మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే

IMG-20210510-WA0001.jpg

*మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే* *ఉద్యోగుల కోసం అన్ని వసతులతో క్వారంటైన్‌ కేంద్రాలు*

*ఆసుపత్రులతో ముందస్తు ఒప్పందాలు* *కొవిడ్‌ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్న ఐటీ కంపెనీలు*

హైదరాబాద్‌: తమ ఉద్యోగులు, వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా ప్రముఖ ఐటీ పరిశ్రమలు కాపాడుకుంటున్నాయి. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్లవేళలా వైద్యులు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నాయి. అవసరమైతే వైద్య చికిత్సలు అందించేందుకు ప్రముఖ ఆసుపత్రులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమర్థ మానవ వనరులను సంరక్షించుకుంటూ.. తమ ప్రాజెక్టులు ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాయి.

*ప్రాజెక్టులు ఆగిపోకుండా…*

ఐటీ పరిశ్రమలకు అమెరికా, యూరప్‌ దేశాల నుంచే ప్రాజెక్టులు అధికంగా వస్తాయి. అవి ఒప్పందం మేరకు సకాలంలో పూర్తికావాలంటే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఒక టీమ్‌లో పనిచేస్తున్న వారు కరోనా బారిన పడితే ప్రాజెక్టు పూర్తిచేయటంలో జాప్యం అనివార్యమవుతుంది. మిగిలినవారిపై పనిభారం పెరుగుతుంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకుంటే కంపెనీలకు భవిష్యత్తులో కొత్తవి రావడంలో ఇబ్బంది తప్పదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు అనేక సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణె, చెన్నై, ముంబయి, దిల్లీ చుట్టుపక్కల కార్యాలయాలు, హోటళ్లలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాయి.

*కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..*

* టీసీఎస్‌ కంపెనీ దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా మొత్తం 13 నగరాల్లో కొవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. కార్యాలయాలు, హోటళ్లను అందుకు వినియోగించుకుంటోంది.

* యాక్సెంచర్‌ సంస్థ బెంగళూరులోని మూడు కార్యాలయాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ప్రారంభించింది. త్వరలో హైదరాబాద్‌లోనూ ఏర్పాటుచేసే ప్రణాళిక ఉందని ఆ సంస్థ మేనేజరు ఒకరు తెలిపారు.

ప్రత్యేక శ్రద్ధతో తమ ఉద్యోగులకు చికిత్స అందించేలా ఇప్పటికే ఓ ప్రముఖ ఆసుపత్రితో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చినా వారికి సహకరించేందుకు 5 రోజులు సెలవిచ్చే సదుపాయాన్ని అమలుచేస్తోంది.

* ఇన్ఫోసిస్‌ సంస్థ బెంగళూరు, పుణె నగరాల్లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను నెలకొల్పింది. పేరొందిన ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకొంది.

విప్రో, హెచ్‌సీఎల్‌ తదితర సంస్థలు తమ ఉద్యోగులకు సహాయార్ధం తగిన ఏర్పాట్లు చేశాయి.‘ హైదరాబాద్‌లో మాది మధ్య తరహా ఐటీ కంపెనీ. మాకు తరచూ ఆన్‌లైన్‌లో వైద్యులు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు, వెల్‌నెస్‌ ట్రైనర్లతో అవగాహన కల్పిస్తున్నారు.

పాజిటివ్‌గా నిర్ధారణ అయితే 21 రోజులకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఔషధాలు, ఇతర ఖర్చుల కోసం హోం క్వారంటైన్‌లో ఉంటే రూ.15 వేలు అదనంగా చెల్లిస్తున్నారు’ అని సీనియర్‌ ఉద్యోగి ఒకరు చెప్పారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights