*నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం

Spread the love

*సాంకేతిక విద్యకు కొత్త చేవ!*

*నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం*

ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఇంజినీర్లు వెన్నెముక లాంటివారు. భారత్‌లోని అత్యధిక శాతం ఇంజినీరింగ్‌ పట్టభద్రులు నైపుణ్యాలు, పరిశోధన, నూతనావిష్కరణల్లో వెనకబడి ఉన్నారు. 2019 వార్షిక ఉపాధి యోగ్యత సర్వే నివేదిక ‘ఎస్పైరింగ్‌ మైండ్స్‌’ ప్రకారం, 80శాతం భారతీయ ఇంజినీర్లు ఇప్పటి విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగానికి పనికిరారు. కేవలం 2.5 శాతమే పరిశ్రమకు అవసరమైన కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉన్నారు. ఉన్నతవిద్య నాణ్యత, ఉపయోగిత- ఇప్పటికీ భారత్‌కు ప్రధాన సవాళ్లుగా మిగిలాయి. అంతర్జాతీయంగా ఇంజినీరింగ్‌ విద్య శరవేగంతో ఉపాధ్యాయ-కేంద్రక స్థితి నుంచి విద్యార్థి-కేంద్రక దిశగా గుణాత్మక పరివర్తనకు లోనవుతోంది. విషయ ప్రాధాన్యం నుంచి ఉత్పత్తి ప్రధాన విద్య దిశగా మార్పు చోటుచేసుకుంటోంది. విజ్ఞానార్జన స్థానంలో విజ్ఞాన పంపకం ముందుకొచ్చింది. గురువులు మార్గదర్శకులుగా మారుతున్నారు. సంప్రదాయ ఇంజినీరింగ్‌ విభాగాలు అంతర్‌ విభాగ కోర్సులవుతున్నాయి. డిజిటల్‌ బోర్డులకు చోటిచ్చి నల్లబల్ల, సుద్దముక్కలు కనుమరుగవుతున్నాయి. అచ్చు పుస్తకాలు అంతరిస్తూ ఈ-బుక్స్‌ అవతరిస్తున్నాయి. ఈ మార్పుల జాబితా అనంతంగా సాగుతూ ఉంది._

*నైపుణ్యాల్లో వెనకబాటు* భారత్‌లో మాత్రం ఇంకా సాంప్రదాయిక బోధన-అభ్యసన పద్ధతులకు కొద్దిగా వ్యావహారిక శిక్షణను మేళవించి అనేక సంస్థలు తరగతులు నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ ర్యాంకింగుల్లో వాటి స్థానం దీన్ని ప్రతిఫలిస్తోంది. ఇందుకు కొన్ని మినహాయింపులు లేకపోలేదు. పురాతన కాలంలోనే ఇంజినీరింగ్‌, వైద్యం, కళలు, సంగీతం ఇత్యాదులపై పట్టు సాధించిన దేశం ఇప్పుడు సాంకేతిక విద్యలో దారుణంగా దెబ్బతింది. గడచిన రెండు దశాబ్దాల్లో, భారత్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య శరవేగంగా పెరిగింది. ఇంజినీర్లు కొత్త తయారీ ప్రక్రియలను ఉత్పత్తులను అభివృద్ధి చేస్తారు. ఇంధనం, రవాణా, సమాచార వ్యవస్థలను రూపొందిస్తారు, వాటిని నిర్వహిస్తారు. పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తారు. అధునాతన వైద్య పరికరాలను సృష్టిస్తారు. ఇలాంటివి మరింకెన్నో వారి ఆవశ్యకతను చాటిచెబుతాయి. ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యత అంటే మేధాపరమైన నైపుణ్యాలను విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడమే. తద్వారా నాణ్యమైన విద్య ఆర్జించిన ఇంజినీరింగ్‌ పట్టభద్రులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నూతన ఆవిష్కరణకర్తలుగా, సమర్థ నిర్ణాయకులుగా భాసిల్లి సమాజాభివృద్ధికి దోహదపడగలుగుతారు. నైపుణ్యాలతో కూడిన విద్యతోనే నాణ్యమైన ఇంజినీర్లు తయారవుతారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు-అధ్యాపక నిష్పత్తి (పీటీఆర్‌) 33:1గా ఉంటోంది. ఇది ఏటికేడు పెరుగుతోంది. ఏఐసీటీఈ సిఫార్సు చేసిన పీటీఆర్‌ 20:1. దీని ప్రకారం, భారత్‌లో దాదాపు 76,000 మంది అధ్యాపకుల కొరత ఉంది. ఈ పీటీఆర్‌ అమెరికాలో 12:1, చైనాలో 19:1గా ఉంది. నవతరపు నైపుణ్యాలుగల సుశిక్షితులైన బోధనా సిబ్బంది కొరవడటమే భారత్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. భారతీయ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల్లో వార్షిక వృద్ధిరేటు సగటున 3.7 శాతం క్షీణిస్తోందని నివేదికలు చాటుతున్నాయి. అసోచామ్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (ముంబయి)ల సంయుక్త అధ్యయనం ప్రకారం, భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కోసం ఏడాదికి 700 కోట్ల డాలర్లు (రూ.51,000 కోట్లు) ఖర్చు పెడుతున్నారు. దీనికి కారణం, దేశీయ ఉన్నత విద్య నాణ్యతా ప్రమాణాలు నాసిరకంగా ఉండటమేనని ఈ అధ్యయనం కుండ బద్దలుకొట్టింది. *కాలానుగుణంగా మారితేనే…* నాసిరకం ఇంజినీరింగ్‌ విద్య భారత్‌కు సమస్యాత్మకంగా మారుతోంది. ఐఐటీలు, మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలు మినహా దేశంలోని అత్యధిక శాతం ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నాయి. దాంతో వారు తగిన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పలు పరిశోధనాత్మక అధ్యయనాల ప్రకారం, ఇప్పటి ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 80 శాతానికి ఉద్యోగ యోగ్యత లేదు. విద్యాబోధనలో నాణ్యత, నైపుణ్యాలతో ప్రతి విద్యార్థి జీవితాన్నీ మెరుగుపరచడంలో అధ్యాపకులు ప్రధాన పాత్ర పోషించాలి. అధ్యాపకులు తాము నిరంతరం ఆధునికతను అందిపుచ్చుకొంటూ ఉండాలి. నాణ్యమైన బోధన, పరిశోధనల మీద దృష్టి సారించడానికి బోధనా సిబ్బందికి తగిన సమయం, అవకాశాలను కల్పించాలి. ఇంజినీరింగ్‌ విద్యలో వివిధ అభ్యసన అంశాలను అనుసంధానించాలన్నది ఒక వినూత్న భావన. సమస్యలను ఛేదించడానికి, పరిష్కారాలు సూచించడానికి విభిన్న ఇంజినీరింగ్‌ కోర్సుల్లో వివిధ విభాగాల నడుమ అనుసంధానత అవసరమవుతోంది. వర్తమాన వాస్తవికత ప్రతిఫలించేలా భవిష్యత్‌ కోర్సులు రూపొందాలి. దేశంలోని సాంకేతిక విద్యాసంస్థలు ‘మల్టీడిసిప్లినరీ ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌’లను ప్రవేశపెట్టాలి. శరవేగంగా దూసుకు వస్తున్న మార్పులకు, పరిశ్రమల డిజిటైజేషన్‌కు అనువుగా భవిష్యత్‌ ఇంజినీర్లు రూపుదిద్దుకోవాలి. ఇందుకోసం వారికి ప్రత్యేకమైన పాఠ్యాంశాలు అవసరమవుతాయి. పోటీ, ఉత్పాదకత, వినూత్నత నిండిఉండే ప్రపంచంలో మనగలగాలీ అంటే- విద్యార్థులు తమ నైపుణ్యాలను కాలానుగుణంగా పెంచుకోవాలి. నిజజీవిత పారిశ్రామిక అనుభవాన్ని సంపాదించుకోవాలి. అవకాశాలను గుర్తించి ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. ఈ తరం విద్యార్థులకు ఇది కష్టతరమైనదేమీ కాదు. టెక్నికల్‌, డిజిటల్‌ అంశాలపై వారికి తగినంత అవగాహన, మక్కువ ఉన్నాయి. ఇవన్నీ వాస్తవరూపం దాల్చితే, భారత ఇంజినీరింగ్‌ విద్యావ్యవస్థ అంతర్జాతీయంగా పోటీపడగలిగే ఉన్నతస్థాయి ఇంజినీర్లను తయారు చేయగలుగుతుంది. తద్వారా ప్రపంచ హైటెక్‌ విపణిలో తనదైన ముద్ర వేస్తుంది. దేశంలో ఇంజినీరింగ్‌ విద్యకు ఓ కొత్త ‘ప్లేబుక్‌’ రాసేందుకు ఇదే సరైన సమయం! *కిం కర్తవ్యం?* సాంప్రదాయిక ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌ సీట్లు 40 శాతమే భర్తీ అవుతుండగా- కంప్యూటర్‌ సైన్స్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, మెకాట్రానిక్స్‌లో 60 శాతం దాకా నిండుతున్నాయని ఏఐసీటీఈ 2020 తాజా నివేదిక వెల్లడించింది. సాంప్రదాయిక ఇంజినీరింగుకు భిన్నంగా వర్ధమాన సాంకేతికతలకు గిరాకీ ఉందని ఈ గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్‌-డిజైన్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, (ఏఆర్‌ అండ్‌ వీఆర్‌) వంటి కొత్త సాంకేతికతలతో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాములు, కోర్సులు ప్రవేశపెట్టడం తప్పనిసరి. బహుళ విషయక ఇంజినీరింగ్‌ కోర్సులపై ప్రత్యేకించి కాంప్యుటేషనల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌, మెకాట్రానిక్స్‌, స్పేస్‌ సైన్స్‌, ఏరోస్పేస్‌, వ్యవసాయ, పర్యావరణ ఇంజినీరింగ్‌తో కూడిన కోర్సులపై గట్టిగా దృష్టి పెట్టితీరాలి. విద్యార్థుల్లో ‘డిజైన్‌ థింకింగ్‌’ను అభివృద్ధిపరచాలి. తరగతి గదిలో విజ్ఞానం నేర్వడం, నేర్చినదాన్ని వాస్తవ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలచుకోవడం వంటి అంశాల్లో ఆచరణాత్మక విధానాలు అవలంబించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading