అతనొక యోగి… అతనొక యోధుడు!

Spread the love

మెగాస్టార్‌ చిరంజీవి… ఎనభైవ దశకం నుంచి తెలుగు సినిమా పరిశ్రమని ఏలుతోన్న మకుటం లేని మహరాజు. తరాలు మారినా, కొత్త తారలు ఎందరు పుట్టుకొచ్చినా ఇంకా చిరంజీవి అనే ‘ఫినామినన్‌’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని శాసిస్తూనే వున్నాడు. ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయిన తరువాత కూడా, తెలుగు సినిమా బాక్సాఫీస్‌ సరిహద్దు రేఖలు నలుదిశలా విస్తరించిన తరువాత కూడా, ‘నాన్‌-బాహుబలి’ అంటూ బాహుబలియేతర రికార్డులొస్తే చాలని సూపర్‌స్టార్స్‌ సయితం సర్దుకుపోతున్న వేళ… మూడు పదుల వయసులో ఎలాగయితే ఛాలెంజ్‌లని స్వీకరించి గెలిచి చూపించేవారో, ఆరు పదులు దాటిన ఈ వయసులోను అదే ఉత్సాహంతో, అదే కదన కుతూహలంతో బాహుబలి మైదానంలోనికే దిగి తన సత్తా చూపిద్దామనుకుంటున్నారు.

తన వయసు హీరోలు వెటరన్స్‌గా మారి, రెక్కలొచ్చిన తెలుగు సినిమా యువతరం ప్రతినిధులకి పోటీగా లేకుండా మునుపటి లెక్కలతో సరిపెట్టుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పటి బాక్సాఫీస్‌ లెక్కలు తేలుద్దామని ‘సైరా నరసింహారెడ్డి’గా బాహుబలి యుగంలో, తెలుగు సినిమాకి ఏర్పడిన హయ్యర్‌ గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. రాజకీయాలంటూ సినిమా పరిశ్రమకి దాదాపు పదేళ్లు దూరమయిన చిరంజీవి… తిరిగి వస్తూనే తానెందుకు సినీ పరిశ్రమకి రారాజు అనేది చూపించారు.

బాహుబలికి తప్ప సాధ్యం కాని వంద కోట్ల డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ మార్కుని దాటిన తొలి చిత్రం చిరంజీవి మాత్రమే అందించారు. అది కూడా ఒక సగటు ఫార్ములా మాస్‌ చిత్రంతో వంద కోట్ల మార్కుని చేధించి సినీ రంగం వరకు చిరంజీవే ‘చక్రవర్తి’ అని ఇంకోసారి చూపించారు. రాజకీయ రంగంలో ఎదురయిన చేదు అనుభవాల నేపథ్యంలో, అభిమానులు సయితం మునుపటి వైభవం కష్టమే కానీ ‘పరువు’ నిలబెట్టే సినిమా వస్తే చాలని సరిపెట్టుకున్న సమయంలో ‘ఖైదీ నంబర్‌ 150’గా తెలుగు సినీ ప్రియులు చిరంజీవి అనే అద్భుతానికి శాశ్వత ఖైదీలనే సంగతి నిరూపించారు.

‘మళ్లీ సినిమాల్లోకి వస్తే చూడాలిగా…’ అన్న నాలుకలు కరుచుకునేలా, ‘చిరంజీవి పని అయిపోయినట్టే’ అని నవ్విన నోళ్లు మూతబడేలా ఎక్కడ వదిలి వెళ్లారో అక్కడ్నుంచే మొదలుపెట్టారు. ఏ స్థానం నుంచి కదిలి వెళ్లారో తిరిగి ఆ స్థానంతోనే ప్రస్థానం కొనసాగించారు. మూడున్నర దశాబ్ధాలుగా చిరంజీవి తర్వాత చిరంజీవి అంతటి సూపర్‌స్టార్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రాలేదంటే అందుకు తనని తానే సవాల్‌ చేసుకుంటూ, కాలానికి అనుగుణంగా తన స్థాయిని పెంచుకుంటూ, తరాలకి తగ్గట్టుగా తన నటనకి మెరుగులు దిద్దుకునే నిత్య విద్యార్థి లక్షణమే కారణం.

అరవైకి పైబడ్డ ఈ వయసులో ఇక సవాళ్లు వద్దంటూ ఒంటిని కష్టపెట్టని పాత్రలు చేసుకున్నా అభిమానులు కూడా ఆక్షేపించరు. కానీ తన ముందొక రికార్డు కనిపిస్తుంటే అది తన వల్ల కాదంటూ సరిపెట్టుకునే లక్షణం ఆయనది కాదు. రాజకీయాల కోసం పదేళ్ల వనవాసం తర్వాత బహుశా తనకి మునుపటి స్వాగతం లభిస్తుందో లేదో అనే చిరు సందేహం ఆయన మదిలో మెదిలి వుండొచ్చు. ‘ఖైదీ నంబర్‌ 150’తో ఆ అనుమానం పటాపంచలు అయిన పిమ్మట ఆయన ఇక బాహుబలియేతర సినిమాలతో పోటీకి దిగడానికి ఇష్టపడలేదు. వారికి బాహుబలి తీయడం సాధ్యమయినపుడు, ఆ స్థాయిలో మన ప్రయత్నం ఎందుకు ఉండకూడదంటూ, ‘ఇక యుద్ధమే’నంటూ కదనరంగంలోకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలా దిగారు.

‘అతను సామాన్యుడు కాడు… అతనొక యోగి… అతనొక యోధుడు… అతడిని ఎవరూ ఆపలేరు’… ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ గురించి రాసిన పంక్తులివి. చిరంజీవి గురించిన ఏ/వీలో ఈ మాటల్ని చెప్పినా అతిశయాలనిపించవు సరికదా అవును నిజమే అనిపిస్తాయి. నిలకడగా కొన్నేళ్ల పాటు విజయాలు అందుకుంటూ తమ స్థానం నిలబెట్టుకోవడమే కష్టమైన పరిశ్రమ ఇది. ఎప్పుడో దశాబ్ధాల అవతలికి వెళ్లి చెక్‌ చేసుకోవాల్సిన అవసరం లేని ఫ్యాక్ట్‌ ఇది. ఇటీవలి కాలంలో మన సూపర్‌స్టార్స్‌ గ్రాఫ్‌ చూస్తేనే ఈ సంగతి బోధ పడుతుంది.

చిరంజీవి కెరీర్‌లోను ఊర్ధ్వ పతనాలు లేవని కాదు కానీ… పడిన ప్రతిసారీ ఆయన గ్రాఫ్‌ చివాల్న పైకి లేచింది. లేచిన ప్రతిసారీ బాక్సాఫీస్‌కో బార్‌ సెట్‌ చేసింది. ప్రేక్షకులకి ఏమి కావాలని తెలుసుకోవడంలో, అది ఎప్పటికప్పుడు అందివ్వడంలోనే చిరంజీవి విజయ రహస్యం దాగి వుంది. ‘ఇది మనది కాదు’, ‘ఇంత మన వల్ల కాదు’ అనుకోకపోవడంలోనే, సవాల్‌ ఎదురైన ప్రతిసారీ ‘మనమూ ప్రయత్నించి చూద్దాం’ అనే లక్షణమే ఆయనని చిరంజీవిని చేసింది.

దర్శకుల చాటు హీరోలుంటారు. దర్శకులు చేసిన హీరోలుంటారు. దర్శకుల తాలూకు విజయాలుంటాయి. దర్శకుల మార్కు ఫలితాలుంటాయి. కానీ చిరంజీవి విజయాలని తరచి చూస్తే దేని ముందయినా ముందు ఆయనుంటారు. ఆయన సినిమాల వరకు ఆయన తర్వాతే ఎవరైనా గుర్తుకొస్తారు. ఎన్ని వందల కోట్లతో తీసిన ‘సైరా’ అయినా ఇప్పటికీ చిరంజీవిది అదే తంతు. ఆయన తర్వాతిదే దర్శకుడి వంతు. సైరాపై రామ్‌ చరణ్‌ అన్ని కోట్లు వెచ్చించాడన్నా, రాజమౌళి లాంటి బ్రాండ్‌ లేకుండానే ఈ చిత్రంపై బయ్యర్లు ఇన్ని కోట్లు నిర్భయంగా కుమ్మరించినా అది చిరంజీవిపై నమ్మకం.

తెలుగు రాష్ట్రాలలో బాహుబలి చిత్రాలతో సమానమైన బిజినెస్‌ జరిగినా చీకుచింతా లేకుండా వున్నారంటే అందుకు చిరంజీవే కారణం. గవాస్కర్‌ తర్వాత టెండూల్కర్‌… ఆ తర్వాత ధోనీ, ఇప్పుడు కోహ్లీ… ఇలా ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొచేస్తుంటారు క్రీడలలో అయినా, స్క్రీన్‌ మీద అయినా. కానీ తెలుగు సినిమా వరకు మెగాస్టార్‌ తర్వాత మరో మెగాస్టార్‌ రాలేదింకా. సూపర్‌స్టార్లు ఎందరు పుట్టుకొచ్చినా తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు మూడు దశాబ్ధాలుగా ఆయనొక్కడే మెగాస్టార్‌. సైరా.. మెగాస్టార్‌ చిరంజీవి, సైసైరా!

Source : https://telugu.greatandhra.com/movies/movie-news/athanoka-yogi-athanoka-yodhudu-102239.html

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading