపణను నేను రాయవలసి రావడం ఇప్పుడు చాలా బాధగా ఉంది.
నేను మన పార్టీ భావజాలాన్ని మరియు రాజ్యాంగాన్ని సృష్టించాను. బలీయమైన ఆలోచనల్ని నిర్మించాను, మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వాసం ఇచ్చాను, మంచి చెడుల్లో వెన్నంటే నిలబడ్డాను. ఇంకా మీకు ప్రశాంతమైన స్వీయ అవగాహనను అందించాను, అది మిమ్మల్ని శాంతింపజేసింది, మిమ్మల్ని ఉద్ధరించింది, మిమ్మల్ని బలపరిచింది. మనం పార్టీని ప్రారంభించినప్పుడు, మన సిద్ధాంతాలతో రాజకీయం చేయాలని అనుకున్నాం. ఇప్పుడు “మీ” రాజకీయాలు విషపూరితంగా మారాయి. హద్దులేని అబద్ధాల సమూహంతో మీ వ్యక్తిగత అహంకారాన్ని సంతృప్తిపరుచుకోవడం కోసంగా మారింది.
మీరు గర్వం, అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ఒక నార్సిసిస్టిక్ గా మారారు. మతపరమైన విద్వేషాలను సృష్టించడం ద్వారా, నైతికంగా నశించిన మీ భావాలతో కోపాన్ని, ద్వేషాన్ని రేకెత్తించడం, ఇదంతా కేవలం మీ అసూయకు తార్కాణం.
మిమ్మల్ని ఆప్యాయించి గౌరవించిన వారికి మీరు అసహ్యం మరియు ధిక్కారం మాత్రమే చూపించారు. తద్వారా మీరు అసహ్యకరమైన వ్యక్తిగా మారారు.
ఇలా ప్రతిపక్షాలు లేదా అనుబంధ పార్టీల కంటే మన సొంత పార్టీలో మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తుల సంఖ్యను ఎక్కువగా కలిగి ఉండడం అనే సందేహాస్పదమైన ఘనతను మీరు సాధించారు.
కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు
మీరు ప్రతిదాని నుంచి తప్పించుకోవచ్చు గానీ మీ స్వంత చర్యల యొక్క పరిణామాల నుంచి తప్పించుకోలేరు. మీరు ఉపయోగిస్తున్న కుట్ర సాధనాలు పరిపూర్ణంగా మీకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు మీమీదే ఉపయోగిస్తారు. మీరు చేసిన కర్మ మీ వద్దకే తిరిగి వస్తుంది.
ప్రజల ఆలోచనలను విషపూరితం చేయడం
పార్టీకి లేదా ప్రజలకు సంబంధం లేని వ్యక్తిగత కక్షను సాధించడానికి మీరు పార్టీ వేదికను మీ వ్యక్తిగత వేదికగా ఉపయోగించారు. రాష్ట్రానికి గానీ పార్టీకి గానీ ప్రజలకు గానీ సంబంధం లేని వ్యక్తిగత శత్రువులపై పగ సాధించాలని అసభ్యకరమైన విషపూరిత ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు.
నాయకులు సంఘర్షణ నుంచి వచ్చే ఉత్పత్తులు, దాని ప్రోత్సహించేవారు కాదు.
సంఘర్షణ నాయకుల్ని వెలుగులోకి తీసుకొస్తుంది. కానీ వివిధ వర్గాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, సమర్షించే వారు నాయకులు కారు. వారు సమాజాన్ని నాశనం చేసేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మీకున్న వ్యక్తిగత ద్వేషం కారణంగా మీరు ఏదో ఒక విధంగా ఆయన్ను గాయపరచాలనే ప్రయత్నంలో ఆ ప్రయోజనం కోసం ఆఁధ్రప్రదేశ్ లోని ప్రాంతాల మధ్య మతఘర్షణలు సృష్టిస్తున్నారు. ప్రజల మధ్య లేని మత విభేదాలను మీరు సృష్టిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వానికి అపూర్వమైన మెజారిటీ లభించింది
ప్రస్తుత ప్రభుత్వం మరియు వారి నాయకుడు 5 సంవత్సరాల పాటు ఏపీ ప్రజలను పరిపాలించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి అపూర్వమైన మెజారిటీని పొందారు. వంద లేదా 2వందల రోజులు కాదు.. 5 సంవత్సరాలు. మీరు స్వయంగా నిర్మించుకున్న ప్రతిపక్ష నాయకుడి పాత్ర ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తోంది. ఇంకా రౌడీ సంకేతాల్ని ప్రదర్శిస్తుంది. మీరు శాసనసభలోకి ప్రవేశించకూడదని ప్రజలు నిర్ణయించారు. కాబట్టి రాజకీయ ప్రక్రియపై మీ అధికారం స్వయంగా నియమించబడినది, ప్రజల నమ్మకం ద్వారా కాదు.
మనం ఏ ప్రజల ప్రాతినిధ్యం కోరుకుంటున్నామో మీకు వారిపైన గౌరవం లేదు.
నాయకుడిగా తిరస్కరించబడినప్పటికీ, మీరు ప్రజాస్వామ్య భావ వ్యక్తీకరణ హక్కు, నిరసన హక్కు మరియు ప్రభుత్వ కార్యాలయాన్ని కోరే హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. మీరు వాటిని శుభ్రపరిచే బదులు అసభ్య రాజకీయాలు చేస్తున్నారు.
మీరు సమాజానికి ప్రమాదం. మీ చేతుల్లో పాలించే సత్తా కానీ, అధికారం కానీ ఎప్పుడూ అనుమతించకూడదు. అధికారం కోసం మీ కోరిక వినాశనమైనది మరియు అహేతుకమైనది. మీరు మారకపోతే, ఆంధ్రా పాలిటీలో రాబోయే సంవత్సరాల్లో మీరు సృష్టించే నష్టం చాలా ఉంటుంది. ఈ హెచ్చరిక సంకేతాలను చూడబోతే ప్రజలు చాలా నష్టపోతారు.
మీ అహంకారం మిమ్మల్ని మాత్రమే కాకుండా, మీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్ని నాశనం చేస్తుంది.
రావణుడికి ఏం జరిగింది, చాలా శక్తులు ఉన్నప్పటికీ అతడు ఇంకా తన వద్ద లేనిదాన్ని కోరుకున్నాడు. అతడు మరొక పురుషుని భార్యను పొందలేడనే వాస్తవం, అప్పటికే ఉన్న వేలాది మంది మహిళల్ని విస్మరించి, రాముడి భార్యను వెంబడించాడు. ఎందుకంటే ఆమె అందనిది కాబట్టి. ఎవరైనా నన్ను ఎలా విస్మరించగలరు. నేను “గొప్ప రావణుడు” అనే భావనతో కళ్లు మూసుకుపోయిన వ్యామోహంతో తనను తానే కాక, తన కుటుంబాన్ని మరియు మొత్తం బంగారు లంకను నాశనం చేశాడు. ఫలించని దురాశ ఇంకా తమకన్నా గొప్పవారు లేరనే భావోద్వేగమైన మార్గాన్ని ఎంచుకునే వారందరికీ అదే విధి.
తప్పుదారి పట్టించే రాజకీయ ప్రసంగాలు
మీ ప్రవర్తన మనం సృష్టించిన ఆదర్శాలకు అవమానంగా మారింది. వ్యక్తిగత ఆశ, విధి మరియు బాధ్యత మధ్య వ్యత్యాసాన్ని మీరు ఎప్పుడు గ్రహిస్తారు. మత, కుల, ప్రాంతీయ వివక్ష లేకుండా రాజకీయాలు చేస్తామని మన పార్టీ ఆదర్శాలు చెబుతున్నాయి. మన ఆదర్శం “మతాల ప్రస్తావన లేని రాజకీయం” అని పేర్కొన్నాం. కానీ మీరు అన్ని సమయాల్లో అదే చేస్తున్నారు. మీరు కపట, డాంబికమైన, నాయకత్వం లేని నాయకుడిగా మరియు విషపూరిత సర్పంలా మారారు.
మీ ఆలోచనలు, మీరు చదివిన తాజా ఉల్లేఖనాలు, మీ జీవితం ఇతరుల ఆలోచనల్ని అనుకరిస్తోంది. మీ ఆలోచనలు దృఢమైన ఆధారం లేనివి కావడంతో ప్రస్తుత అనుకూలతలను బట్టి మారుతూ ఉంటాయి. తెలుగు పట్ల మీ తాజా ప్రేమ నకిలీ. హిందూ ధర్మపై మీ ప్రేమ నకిలీ. మీరు ధర్మాన్ని పదే పదే విచ్ఛిన్నం చేశారని మీకు తెలుసు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల మీ వ్యక్తిగత ద్వేషం వల్లనే మీరు హిందూమతం గురించి వాదిస్తున్నారు.
“తెలుగు భాషకు బదులుగా” అన్న ప్రస్తావనను “తెలుగు భాష తొలిగింపు”గా చిత్రీకరించడానికి మీరు మోసపూరితంగా ప్రయత్నించారు. మీ నార్సిసిజం ద్వారా మీ విజ్ఞత ఎలా బలహీనపడుతుందో అర్థమౌతోంది. 4వేల సంవత్సరాల గొప్ప భాష, సంస్కృతి మరియు ప్రపంచంలోనే అతి పురాతనమైన మతానికి ద్వేషపూరిత రాజకీయ నాయకుడి రక్షణ అవసరం లేదు.
నేను ఈ విధంగా రాయాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను. మీరు ఎంత లోతుకు పడిపోయారో నా లేఖ చెబుతుంది. అడుగులేని అగాథంలోకి కాకుండా మీలో మీరు చూసేందుకు ప్రయత్నించండి. మీ జీవితం కోసం మిమ్మల్ని, విమోచించుకోవడం చాలా విలువైంది. ఎందుకంటే మన జీవితాల్ని మనం ఇతరుల సేవలో ఉంచాలి కాబట్టి. మీకు స్వాభిమానం ఉంటే మీరు మీ రాజకీయ జీవితం ప్రారంభించే ముందు మీలో ఉన్న గుణాల్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోండి. కరుణతో వ్యవహరించండి. ప్రజల పట్ల ప్రేమ చూపండి. మీతో విభేదిస్తున్నారని మనుషుల్ని ద్వేషించకండి.
మీలో చాలా మంచితనం ఉండేది. కానీ ఇప్పుడా మంచిని ఎక్కడో దూరంగా వదిలేశారు. అధికార దాహంతో కాకుండా నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయండి. రాజకీయ అధికారం కోసం మీలో ఉన్న మంచిని చంపేయకండి. మిమ్మల్ని మీరు మరిచిపోయారు అనే భావనను మార్చండి.
మీలో ఇంతకుముందు ఉన్న జ్ఞానం, కరుణ, ప్రేమ మీకు తిరిగి ప్రసాదించమని పరమాత్ముడిని వేడుకోండి. క్షుణ్నంగా చూస్తే ఒకప్పుడు మీలో విస్తరించిన మంచితనం మళ్లీ మీకు కనిపిస్తుంది.
ఇట్లు
మీ
రాజు రవితేజ్…..