MithraMandali Review: మిత్రమండలి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

mithra-mandali-movie-review

జాతి రత్నాలు తర్వాత అలాంటి కామెడీ సినిమాలు తెలుగులో రావడం ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ముగ్గురు నలుగురు స్నేహితులు చుట్టూ కథలు రాసుకుంటున్నారు దర్శకులు. లాజిక్స్ తో పని లేకుండా కేవలం కామెడీ చేయాలని చూస్తున్నారు. అలా వచ్చిన సినిమా మిత్ర మండలి. బన్నీ వాసు నిర్మాత కావడంతో దీని మీద అంచనాలు పెరిగిపోయాయి. మరి మిత్రమండలి ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: మిత్రమండలి

నటీనటులు: ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం,సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్, వెన్నెల కిషోర్ తదితరులు

సినిమాటోగ్రఫర్: సిద్దార్థ్ జే.ఎస్

ఎడిటర్: పవన్ కళ్యాణ్

సంగీతం: ఆర్ఆర్ ధృవన్

నిర్మాతలు: కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్‌, డా. విజేందర్ రెడ్డి తీగల

దర్శకుడు: విజయేందర్

కథ:

జంగ్లీ పట్నంలో నారాయణ (వీటివి గణేష్) తుట్టె కులంలో ఒక పెద్ద మనిషి. కులం కోసం ప్రాణం ఇస్తాడు అవసరమైతే ప్రాణం తీస్తాడు. తన కులం ఓట్లు వాడుకొని ఎమ్మెల్యే కావాలి అనుకుంటాడు. అదే సమయంలో ఆయన కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కూతురు లేచిపోయింది అంటే కులపు ఓట్లు దూరమవుతాయని కిడ్నాప్ అయిందని నాటకం ఆడుతాడు నారాయణ. అదే సమయంలో అమ్మాయిని తీసుకెళ్ళింది చైతన్య (ప్రియదర్శి), అభి (రాగమయుర్), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా) అనే చిల్లర గ్యాంగ్ అని తెలుస్తుంది. అసలు వాళ్లకు స్వేచ్ఛకు ఉన్న సంబంధం ఏంటి.. తర్వాత ఏమైంది.. వీళ్ళ మధ్యలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ఎందుకు వచ్చింది అనేది మిగిలిన కథ..

కథనం:

కామెడీ సినిమాలు చూసేటప్పుడు లాజిక్స్ అస్సలు పట్టించుకోకూడదు. అందుకే మిత్ర మండలి మొదలయ్యే ముందు టైటిల్ కార్డ్స్‌లోనే కథలేని కథ అని వేస్తారు. ఇందులో కథని ఆశించొద్దు అని ముందుగానే చెప్పాడు దర్శకుడు విజయేందర్. జస్ట్ కామెడీ ఎంజాయ్ చేయమని చెప్పాడు. మిత్ర మండలి బ్యాచ్‌ చేసే చిల్లర్‌ పనులు చూసి నవ్వుకోవాలంతే అని చెప్పాడు. నవ్వించడమే చాలా కష్టం అనుకుంటే.. కథ లేకుండా నవ్వించడం అనేది ఇంకా కష్టం.. అలాంటి మ్యాజిక్ చాలా తక్కువ సినిమాలకే సాధ్యమవుతుంది. ఆ లిస్టులో చేరదామని చేరలేకపోయింది మిత్ర మండలి.. కంటెంట్ లేదు.. సోది చెప్తున్నామంటూ ముందుగానే హింట్ ఇచ్చారు మేకర్స్. ఆ సోది అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు.. కొన్నిసార్లు సోదిలో కలిసిపోతుంది. మిత్ర మండలి విషయంలోనూ ఇదే జరిగింది.. కథ ఎలాగూ లేదు.. కామెడీ అయినా వర్కవుట్ అయిందా అంటే అదీ లేదు. బలవంతంగా ఇరికించిన సీన్సే ఎక్కువగా ఉన్నాయి. సత్య మాత్రమే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ వచ్చి నవ్వించాడు.. మనోడు ఉన్న ప్రతీ సీన్ బాగానే పండింది. మిత్ర మండలి కాసేపు ఎంజాయ్ చేయొచ్చంటే అది సత్య పుణ్యమే. వెన్నెల కిషోర్‌తో సత్య కాంబో సీన్స్ బాగున్నాయి. మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు.. అదే రొట్ట కామెడీ అనిపించింది. ప్రియదర్శిని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు విజయేందర్. ఇందులో కథతో పాటు అక్కడక్కడా కులాలపై పంచులు కూడా వేసాడు దర్శకుడు. ముఖ్యంగా సొసైటిలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్స్‌పై సెటైర్లు వేసాడు. సామజవరగమనా సినిమాలోని వెన్నెల కిషోర్ పోషించిన కుల శేఖర్ పాత్రను గుర్తుకు తెస్తుంది ఇందులో గణేష్ చేసిన నారాయణ పాత్ర. ఫస్టాఫ్ చాలా వరకు బోరింగ్ సీన్స్ ఉన్నా.. సెకండాఫ్ అక్కడక్కడా బాగానే ఫన్ జనరేట్ అయింది.

నటీనటులు:

నిజం చెప్పాలంటే ప్రియదర్శి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో పెద్దగా వాడుకోలేదు. అక్కడక్కడ నవ్వించాడు తప్ప పూర్తిస్థాయిలో కాదు. రాగమయుర్ విష్ణు ప్రసాద్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. నిహారిక పర్లేదు. అనుదీప్ కె.వి ఉన్నది ఒక్క సీన్ అయినా కూడా నవ్వించాడు. వెన్నెల కిషోర్ కూడా బాగానే చేశాడు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ సత్య. ఆయన క్యారెక్టర్ కు లాజిక్ లేకపోయినా కూడా కామెడీ మాత్రం అదిరిపోయింది. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

కామెడీ సినిమాలకు సంగీతంతో పెద్దగా అవసరం ఉండదు. ఈ విషయంలో ఆర్ఆర్ ధ్రువన్ తనవంతు న్యాయం చేశాడు. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ ఫస్టాఫ్ వీక్.. సెకండ్ హాఫ్ ఓకే. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు విజయేందర్ కథ లేదు అని ముందే చెప్పాడు కానీ.. ఇందులో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒక్క సత్య క్యారెక్టర్ తప్ప మిగిలిన ఏది అంతగా నవ్వించలేదు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా చెప్పాలంటే మిత్రమండలి.. చాలా కష్టపడి నవ్వాలి..!


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights