Mohanlal: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న మోహన్ లాల్.. వరల్డ్ మలయాళీ కౌన్సిల్ శుభాకాంక్షలు..

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరు. అద్భుతమైన నటనతోపాటు విభిన్న కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినీప్రియులను మెప్పిస్తున్నారు. తాజాగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మలయాళ నటుడు, దర్శకుడు, నిర్మాత మోహన్‌లాల్‌కు వరల్డ్ మలయాళీ కౌన్సిల్, ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ అభినందనలు తెలియజేశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం (సెప్టెంబర్ 23న) 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులతోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ క్రమంలోనే మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. దాదాపు 40 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో ఆయన చేస్తున్న కృష్ణికి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరంచింది. జవాన్ చిత్రానికి గానూ షారుఖ్ ఖాన్, ట్వల్త్ ఫెయిల్ సినిమాకు గానూ విక్రాంత్ మాస్సే ఉత్తమ నటులుగా అవార్డ్స్ అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు గానూ ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ జాతీయ అవార్డ్ అందుకున్నారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత గౌరవమైన ఈ అవార్డు, భారతీయ సినిమా వృద్ధి, అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను గుర్తిస్తుంది.
వరల్డ్ మలయాళీ కౌన్సిల్ గ్లోబల్ వైస్ చైర్మన్, గుజరాత్‌లోని ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ నాయర్, మోహన్‌లాల్ సాధించిన విజయానికి ప్రశంసలను వ్యక్తం చేశారు. ఆయన అంకితభావం, కృషి మలయాళీలు, కేరళీయులు గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. “నాలుగు దశాబ్దాలుగా 400 కి పైగా చిత్రాలతో తనదైన ముద్ర వేశారు మోహన్‌లాల్. ఆయన అద్భుతమైన సినిమా ప్రయాణం ఇది, ఆయన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, నిరంతర శ్రేష్ఠత సాధనకు ఇది నిదర్శనం” అని నాయర్ అన్నారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
1969లో స్థాపించబడిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారతీయ సినిమాకు చేసిన అత్యుత్తమ కృషిని గుర్తించే ప్రతిష్టాత్మక గౌరవం. ఈ అవార్డులో స్వర్ణ కమలం (స్వర్ణ కమలం) పతకం, శాలువా, ₹10 లక్షల నగదు బహుమతి ఉంటాయి. 2025 సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్ ఈ గౌరవనీయమైన అవార్డును అందుకున్నారు. అక్కడ ఆయన ఈ గౌరవాన్ని మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమకు అంకితం చేశారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
