టాలీవుడ్ స్టార్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం రాంచీలో షూటింగ్‌లో ఉన్న అలీ, ఈ వార్త తెలిసి వెంటనే హైదరబాద్ బయలుదేరి వచ్చారు. జైతున్ బీబీ భౌతికకాయాన్ని కూడా హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జైతున్ బీబీ మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అలీ ఇంటికి వెళ్లి జైతున్ బీబీ భౌతిక కాయానికి నివాళులర్పించారు.అలీ కుటుంబం సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆమె మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. `అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలనమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.
అలీ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. పలు సందర్భాల్లో తన ఉన్నతి తల్లిదండ్రులే ప్రధాన కారణమని చెప్పారు. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా తల్లితో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. అంత గొప్ప నటుడైన ఓ సామాన్యుడిలా తల్లికి సేవలు చేసేవారు.