కహానియా..ఆన్‌లైన్‌ గ్రంథాలయా

Spread the love

*కహానియా..ఆన్‌లైన్‌ గ్రంథాలయా..* _వెయ్యి మైళ్ల నడక సాగాలన్నా.. ఒక అడుగుతోనే మొదలవుతుంది..ఈ కథల లైబ్రెరీ కూడా ఒక్కరితోనే మొదలైంది.. ఇప్పుడు అందులో లక్షమంది పాఠకులు.. ఇరవై కోట్ల ఎకనమిక్‌ ఇంపాక్ట్‌తో..300 మంది మహామహా రచయితలను ఒక తాటి మీదకి తీసుకు వచ్చింది.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. ఫర్‌ ఇండియా’ నినాదంతో.. పదకొండు భాషల రచనలకు ఒక వేదికగా నిలుస్తున్నది. అదే ‘కహానియా’ వెబ్‌సైట్‌.. అంతకుమించి చెప్పాలంటే అదొక కథల గ్రంథాలయం.._ కహానియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే.. ఎవరి అభిరుచికి తగ్గ కథలు, కథనాలు వాళ్లు చదువుకోవచ్చు. నచ్చిన కథను ఎంచుకొని ఫీజు చెల్లిస్తే చాలు.. తీరికగా చదివేయొచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకూ ఉన్నది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్‌ తదితర 11 భాషల్లోని కథలు, రచనలు చదువొచ్చు. తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం వంటి రచయితలు కహానియాలో తమ అనుభవాలను పంచుకుంటుండటం విశేషం. *క్యాంపెయిన్‌ ద్వారా* కహానియాలో కథలు చదువడమే కాదు.. రాయొచ్చు కూడా. భిన్నమైన కథా వస్తువు, ఆకట్టుకునే రచనా శైలి ఉంటే… ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌పై కథల సాగు మొదలుపెటొచ్చు. కథలు చంకన పెట్టుకొని పబ్లిషర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. డిజిటల్‌ ప్రింట్‌లో మీ రచనలు ఒక చోట నిక్షిప్తం చేయొచ్చు. మీ రచనలు కహానియా లైబ్రరీలో జాగ్రత్తగా దాచి ఉంచుతారు. అవి పాఠకులకు చేరేలా వెబ్‌సైట్‌ నిర్వాహకులే చూసుకుంటారు. వివిధ భాషల్లోని కథలకు స్పెషల్‌ క్యాంపెయిన్‌ కూడా చేస్తుంటారు ఇక్కడ. దీని ద్వారా పబ్లిషర్లను కలుసుకునే అవకాశమూ దక్కొచ్చు. *వెబ్‌సైట్‌ నుంచి వెబ్‌ సిరీస్‌ వరకు* మనం రాసిన కథకు నాలుగు లైకులు వస్తేనే ఆనందపడిపోతాం. అదే కథ వెండితెరకెక్కితే..! రచయిత సంతోషానికి పట్టపగ్గాలుండవు. అలాంటి కలను నిజం చేస్తోంది కహానియా. సినీరంగానికి మీ రచనలు కనెక్ట్‌ చేసే బాధ్యతను వెబ్‌సైట్‌ నిర్వాహకులు భుజానికెత్తుకున్నారు. కహానియా నుంచే ఆత్రేయ దేశ్‌రాజ్‌ సినీ రచయితగా మారాడు. 2016లో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథను రాశాడు ఆత్రేయ. దాన్ని 2018లో కహానియాలో పోస్ట్‌ చేశాడు. అదే 2019లో కల్కి సినిమాగా వెండితెరకెక్కింది. కహానియా కనెక్ట్‌ ద్వారా కొత్త రచయితలు పుట్టుకొస్తున్నారు. మరింత సమాచారం కోసం konnect@ kahaniya.com ద్వారా వారిని సంప్రదించవచ్చు. *కలుసుకోవడం* మీ కథలను నలుగురికి వినిపించి అందులో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుంటే.. మరింత మంది పాఠకులను అలరించొచ్చు. కొత్త కథావస్తువు దొరుకొచ్చు. ఇందుకోసం కహానియా ‘మిలేంగే’ అవకాశం కల్పిస్తున్నది. దీని ద్వారా.. ఇరవై నుంచి ఇరవై ఐదు మంది రచయితలు ఒక కమ్యూనిటీగా ఏర్పడొచ్చు. వారానికి ఒకసారి వీరిని కలిపే కార్యక్రమం కూడా ఉంటుంది. ఒక కమ్యూనిటీని గత ఏడాది మొదలుపెట్టారు. ఆ తర్వాత నెలలోనే పదిహేను కమ్యూనిటీలు తయారయ్యాయి. ఒకవేళ మిలింగే కమ్యూనిటీలో మీరూ భాగం కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. melange@kahaniya.com మెయిల్‌ చేస్తే మరింత సమాచారం లభిస్తుంది. ఇలా ఆన్‌లైన్‌ వేదికగా.. కథా కర్షకులకు సరికొత్త ఉత్సాహాన్నిస్తున్న కహానియా ఈ తరం రచయితలకు, పాఠకులకు సరికొత్త అవకాశాలను, అనుభూతులను అందిస్తున్నది. కహానియా ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. ఆదిత్య కె.వి. అనే రచయిత ఏడేండ్ల నుంచి ఒక స్క్రిప్ట్‌ రాసుకున్నాడు. దాన్ని పబ్లిష్‌ చేయాలని అనుకున్నాడు. తన కల.. కలగానే మిగిలిపోతుందని భావించాడు. కహానియా లాంచ్‌ ప్యాడ్‌ ద్వారా అమెజాన్‌ టాప్‌ 30 పబ్లిషింగ్‌లో ఒకటయిన దైత్య డైరీస్‌ తన పుస్తకాన్ని పబ్లిష్‌ చేసేందుకు ఒప్పుకున్నది. ఈ క్యాంపెయిన్‌ గురించి ఏవైనా సందేహాలుంటే ఉంటే.. launchpad@kahaniya.com పంపొచ్చు. ఒక పుస్తకం.. మంచి స్నేహితుడితో సమానం అంటారు. మంచి కథ చదివితే కలిగే ఆనందం వేరు. కానీ కాలక్రమంలో ఎన్నో పుస్తకాలు కనుమరుగవుతున్నాయి. ఇంటర్నెట్‌లో ఇంగ్లిష్‌ సాహిత్యానిదే డామినేషన్‌. బ్లాగులు, స్టోరీ టెల్లింగ్‌.. ఏ విభాగం చూసుకున్నా.. ఇంగ్లిష్‌ భాషను ఎంచుకున్నవారిదే రాజ్యంగా నడుస్తున్నది. కానీ, మనదేశంలో ప్రాంతీయ భాషల్లో అర్థవంతమైన సాహిత్యం ఎంతో ఉంది. వాటిని సృజించిన అజ్ఞాత రచయితలు ఎందరో ఉన్నారు. ఆర్థిక వనరులు లేక.. చాలామంది వారి సాహిత్యాన్ని అచ్చువేయించే పరిస్థితుల్లో లేరు. వీరందరినీ ఒక వేదిక పైకి తెస్తున్నది (www.kahaniya.com).


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading