బడులకూ అక్రిడేషన్‌

Spread the love

*బడులకూ అక్రిడేషన్‌*

*రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఏర్పాటు*

*బడి సంచి లేని విధానానికి ప్రోత్సాహం* *జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యలో సంస్కరణలు*

Teluguwonders హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యను అందించే కళాశాలలకే పరిమితమైన అక్రిడేషన్‌ను పాఠశాలలకు విస్తరించనున్నారు. జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యలో సంస్కరణలు తీసుకురానున్నారు. శిశు తరగతుల నుంచి అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు అక్రిడేషన్‌ విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడేషన్‌ ఇచ్చేందుకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఉంది. పాఠశాలల కోసం స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎస్‌ఎస్‌ఎస్‌ఏ)ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. అన్ని పాఠశాలలు కనీసం వృత్తిపరమైన, నాణ్యమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ సంస్థ పాఠశాలల్లో భద్రత, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, పరిపాలనా విధానం తదితర అంశాలపై నిబంధనావళిని రూపొందిస్తారు. వాటి ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. ఏఏ కొలమానాలను పరిగణనలోకి తీసుకోవాలన్నది రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ)లు రూపొందిస్తాయి. ఉపాధ్యాయులకు నేషనల్‌ ప్రొఫెషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ టీచర్స్‌ (ఎన్‌పీఎస్‌టీ) పేరిట వృత్తిపరమైన ప్రమాణాలను నిర్దేశించేందుకు 2022 నాటికి ప్రొఫెషనల్‌ స్టాండర్డ్‌ సెట్టింగ్‌ బాడీ (పీఎస్‌ఎస్‌బీ)ని నెలకొల్పుతారు. తరగతికి తగ్గట్లు విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను నేర్చుకుంటున్నారో? లేదో? అంచనా వేసేందుకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ కేంద్రం ఆయా రాష్ట్రాల్లోని బోర్డులకు విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేసేందుకు రకరకాల విధానాలను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను ఆయా బోర్డులకు చేరుస్తుంది. బడికి పుస్తకాలు అవసరం లేదు బడి సంచి లేకుండా పిల్లలు పాఠశాలలకు వచ్చే విధానాన్ని ప్రోత్సహిస్తారు. ఏడాది మొత్తం వివిధ కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఈ విధానం అమలు చేస్తారు. కళలు, ఆటలు, వృత్తి విద్యల కార్యక్రమాల సమయంలో సంచి లేకుండా విద్యార్థులు బడులకు వస్తారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక స్థలాలను సందర్శించడంతో పాటు, స్థానికంగా ఉండే వివిధ రంగాల ప్రముఖలతో భేటీ అవుతారు. సమీపంలోని ఉన్నత విద్యాసంస్థలను సందర్శిస్తారు. పిల్లల్లో దాగి ఉన్న వివిధ కళలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో బాల భవన్‌లను ఏర్పాటు చేస్తారు. *అంతరాలను పెంచేలా నూతన విద్యావిధానం: యూటీఎఫ్‌* ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ నూతన విద్యావిధానం ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించి, ప్రజల మధ్య అంతరాలను మరింత పెంచేలా ఉందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగ భాగస్వాముల నుంచి సూచనలను ఆహ్వానించిన కేంద్రం ఏ సూచననూ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు. అయిదో తరగతి వరకు మాతృభాషలో బోధన అన్నది నిర్బంధమా? ఐచ్ఛికమా? అన్నది స్పష్టం చేయలేదన్నారు. 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు నిర్వహించడం పరోక్షంగా డిటెన్షన్‌ విధానాన్ని అమలు చేయడమేనని, అది పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందన్నారు. ఉన్నత విద్యలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతి, ప్రైవేటు కళాశాలలకు స్వయంప్రతిపత్తి వల్ల ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిచి ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా విద్యావిధానం ఉందని వారు పేర్కొన్నారు. ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ అమలులో భాగంగా డిజిటల్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం 6-10 తరగతులకు ప్రతిరోజూ ఒక పీరియడ్‌ టీశాట్‌ ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నారు. వాటిని కొనసాగిస్తూనే అదనంగా విద్యార్థులందరికీ కృత్య పత్రాలు (వర్క్‌షీట్లు) అందుబాటులోకి తెస్తారు. విద్యార్థులు చదువులో నిమగ్నమయ్యారా, లేదా? పాఠాలు చూస్తున్నారా, లేదా? పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను విధులకు రప్పించనున్నారు. అందరూ రావాలా.. కొందరా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీశాట్‌ యాప్‌లో ఉంచిన పాఠాల వీడియోలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వాట్సప్‌లో పంపిస్తారు. వర్క్‌షీట్లను ముద్రించి ఇస్తారా? వాట్సప్‌లో పంపిస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 40 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం ఇందుకు కారణం. డిజిటల్‌ పాఠాల బోధన తదితర అంశాలపై ముఖ్యమంతి కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడి ఆమోదం తీసుకోనున్నారని సమాచారం. ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజుల వసూళ్లపై ఆగస్టు 6న హైకోర్టులో కేసు విచారణకు రానుండడంతో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ తుది నిర్ణయం వెలువడనుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading