*ఎల్‌జీ ఘటనలో 12 మంది అరెస్టు* *వారిలో పరిశ్రమ ఎండీ-సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు*
*దర్యాప్తులో తేలితే మరికొందరినీ అరెస్టు చేస్తాం*
*ముగ్గురు అధికారుల సస్పెన్షన్*
*నగర పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా* విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ ఆవిరి లీకై 15 మంది మరణించడానికి, పలువురు అస్వస్థులు కావడానికి కారకులయ్యారంటూ 12 మంది ఎల్‌జీ పరిశ్రమ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. మే 7వ తేదీన ఘటన జరగగా, సరిగ్గా రెండు నెలల తర్వాత జులై 7న అరెస్టు చేయడం విశేషం.
పోలీసు కమిషనర్ ఆర్‌కే మీనా మంగళవారం రాత్రి ఈ విషయం విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తుతో పాటు.. హైపవర్ కమిటీ నివేదికనూ పరిగణనలోకి తీసుకుని బాధ్యులను గుర్తించినట్లు తెలిపారు. నిందితులైన సంస్థ ఎండీ, సీఈవో సుంగ్ కీ జాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డి.ఎస్.కిమ్ కొరియన్లని తెలిపారు. వీరితోపాటు సంస్థ అదనపు డైరెక్టర్ పిచ్చుక పూర్ణచంద్రరావు, ఎస్.ఎం.హెచ్. విభాగాధిపతి కోడి శ్రీనివాస్ కిరణ్‌కుమార్, ప్రొడక్షన్ విభాగం టీమ్ లీడర్ రాజు సత్యనారాయణ ఇంజినీర్లు చెడుముపాటి చంద్రశేఖర్, కసిరెడ్ల గౌరీశంకర నాగేంద్రరావు, కె.చక్రపాణి, ఆపరేటర్ రాజేశ్, ఆపరేషన్స్ విభాగం రాత్రి విధుల అధికారి పొట్నూరు బాలాజీ, జి.పి.పి.ఎస్. ఇన్‌ఛార్జ్ సిలపరశెట్టి అచ్యుత్, రాత్రి విధుల భద్రతాధికారి కె.వి.ఎన్.రమేశ్ పట్నాయక్‌లను అరెస్టు చేశామని ప్రకటించారు.
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో సంభవించిన స్టైరీన్ లీకేజీ ఘటన వెనుక ఆ 12 మంది నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తమ నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని కూడా వారికి తెలుసన్నారు. మరికొన్ని విభాగాల నుంచి నివేదికలు రావాల్సి ఉందని, ఇంకొందరిని విచారించిన తరువాత ఇతర నిందితులను గుర్తిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను గుర్తించి రాష్ట్రప్రభుత్వం సస్పెండ్ చేసిందని సీపీ ఆర్.కె.మీనా ప్రకటించారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రస్తుత పర్యావరణ ఇంజినీరు పి.ప్రసాదరావు, పూర్వ పర్యావరణ ఇంజినీరు ఆర్.లక్ష్మీనారాయణ, కర్మాగారాల శాఖ డి.సి.ఐ.ఎఫ్. కె.బి.ఎస్.ప్రసాద్‌ల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించిందన్నారు. కార్యక్రమంలో డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేశ్ బాబు, దర్యాప్తు అధికారి ఏసీపీ ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి, సీఐ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. *బాధితుల ఆందోళన* గోపాలపట్నం, న్యూస్‌టుడే: ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాద బాధితుల కోసం వెంకటాపురంలో డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ను రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సమయంలో బాధితులు మంత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకుందని, తమ ఆరోగ్యాలకు ధీమా ఎక్కడుందని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ దీన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దని, ఘటన తర్వాత నుంచి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మీకు తెలియవా? అని ప్రశ్నించారు. వెంకటాపురానికి మంత్రి ముత్తంశెట్టి, జిల్లా యంత్రాంగం రాకతో పోలీస్ బందోబస్తును పెంచారు. నష్ట పరిహారం అందలేదన్న కొందరు మహిళలను అరెస్టు చేసి పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమం ముగిశాక విడిచిపెట్టారు. క్లినిక్ ప్రారంభం సందర్భంగా వెంకటాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో, శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే పి.గణబాబు పేరు వేయలేదని బాధితులు, తెదేపా కార్యకర్తలు ఆందోళన చేశారు. *ప్రమాదానికి కారణాలు ఇవీ..* *పరిశ్రమలోని ఎం6 ట్యాంకు ఆకృతి నాసిరకంగా ఉండడం *తగినంత శీతలీకరణ లేకపోవడం * సర్క్యులేషన్ వ్యవస్థ పనిచేయకపోవడం * ప్రామాణికాల్ని తగినవిధంగా కొలవకపోవడం *భద్రతపై అవగాహన లేకపోవడం * ముప్పును విశ్లేషించకపోవడం, స్పందించకపోవడం *సంస్థ నిర్వహణ పేలవంగా ఉండడం * స్టైరీన్ రసాయన ప్రభావాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోకపోవడం * అత్యవసర స్పందన పూర్తిగా వైఫల్యం చెందడం
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.