*వొడాఫోన్ ఐడియా.. ఇక ‘వి’*
*కొత్త బ్రాండు ఆవిష్కరణ*
*సుప్రీంకోర్టు తీర్పుపై కంపెనీ హర్షాతిరేకం*
*టారిఫ్‌లను పెంచాలని ప్రభుత్వానికి వినతి*
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) తన బ్రాండు పేరును ‘వి’ (విఐ)గా మార్చుకుంది. సోమవారం దృశ్యశ్రవణ మాధ్యమం (వర్చువల్) ద్వారా ఈ కొత్త బ్రాండును ఆవిష్కరించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఈ టెలికాం సంస్థకు..
ఏజీఆర్ బకాయిలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్ ఐడియా తనను తాను పునర్నిర్మాణం చేసుకోవడంపై దృష్టి సారించింది. తద్వారా ఇప్పటివరకు తాను కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు 28 కోట్ల మంది చందాదార్లు ఉన్నారు. ఇక నుంచి వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ‘వి’గా వ్యవహరించాలని కంపెనీ తెలిపింది. ఈ రెండు బ్రాండ్ల అనుసంధానంతో ప్రపంచ టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియ పూర్తయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది.
‘రెండేళ్ల క్రితం విలీన సంస్థగా వొడాఫోన్ ఐడియా అవతరించింది. అప్పటి నుంచి రెండు సంస్థలకు చెందిన నెట్‌వర్క్‌ల అనుసంధానం, చందాదార్లు, విధానాల విలీనంపై దృష్టి సారించామ’ని వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ చెప్పారు.
బ్రాండ్ల అనుసంధానంతో కేవలం ప్రపంచంలోని టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా..
తన 4జీ నెట్‌వర్క్‌పై కోట్ల మంది భారతీయులకు అత్యుత్తమ డిజిటల్ అనుభూతిని అందించే దిశగా భవిష్యత్ ప్రయాణానికి కంపెనీ సిద్ధమయ్యిందని అన్నారు.
ఈక్విటీ, డెట్ సెక్యూరిటీస్‌ల జారీ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదనకు గత వారం కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ కొత్త బ్రాండు ఆవిష్కరణ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఏజీఆర్ బకాయిలను చెల్లించేందుకు 10 ఏళ్ల సమయాన్ని సుప్రీంకోర్టు ఇవ్వడంతోనూ వొడాఫోన్ ఐడియా ఊపిరి పీల్చుకుంది. రుణ పరిమితిని రూ.1 లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఈ నెల 30న జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదార్ల అనుమతిని కోరనున్నట్లు వొడాఫోన్ ఐడియా వెల్లడించింది.
*టారిఫ్‌లు పెంచితేనే లాభాలు*
ఏజీఆర్ బకాయిలను చెల్లించేందుకు సుప్రీంకోర్టు 10 ఏళ్ల సమయం ఇవ్వడం మంచి పరిణామమని వొడాఫోన్ ఐడియా తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు టెలికాం సంస్థలకు ఎంతో ఉపయోగకరమని, రాబోయే పదేళ్లకు ప్రణాళిక రూపకల్పనకు దోహదం చేస్తుందని వొడాఫోన్ ఐడియా ఎండీ రవీందర్ టక్కర్ అన్నారు. అయితే మిగిలిన రూ.50,000 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు సరిపడా నిధులు కంపెనీ వద్ద ఉన్నాయా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. కంపెనీలకు స్థిరమైన ప్రతిఫలం రావాలంటే మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థలు కలిసి కనీస ధరను నిర్ణయించాలని చెప్పారు. భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు స్థిరంగా లేవని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన సేవల కోసం ప్రస్తుతం చెల్లిస్తున్న దానికి అదనంగా టారిఫ్‌లను చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.