అష్టైశ్వర్య ప్రదాయిని “వరలక్ష్మీ వ్రతం”

Spread the love

varalakshmi-vratham: చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది.

కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం చాలా శ్రేష్ఠం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ), కీర్తి, శాంతి, తుష్టి (సంతోషం), పుష్టి (బలం) కలుగుతాయి.

వరలక్ష్మీ వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి. మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది, కలశాన్ని ఉంచి, మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికేళాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి.

ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ ధ్యాన ఆవాహన షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారిని అష్టోత్తర శత నామాలలో ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత ఉంది. వేదాల్లో వీటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి చెప్పబడింది

నవకాయ పిండి వంటలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేసిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తిచేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.

ఈ ఏడాది జులై 31న రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలి. ఆరోజు శుక్రవారం ఉదయం 6.59 నుంచి 9.17 వరకు సింహలగ్నం, ఈ రెండు గంటల 18 నిమిషాలలో పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేశారు. ఈ ముహూర్తం దాటితే మధ్యాహ్నం 1.53 నుంచి 4.11 మధ్య వృశ్చిక లగ్నం ముహూర్తం 2.18 గంటలు, తిరిగి రాత్రి 7.57 నుంచి 9.25 వరకు కుంభలగ్నం 1.28 నిమిషాలు, రాత్రి 12.25 నుంచి 2.21 వరకు వృషభలగ్నం ముహూర్తం 1.56 గంటలు వ్రతాన్ని చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

[pdf-embedder url=”https://teluguwonders.com/wp-content/uploads/2020/07/VARALAKSHMI-VRATAKALPAM.pdf” title=”VARALAKSHMI VRATAKALPAM”]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *