కలికాలం అంటే ఇదేనేమో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో మామ కళ్లల్లో కోడలు కారం కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఆ మంటను తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై అతని కుమారుడు కూడా ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కొడుకు, కోడలు కలిసి ఆ పెద్ద మనిషిని దారుణంగా హింసించారు.
👉వివరాల్లోకి వెళ్తే : తిరుపతి అనంతవీధిలో ఎన్. మురళీకృష్ణ(80) గత 25 సంవత్సరాల నుంచి నివాసముంటున్నాడు. మురళీకృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయభాస్కర్ తండ్రి వద్దే నివాసముంటుండగా, చిన్న కుమారుడు వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.
🔴ఆస్తి పంపకాల విషయంలో :
మంగళవారం ఉదయం మురళీకృష్ణకు, విజయభాస్కర్‌కు మధ్య ఆస్తి పంపకాల విషయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్తి ఇచ్చే ప్రసక్తే లేదని మురళీకృష్ణ వాదించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయభాస్కర్ భార్య నీరజ.. మామపై కోపం పెంచుకుంది. మామ కళ్లల్లో కారం కొట్టింది. ఆ మంటను తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకొచ్చి ఏడుస్తున్న తండ్రిపై విజయభాస్కర్ ఇనుపరాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కొడుకు, కోడలి దాడిలో తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణను స్థానికులు చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితుడు మురళీకృష్ణ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయభాస్కర్, నీరజపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.