ఆనాటి రజనీని స్ఫురణకి తేవడంలో, రజనీకాంత్ అభిమానులు ఆనందంగా కేరింతలు కొట్టే కొన్ని సన్నివేశాలు తీయడంలో మురుగదాస్ సక్సెస్ అయ్యాడు కానీ ఒక ఆసక్తికరమైన సినిమాగా మాత్రం ‘దర్బార్’ని మలచలేకపోయాడు. ‘తుపాకీ’, ‘సర్కార్’ చిత్రాల్లో తనదైన ముద్ర చూపించి కమర్షియల్ ఫార్ములాకి కూడా కొత్తదనం ఇచ్చిన మురుగదాస్ ‘దర్బార్’కి వచ్చేసరికి రజనీ భజన చాలన్నట్టుగా తన ఆలోచనకి అస్సలు పని పెట్టలేదు. చాలా సన్నివేశాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలని ఏదో హడావిడిగా పేపర్‌పై పెట్టి, సెట్స్ మీదకి వెళ్లినట్టుగా అనిపించాయంటే దర్శకుడిగా మురుగదాస్ ఎంత టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా ఈ చిత్రం తీసాడో అర్థం చేసుకోవచ్చు.
హీరో తాలూకు మేనరిజమ్స్, స్టయిల్స్ అభిమానులకి ఎప్పుడూ కిక్ ఇస్తాయి. అయితే అది ఏ కథకయినా అలంకారం అవ్వాలి కానీ అదే సినిమా అవ్వకూడదు. రజనీకాంత్‌లాంటి హీరోకి ఎలాంటి విలన్ వుండాలి? బాషా అయినా, నరసింహా అయినా ప్రతినాయక పాత్రలెలా వుంటాయి? దాదాపు డెబ్బయ్‌కి దగ్గర పడిన రజనీకాంత్‌ని సెలబ్రేట్ చేయడానికి ఆయన తాలూకు ఆనాటి స్మృతులని గుర్తు చేసే సినిమాలు తెరకెక్కించాలని చూస్తున్నారే కానీ అప్పటి సినిమాలు ఎందుకలా గుర్తుండిపోయాయనేది మాత్రం గుర్తించలేకపోతున్నారు. పేట అయినా, ఇప్పుడు దర్బార్ అయినా కానీ రజనీకాంత్‌ని స్టయిల్‌గా చూపించాయే తప్ప అప్పటి రజనీ క్లాసిక్స్‌ని మరిపించడం కాదు కదా, కనీసం తలపించలేదు.
పెళ్లీడుకి వచ్చిన కూతురు వున్న వాడంటూ ఆయన వయసుకి తగ్గ పాత్ర తీర్చిదిద్దడం బాగుంది. కానీ మళ్లీ ఆయన వయసులో సగం కూడా లేని హీరోయిన్‌తో ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడడం ఏమి పద్ధతి? హీరోయిన్ అవసరం అనుకుంటే ఆ ట్రాక్‌ని ఇంకా హుందాగా తీసి వుండవచ్చు. స్టాలిన్‌లో చిరంజీవికి లవ్ ట్రాక్ రాసినపుడు కూడా మురుగదాస్ ఇలాగే హుందాతనం మిస్ అయ్యాడు. ఆ సన్నివేశాల్లో రజనీ అభిమానులు కూడా ఇబ్బంది పడాలే తప్ప వాటి వల్ల పండిన వినోదం కూడా లేదు. దానికంటే తండ్రీకూతుళ్ల బంధాన్ని మరింత బలంగా చూపించే సన్నివేశాలకి కేటాయించినట్టయితే ద్వితియార్ధంలో ఒక కీలకమైన ఘట్టం ఇంకా ఎఫెక్టివ్‌గా అనిపించేది.
ప్రథమార్ధం రజనీకాంత్ పాత్ర చిత్రణ, ఆయన స్టయిల్స్‌తో పాటు కొన్ని ఆసక్తికరమైన సీక్వెన్స్‌లతో పాస్ అయిపోతుంది కానీ ద్వితియార్ధంలో విలన్ రంగంలోకి దిగిన తర్వాత కూడా ఎలాంటి ఎక్సయిట్‌మెంట్ వుండదు. పైగా రజనీ పాత్ర కూడా ఎమోషనల్ మోడ్‌లోకి మారిపోవడం, విలన్‌ని చూపించిన ఆ కొన్ని సన్నివేశాలలోను కార్డ్‌బోర్డ్ క్యారెక్టర్‌లా అనిపించడం, అతను ఏ క్షణంలోను హీరోకి త్రెట్‌లా అనిపించకపోవడంతో పేలవమైన సన్నివేశాలతో ద్వితియార్ధం కేవలం శుభం కార్డ్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది. విలన్ క్యారెక్టర్‌ని బలంగా రాసుకుని రజనీకి ఛాలెంజ్ విసిరినట్టయితే ఇదే దర్బార్ చాలా బెటర్‌గా అనిపించి వుండేది.
విలన్‌ని స్ట్రాంగ్‌గా చూపించే సన్నివేశాలు వదిలేసి ఈ వయసులో రజనీకాంత్ కండలు చూపించడంపై మురుగదాస్ శ్రద్ధ పెట్టాడంటేనే ఈ చిత్రం వరకు బుర్ర పెట్టే ఉద్దేశం లేదని కన్వే చేస్తున్నట్టు అనిపిస్తుంది. రజనీకాంత్ సూపర్‌స్టారే కానీ సూపర్ మ్యాన్ కాదు కదా… ఇలాంటి బలహీనమైన కథలోను ఈ వయసులో కండలు చూపించి విజిల్స్ కొట్టించడానికి. ఆ సన్నివేశాలలో అభిమానులు కూడా సైలెన్స్ పాటించడంతోనే మురుగదాస్‌కి నిరసన తెలిపినట్టపించింది. ఇక మాఫియా డాన్ల వ్యవహారం, వారి వేషధారణ, వారు చేసే పనులు చూస్తుంటే దీనికి దర్శకుడు మురుగదాసేనా లేక లారెన్స్ ఘోస్ట్ డైరెక్షన్ చేసాడా అనే డౌటొస్తుంది.
రజనీకాంత్ తన శక్తికి మించి ఈ చిత్రానికి భుజం కాయడానికి శ్రమించారు. నివేదా థామస్ తనకి ఇచ్చిన స్కోప్‌లోనే నటిగా ప్రతిభ చూపించింది. నయనతార మరోసారి హీరో పక్కన అలంకారంగా మాత్రం ఉపయోగపడింది. సునీల్ శెట్టి తనకెందుకు బాలీవుడ్‌లో అవకాశాలు లేవనేది తెలియజేసాడు. రజనీకాంత్ ఏజ్ మీద, తన సొంత లుక్స్ మీద జోక్స్ వేయడానికి యోగిబాబుని వాడుకున్నారు. చిన్నా చితకా పాత్రలు చేసిన వారిలో చాలా మంది పావలాకి రూపాయి నటనతో అనాలోచిత హాస్యానికి దోహదపడ్డారు.
‘తలైవా’ అంటూ అనిరుధ్ ఫాన్స్‌కి జోష్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు కానీ ఒక్క పాట అయినా వినసొంపుగా స్వరపరచలేదు. నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం మెప్పించాయి కానీ ఈ చిత్రాన్ని హోల్డ్ చేయాల్సిన మురుగదాసే అరకొర ప్రయత్నంతో కొన్ని ఫాన్ మూమెంట్స్‌ని మాత్రమే క్రియేట్ చేయగలిగాడు. మెట్రో స్టేషన్‌లో ఫైట్ లాంటివి ఫాన్స్‌కి, మాస్‌కి ఉత్సాహాన్నిస్తాయి. కానీ ఓవరాల్‌గా మురుగదాస్ ‘దర్బార్’ రజనీపై వయసుకి మించిన భారాన్ని మోపిన భావన కలిగిస్తుంది. రజనీకాంత్ అభిమానులు ఒకింత సంతృప్తి చెందినా కానీ మిగిలిన వారికి థియేటర్ వరకు వెళ్లి చూడాల్సిన అవసరముందా అనిపించేలా వుంది.
Content retrieved from: https://telugu.greatandhra.com/movies/reviews/darbar-telugu-movie-review-104761.html.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.