Montha Cyclone: తెలంగాణను ముంచెత్తిన మొంథా.. వరంగల్ జలదిగ్భంధం.. ఇవాళ ఈ జిల్లాల్లో..

మొంథా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినా.. తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని కలిగించింది. ఊహించని విధంగా తెలంగాణపై మొంథా తన ప్రతాపం చూపించింది. వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ జలదిగ్భంధం అయ్యింది. పలు కార్లు వరద నీటిలో మునిగిపోయాయి. ముంచెత్తిన వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ బీభత్సం కొనసాగుతుంది. ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ముఖ్యంగా ఇది తెలంగాణకు ఊహించని నష్టం మిగిల్చింది. ఏపీ అనుకుంటే.. తెలంగాణపై తన ప్రతాపాన్ని చూపించింది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కుండపోత వానలతో అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ మొత్తం జలదిగ్భంధం అయ్యింది. వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెం.మీ. వర్షపాతం కురిసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇవాళ ఈ జిల్లాల్లో
గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో
ఏపీలోనూ మొంథా ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల చెరువులు, కాలువలు,వాగులు రోడ్లు మీదగా పొంగుతున్నాయని వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు మరో రెండు రోజుల వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఆర్థిక సాయం
మొంథా తుఫాన్ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. తుఫాన్ కారణంగా రిలీఫ్ క్యాంపుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి రూ.3,000 ప్రత్యేక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి రూ.1,000 చొప్పున, గరిష్టంగా ఒక్క కుటుంబానికి రూ.3,000/- వరకూ చెల్లింపు చేయడానికి జిల్లాల కలెక్టర్లకు అనుమతి ఇచ్చింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
